రోడ్లు అద్దాల్లా ఉండాలి

7 Feb, 2019 01:00 IST|Sakshi

రోడ్డు భద్రతకు పెద్దపీట: సునీల్‌శర్మ

సాక్షి, హైదరాబాద్‌: రోడ్ల నిర్మాణంలో భద్రత, నాణ్యతకు పెద్దపీట వేయాలని ఆర్‌అండ్‌బీ కమిషనర్‌ సునీల్‌శర్మ అన్నారు. రోడ్లు అద్దాల్లా ఉండాలన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో ఆర్‌అండ్‌ బీ ఆధ్వర్యంలో రాబోయే 5 ఏళ్లలో రోడ్ల స్థితిగతులు, చేపట్టాల్సిన పనులపై మేధోమథనం జరిగింది. రాష్ట్రంలోని రోడ్ల స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశించిన క్రమంలో ఈ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సునీల్‌శర్మ ఇంజనీర్లకు పలు విషయాల్లో దిశానిర్దేశం చేశారు. రాబోయే ఐదేళ్లలో చేయాల్సిన పనులపై ఈ నెల 15లోగా సమగ్ర నివేదిక రూపొం దించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీని ఆధారంగా బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపుతామన్నారు. 

త్వరలో ఖాళీల భర్తీ: గణపతిరెడ్డి
ఆర్‌ అండ్‌ బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రోడ్లు దేశంలోనే గర్వపడేలా నిర్మించాలన్నారు. పని ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో 135 ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్నారు. మరో ఈఎన్‌సీ లింగయ్య మాట్లాడుతూ, క్షేత్రస్థాయి లో పనిచేసే ఇంజనీర్లకు ఫిక్స్‌డ్‌ ట్రావెల్‌ అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్ల నిర్వహణ కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని ఈఎన్‌సీ రవీందర్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

బాంబులపై అవగాహన అవసరం: సతీశ్‌
నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తోన్న సిబ్బందికి మావోలు అమర్చే బాంబులపై అవగాహన కల్పించాలని చీఫ్‌ ఇంజనీర్‌ సతీశ్‌ కోరారు. ఐ–సాప్‌ ద్వారా రుణం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని చీఫ్‌ ఇంజనీర్‌ చందూలాల్‌ కోరారు. మరో చీఫ్‌ ఇంజనర్‌ ఆశారాణి పంచాయతీ రోడ్ల పురోగతి వివరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా