పోలీసుల అదుపులో దళనేత ‘సాగర్‌’!

9 Dec, 2017 03:42 IST|Sakshi

మరో ఇద్దరు అనుచరులు కూడా..

మిర్యాలగూడ/హైదరాబాద్‌: సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన దళ నేత, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్‌ సాగర్‌ను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సాగర్‌తో పాటు మరో ఇద్దరు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే.. సాగర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ ధ్రువీకరించడం లేదు. కాగా సాగర్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షుడు సుబ్బారావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సాగర్‌ను వెంటనే కోర్టులో హాజరుపరచాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేతలు శుక్రవారం హైదరాబాద్‌లో అదనపు డీజీపీ అంజనీకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. సాగర్‌ ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదని, ప్రాణహాని తలపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. అదనపు డీజీపీని కలసిన వారిలో ఎస్‌.వెంకటేశ్వర్‌రావు, కె.గోవర్ధన్, వి.సంధ్య, ఎం.శ్రీనివాస్, అనురాధ, అచ్యుత రామారావు తదితరులు ఉన్నారు.  

ఎమ్మెస్సీలో గోల్డ్‌ మెడల్‌
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజుపేటకి చెందిన ఏనుగు చంద్రారెడ్డి అలియాస్‌ సాగర్‌ విద్యార్థి దశలోనే పీడీఎస్‌యూ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ గోల్డ్‌ మెడల్‌ సాధించారు. తర్వాత ఖమ్మంలో కార్మికనేతగా పనిచేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

మరిన్ని వార్తలు