పోలీసులకు సహకరించడం మన బాధ్యత: సాయి పల్లవి

20 Feb, 2020 13:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని, వారు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా గ్రేట్‌ అని హీరోయిన్‌ సాయి పల్లవి అన్నారు. హైదరాబాద్‌లో మహిళలకు ఉన్న భద్రత మరెక్కడా లేదని అభిప్రాయపడ్డారు. హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం మహిళల భద్రత, ఇతర అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఈ సదస్సులో హీరోయిన్‌ సాయిపల్లవితో పాటు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతి లక్రా, సైంటిస్ట్‌ టెస్సీ థామస్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ.. చదువు, ఉద్యోగాల కోసం సిటీకి వచ్చే మహిళలు, యువతులు, వారి తల్లిదండ్రులు భయపడేవారని కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. పోలీసుల భద్రతతో మహిళలు నిశ్చింతగా ఉంటున్నారన్నారు. పోలీసులకు సహకరించడం మనందరి బాధ్యత అని సాయి పల్లవి అన్నారు. 

పోలీసులకు సెల్యూట్‌ చేస్తున్నా: థామస్‌
సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌కు సెల్యూట్‌ చేస్తున్నట్టు సైంటిస్ట్‌ టెస్సీ థామస్‌ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మహిళలకు భద్రత ఎక్కువగా ఉందని కొనియాడారు. ‘సమానత్వం అంటారు. కానీ ఆస్తులు పురుషుల పేర్లపై పది శాతం ఉంటే మహిళల పేర్లపై ఒక శాతం మాత్రమే ఉంటున్నాయి. నిర్ణయాలు స్వతహాగా తీసుకునేలా మహిళలు తయారవ్వాలి. మిస్సైల్‌ అగ్ని-4కు డైరెక్టర్‌గా నన్ను నియమించినప్పుడు పెద్ద ప్రాజెక్ట్‌ చేపట్టడానికి ముందు భయపడ్డాను. మన ముందు ఉండే సవాళ్లను స్వీకరించి ఎదుర్కొనేందుకు సిద్దం అయితే విజయం సాధిస్తాం. ఎదుటి వారి విమర్శలను కూడా పాజిటీవ్‌గా తీసుకోవాలి’ అని థామస్‌ వ్యాఖ్యానించారు. సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలోని మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ సేఫ్‌ అనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఈ సదస్సులో పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

చదవండి:
త్వరలో  ‘షీ సేఫ్‌’ యాప్‌ 
‘రష్మిక చించావ్‌ పో’.. అది నేనన్లేదు

మరిన్ని వార్తలు