సాయికృష్ణకు అండగా ఉంటాం

9 Jan, 2019 01:01 IST|Sakshi
క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కలసిన సాయికృష్ణ తల్లిదండ్రులు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భరోసా

కేటీఆర్‌ను కలిసిన సాయికృష్ణ తల్లిదండ్రులు

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో దుండగుల చేతిలో కాల్పులకు గురై చికిత్స పొందుతున్న మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన విద్యార్థి సాయికృష్ణకు అండగా ఉంటామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు తెలిపారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లోని కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ప్రభుత్వం సహకరించాలని కోరారు. సాయికృష్ణ తల్లిదండ్రులు వెంటనే అమెరికా వెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్‌ వారికి హామీ ఇచ్చారు. సాయికృష్ణ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాయికృష్ణ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని, అయితే పలు శస్త్ర చికిత్సలు అవసరమని అక్కడ ఉన్న సాయికృష్ణ మిత్రులు తెలియజేశారని తల్లిదండ్రులు కేటీఆర్‌కు తెలిపారు.

సాయికృష్ణకు అవసరమైన తక్షణ వైద్య సహాయంపై అమెరికాలోని కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయానికి ఎన్‌ఆర్‌ఐ శాఖ అధికారులు సమాచారం అందించారని, అవసరమైతే మరింత సహకారం కోసం విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడతామని వారికి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. దీనికోసం మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ నేరుగా సుష్మాస్వరాజ్‌ని కలిసినట్లు కేటీఆర్‌ తెలిపారు. సాయికృష్ణకు ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా వెద్య సహాయం అందుతోందని, అయితే బీమా సౌకర్యం లేకపోవడంతో తమకు ఆర్థికంగా సాయం అవసరమవుతుందని వారు కేటీఆర్‌ను కోరారు.

ముందుగా కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అత్యవసర వీసాలను జారీ చేయాల్సిందిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హెడ్డాతోనూ కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. రవా ణా ఖర్చులతోపాటు, కొంత ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణమే అందిస్తామని తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి ఆసరాగా నిలబడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సాయికృష్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.  

మరిన్ని వార్తలు