అన్నీ మేమే ఇస్తే.. మీరేం చేస్తారు..?

4 Feb, 2018 03:23 IST|Sakshi

చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌

సిరిసిల్ల: ప్రభుత్వమే భూమి ఇచ్చి.. షెడ్డు నిర్మించి, రోడ్లు వేసి, సాంచాలు అందజేసి, వస్త్రోత్పత్తి ఆర్డర్లు కేటాయించి, బట్ట కొనుగోలు చేస్తే.. ఇక మీరేం చేస్తారు..? అని నేతకార్మికులను రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేత బజారులో శనివారం ‘వర్కర్‌ టూ ఓనర్‌’పథకంపై నేత కార్మికులతో ఆమె సమీక్షించారు. 

ప్రభుత్వం పవర్‌లూమ్‌ కార్మికులను యజమానులుగా మార్చేందుకు పథకాన్ని రూపొందించిందని చెప్పారు. ఈ క్రమంలో బిట్ల దుర్గయ్య ‘‘కార్మికులకు నెలకు రూ.15 వేల జీతం వచ్చే విధంగా చూడాలని, ఈ పథకం మళ్లీ యజమానులకే లాభం చేస్తుందని’’చెప్పాడు. దీనికి కార్మికులు చప్పట్లు కొట్టడాన్ని శైలజారామయ్యర్‌ తప్పు పట్టారు.

కార్మికులను యజమానులుగా చేయడానికి ప్రభుత్వం రూ.200 కోట్లు వెచ్చిస్తుండగా.. ఇంకా కార్మికులుగానే ఉంటామని చప్పట్లు కొట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ పథకం వద్దంటే చెప్పండి.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరో పథకానికి ఆ నిధులు ఖర్చు చేయాలని నివేదిక ఇస్తామని చెప్పారు. 20 శాతం పెట్టుబడి సమకూర్చుకుంటే కార్మికులు యాజమానులుగా మారుతారని వివరించారు. కార్మికుడి పెట్టుబడి ఐదు శాతానికి తగ్గించాలని కార్మిక నాయకులు కోరారు.  

మరిన్ని వార్తలు