డ్యాన్స్‌ జోష్‌

25 Jan, 2019 10:40 IST|Sakshi

ఉత్సాహంగా ‘సాక్షి’ ఎరీనా     యూత్‌ఫెస్ట్‌..

హోరెత్తిన సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల..

నేడు పబ్లిక్‌ స్పీకింగ్‌ పోటీలు..

గన్‌ఫౌండ్రీ :   విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్‌  నిర్వహిస్తున్న ‘సాక్షి’ ఎరీనా యూత్‌ ఫెస్ట్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. గురువారం కింగ్‌కోఠిలోని సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ ఆండ్‌ పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఎరీనా యూత్‌ఫెస్ట్‌లో భాగంగా డ్యాన్స్, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు తమదైన శైలిలో ఆటపాటలతో సందడి చేశారు. ఈ పోటీలకు జంట నగరాలలోని కళాశాలలకు చెందిన విద్యార్థులతో పాటు పరిసర ప్రాంతాల కళాశాలలకు చెందిన విద్యార్థులు సైతం ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విన్‌సెంట్‌ అరోకియాదాస్‌ మాట్లాడుతూ.. విద్యతో పాటు వివిధ అంశాలలో విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించేందుకు ‘సాక్షి’ యాజమాన్యం వివిధ అంశాలలో పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల్లో భాగంగా శుక్రవారం పబ్లిక్‌స్పీకింగ్‌పోటీలు నిర్వహిస్తారు.

డాన్స్‌ హంగామా..
యూత్‌ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన డ్యాన్స్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి.  డ్యాన్స్‌మాస్టర్‌ నరేష్‌ ఆనంద్‌ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ పోటీలలో సింగిల్స్‌ విభాగంలో సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలకు చెందిన రియా ప్రథమ స్థానంలో నిలవగా, ఇదే కళాశాలకు చెందిన అఖిలరెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచింది. డబుల్స్‌ విభాగంలో ఏస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ప్రత్యూష, దీప్తిల బృందం ప్రథమస్థానంలో నిలవగా సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాలకు చెందిన తనిషా బృందం ద్వితియస్థానంలో నిలిచారు. మనయొక్క ఓటు అనే అంశంపై నిర్వహించిన వక్తృత్వ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ఓటు విలువ, ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు మాట్లాడిన తీరు ఆలోచింప చేసింది. ఓయూ పీజీ కళాశాలకు చెందిన యోగిత ప్రథమస్థానంలో నిలవగా సెయింట్‌ జోసెఫ్‌ పీజీ కళాశాలకు చెందిన శ్రావణ సంద్య ద్వితీయస్థానంలో నిలిచింది.

ఆనందంగా ఉంది  
‘సాక్షి’ యూత్‌ఫెస్ట్‌లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు కొత్త స్నేహితులను సైతం పొందగలిగాను. ‘సాక్షి’ యాజమాన్యం ఇలాంటి యూత్‌ఫెస్ట్‌లు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను.     –శ్రీకాంత్, సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల విద్యార్థి  

చక్కటి వేదిక
మాలో దాగి ఉన్న  ప్రతిభ, నైపుణ్యాలాను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు మరెన్నో మెలకువలను తెలుసుకునేందుకు ఈ యూత్‌ఫెస్ట్‌ చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. ప్రతిఏటా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి   ప్రతిభకలిగిన విద్యార్థులను ప్రపంచానికి తెలియజేయాలి.    –  సోను, సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాల విద్యార్థిని 

మరిన్ని వార్తలు