ప్రజలు మెచ్చిన పాత్రికేయుడు మురళి 

21 May, 2018 10:18 IST|Sakshi
‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు మురళి, చంద్రకళ దంపతులను సత్కరిస్తున్న రోశయ్య, పొత్తూరి వెంకటేశ్వరరావు. చిత్రంలో ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ,  కళా జనార్దనమూర్తి, వరదాచారి, శివప్రసాద్‌ తదితరులు   

‘సాక్షి’ సంపాదకుడు వర్ధెల్లి మురళికి ‘శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం–2018’ ప్రదానం  

సత్కార సభలో కొనియాడిన వక్తలు

సనత్‌నగర్‌ : పాత్రికేయులు రాసే ఏ వార్తయినా ప్రజలకు అర్థమయ్యేట్టు ఉండాలని, లేకుంటే ఉపయోగం ఉండదని మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అన్నారు. సామాన్య ప్రజలు మెచ్చుకునేలా, ఆకట్టుకునేలా వార్తలు రాయడంలో వర్ధెల్లి మురళి పేరుప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం–2018 ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి కళా సుబ్బారావు కళావేదిక (శ్రీ త్యాగారయ గానసభ)లో కనుల పండువగా జరిగింది. రాజకీయ ఉద్దండులు, సీనియర్‌ పాత్రికేయుల సమక్షంలో ‘సాక్షి’ దినపత్రిక సంపాదకులు వర్ధెల్లి మురళి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక సమితి, శ్రీత్యాగరాయ గానసభ, సాధన సాహితీ స్రవంతి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోశయ్య మాట్లాడారు. సేవాతత్పరుడు, స్వాతంత్య్ర ఉద్యమకారుడు, పాత్రికేయుడు మాదల వీరభద్రరావు పురస్కారాన్ని మురళికి ప్రదానం చేయడం సముచితమన్నారు.

ప్రెస్‌ అకాడమీ పూర్వ అధ్యక్షుడు పొత్తురి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మచ్చలేని రాజనీతికి దర్పణంగా మాదల వీరభద్రరావు నిలుస్తారన్నారు. నాగార్జున ప్రాజెక్టుపై గోపాలకృష్ణ, మాదల రాసిన వ్యాసాలు ఎవరూ రాయలేదని, వారి వ్యాసాలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రేరేపించాయన్నారు. సీనియర్‌ పాత్రికేయుడు వరదాచారి మాట్లాడుతూ.. ప్రస్తుతం మీడియా రంగంలో సంచలనం పెరిగిందని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియా అవలంబిస్తున్న విధానాలపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ.. మురళిని అజ్ఞాత సూరీడుగా అభివర్ణించారు. తొమ్మిదేళ్లు సంపాదకులుగా ఉండి ఎక్కడా ఆయన వేదికలను పంచుకోలేదన్నారు. సబ్‌ ఎడిటర్‌ నుంచి అనుభవాన్ని గడించి ఎడిటర్‌ స్థాయికి ఎదిగిన వారు తక్కువ మంది ఉంటారని, అందులో మురళి ఒకరన్నారు. ఆ రోజుల్లో ఉన్నత విలువలు గలవారి వద్ద పనిచేయడం ద్వారా మురళి నేటికీ ఆ విలువలను పాటిస్తూ పాత్రికేయ వృత్తికి వన్నె తెస్తున్నారన్నారు. మురళిది అద్భుతమైన భాష అని, ఇరాన్‌–ఇరాక్‌ యుద్ధ సమయంలో ఆయన చూపిన పనితీరు స్ఫూర్తిదాయకమన్నారు.

మహామహులైన సంపాదకులు అందుకున్న మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం మురళి అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. మురళి జర్నలిజంలోకి ఉద్యోగం కోసం రాలేదని, సామాజిక మార్పునకు దోహదపడాలనే కాంక్షతో వచ్చారన్నారు. తెలుగు జర్నలిజంలో కొత్త ఒరవడిన సృష్టించిన మురళికి మాదల పురస్కారం దక్కడం శుభపరిణామన్నారు. చారిత్రక నవలా చక్రవర్తి, విశ్రాంత ఆచార్యులు ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌ మాట్లాడుతూ.. మాదల వీరభద్రరావు నిరాడంబరుడని, ఖద్దరు కట్టిన జాతీయవాదిగా జీవితాంతం రాజీలేని పోరాటం చేశారన్నారు. పురస్కార గ్రహీత వర్దెల్లి మురళి మాట్లాడుతూ.. 1984లో జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నానని, తనకు ఓనమాలు నేర్పిన వారిలో వరదాచారి ఒకరన్నారు.

మాదల వీరభద్రరావు పురస్కారం అంటే గౌరవాన్ని పెంచుతుందని, ఆ ఉద్దేశంతోనే తాను స్వీకరించేందుకు అంగీకరించానన్నారు. స్వాతంత్య్ర సమరంలో ప్రత్యక్షంగా పోరాటం చేసిన మాదల రెండేళ్ల పాటు అజ్ఞాతవాసం కూడా చేశారన్నారు. 1935–50 వరకు ఉద్యమం చేసి, తరువాత పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టి ఆ రంగాన్ని ప్రవర్ధమానం చేశారని కొనియాడారు. జలవనరులు, నదీ జలాలు, జల విద్యుత్‌ ప్రాజెక్టులు, పంచాయతీరాజ్‌ అంశాలపై ఆ రోజుల్లో సమగ్ర సమాచారంతో మాదల వ్యాసాలు రాశారన్నారు. అలాంటి సబ్జెక్టులపై ఎంతో కష్టపడితే తప్ప రాయడం సాధ్యంకాదన్నారు. నేటితరం పాత్రికేయులు ఆయన ఆశయాలను కొనసాగిం చడం ద్వారా నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు.

ఈ సందర్భంగా మాదల వీరభద్రరావు తనయుడు, శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక సమితి కార్యదర్శి మాదల రాజేంద్రప్రసాద్‌ వీరభద్రరావు అందించిన సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, గానసభ అధ్యక్షులు వీఎస్‌ జనార్దనమూర్తి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిష్ట్రార్‌ టి.గౌరీశంకర్, సాధన సాహితీ స్రవంతి అధ్యక్షులు సాధన నరసింహాచార్య, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. కాగా మాదల వీరభర్రరావు శత జయంతి సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు రాసిన వ్యాసాలతో ప్రత్యేక సంచిక విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.  

మరిన్ని వార్తలు