రైతు ఆవిష్కరణల ప్రచారంలో ‘సాక్షి’కి అవార్డు

8 Mar, 2015 01:31 IST|Sakshi
రైతు ఆవిష్కరణల ప్రచారంలో ‘సాక్షి’కి అవార్డు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: అన్నదాతలకు ఉపయోగపడే పరికరాలు, రైతుల ఆవిష్కరణలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్న ‘సాక్షి’ దినపత్రికకు మీడియా విభాగంలో ప్రోత్సాహక అవార్డు దక్కింది. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్) ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రపతి భవన్ ఆవరణలోని కల్చరల్ సెంటర్‌లో గ్రామస్థాయి ఆవిష్కర్తలకు 8వ ద్వైవార్షిక పురస్కారాల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎన్‌ఐఎఫ్ చైర్మన్ డా.మషేల్కర్ పలువురికి పురస్కారాలు అందజేశారు. 18 రాష్ట్రాలకు చెందిన 41 మంది గ్రామీణ ఆవిష్కర్తలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు పురస్కారాలు అందుకున్నారు.

 

రైతులకు ఉపయోగపడే అనేక యంత్ర పరికరాల్ని రూపొందించిన కర్ణాటకకు చెందిన నడకట్టన్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం అందజేశారు. 3 నిమిషాల్లో 50 ఇటుకల తయారు చేసే యంత్రాన్ని ఆవిష్కరించిన కె.చంద్రశేఖర్ (ధరణికోట, గుంటూరు జిల్లా)కు ఇంజినీరింగ్ విభాగంలో జాతీయ స్థాయి తృతీయ అవార్డును రాష్ట్రపతి అందజేశారు. సులభంగా నడపడానికి వీలయ్యే పవర్ వీడర్‌ను రూపొందించిన మహిపాల్‌చారి (వరంగల్ జిల్లా)కి కన్సొలేషన్ బహుమతి దక్కింది. డా.మషేల్కర్.. మీడియా విభాగంలో ‘సాక్షి’ దినపత్రికకు ప్రోత్సాహక బహుమతి అందజేశారు.
 
 జ్ఞాపిక, ప్రశంసాప్రతంతోపాటు రూ. 50 వేల నగదు పురస్కారాన్ని ‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఇన్‌చార్జి, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఈ 41 మంది ఆవిష్కరణలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రారంభించారు. ఇది ఈ నెల 13 వరకు ఇది కొనసాగుతుంది. దేశ సుస్థిర అభివృద్ధికి గ్రామస్థాయి ఆవిష్కరణలు (గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్స్), సంప్రదాయ విజ్ఞానం ఎంతగానో దోహదపడతాయని ప్రణబ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతకుముందు మషేల్కర్ ప్రసంగిస్తూ ఈ ఏడాది 35 వేల ఎంట్రీలు రాగా.. అందులో 41 మంది ఇన్నోవేటర్లకు అవార్డులు ఇస్తున్నామన్నారు. ఎన్‌ఐఎఫ్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అనిల్ కే గుప్తా మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటికి 70 ఆవిష్కరణల్ని కొనుగోలు చేసి, అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డా. హర్షవర్ధన్, సహాయ మంత్రి సుజనాచౌదరి, తెలుగు రాష్ట్రాల్లో పునాదిస్థాయి ఆవిష్కర్తలను గుర్తించి, ప్రోత్సహించడంలో గణనీయమైన కృషి చేస్తున్న పల్లెసృజన సంస్థ అధ్యక్షుడు, బీడీఎల్ మాజీ డెరైక్టర్ బ్రిగేడియర్ పోగుల గణేశం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు