కరోనా రాతిరిలో..అలసితి.. సొలసితి!

28 Apr, 2020 07:37 IST|Sakshi

మహానగరిలో మాయదారి వైరస్‌..

రాత్రి ఏడు దాటితే కాలు కదపట్లేదు

కోవిడ్‌ నివారణ కోసం ఇళ్లకే పరిమితం

పండగ సమయంలోనూ...పట్టు వీడని జనం

కనిపించని రంజాన్‌ సందడి  

పారిశుధ్య పనుల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది

వలస కూలీల ఊరిబాట...

పాలు, కూరగాయలు, నీళ్లు, మందుల రవాణా వాహనాలకే అనుమతి

విధుల్లో కన్పించిన పోలీసులు

ప్రతి వాహనదారుడి తనిఖీ

సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి/అడ్డగుట్ట /చార్మినార్‌: మహా నగరం చిన్నబోయింది. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు ఉదయం, మధ్యాహ్నం వేళ నిత్యావసర సరకులు, అత్యవసర సేవల కోసం రోడ్డెక్కుతున్న జనం..రాత్రి ఏడు దాటిందంటే మాత్రం కాలు కదపట్లేదు. ప్రతి ఏటా రంజాన్‌ మాసంలో పగలు, రాత్రి తేడా లేకుండా కళకళలాడే చార్మినార్‌ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్లన్నీ బోసిపోయాయి. పండుగ సమయంలోనూ జనం పట్టు విడవకుండా కరోనాపై పోరును కొనసాగిస్తుండటం ‘సాక్షి’ విజిట్‌లో కనబడింది. ఆదివారం రాత్రి 11 నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధులకు ‘కరోనా నైట్‌’ కళ్లకు కట్టింది. లాక్‌డౌన్‌కు ముందు రాత్రివేళల్లో వాహనాల రణగొణ ధ్వనులు, స్ట్రీట్‌ ఫుడ్, ఐస్‌ క్రీమ్‌ బండ్ల వద్ద జనాల కోలాహలం...పాతబస్తీలో రంజాన్‌ సందడి తదితరాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు చార్మినార్, మక్కా మసీదు, లాడ్‌బజార్, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్, పత్తర్‌గట్టి, మీరాలం మండి, పటేల్‌ మార్కెట్, మదీనా, నయాపూల్‌ తదితర ప్రధాన రంజాన్‌ మార్కెట్‌ ప్రాంతాలన్నీ ఇప్పుడు బోసిపోయి కనిపించాయి. రాత్రైతే చాలు ఇప్పుడు పోలీసుల తనిఖీలు, వలస కూలీల ప్రయాణాలు, పారిశుద్ధ్య కార్మికుల పని, శునకాల చక్కర్లు...తప్ప రోడ్లపై ఏమీ కనిపించడం లేదు.  

వలస నడక..సమయం:గం.11. 51 ని.
ట్యాంక్‌బండ్‌ మీదుగా కొంతమంది వలస కార్మికులు వారి వారి స్వగ్రామాలకు వెళ్తుండడం కనిపించింది. వారిలో ఒకరైన హిందూ సాహూను ఎక్కడికి బయలుదేరారని ప్రశ్నిస్తే ‘ రెండు నెలల క్రితం ఉపాధి నిమిత్తం మేం మొత్తం 12 మందిమి నగరానికి వచ్చాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పుడు రోజు గడవడం కష్టంగా ఉంది. అందుకే చత్తీస్‌గఢ్‌లోని మా గ్రామానికి నడిచి వెళ్తున్నాం. వాహన సౌకర్యం లేకపోవడంతో తప్పని పరిస్థితిలో కాలినడకనే వెళ్లేందుకు సిద్ధమయ్యాం’ అని చెబుతూ వారు ముందుకు సాగారు. 

శుభ్రత తప్పక...సమయం: రాత్రి 12.00 గం.
పాతబస్తీలోని చౌమహల్లా రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో కొంతమంది పారిశుధ్య మహిళా కార్మికులు అక్కడికి చేరుకున్నారు. రోడ్లను శుభ్రం చేస్తూ...చెత్త ఏరి వేస్తూ విధులు చేపట్టారు. ‘లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ ప్రతి రోజూ మేం రోడ్లు ఊడుస్తూనే ఉన్నాం. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నందున ఇప్పుడు పరిశుభ్రత ముఖ్యం కదా..అందుకే డ్యూటీ చేస్తున్నాం. కొంచెం భయంగా ఉన్నప్పటికీ తప్పదు కదా..అధికారుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి కష్టమైనా భరిస్తున్నాం’ అంటూ తమ పనుల గురించి చెప్పుకొచ్చారు పారిశుధ్య
కార్మికులు. 

వ్యాయామం బెస్ట్‌

నేను అఫ్జల్‌గంజ్‌ గురుద్వారాలో నివాసం ఉంటాను. పాతబస్తీ ఉప్పుగూడలో క్లినిక్‌ నిర్వహిస్తున్నా. వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు వాహనాన్ని లాక్కుంటూ నడిచి వెళ్తాను. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శరీరానికి వ్యాయామం తప్పనిసరి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.              – డాక్టర్‌ కోటేశ్వర్‌రావు, అఫ్జల్‌గంజ్‌  

సమయం: రాత్రి 2గం.బోసిపోయిన చార్మినార్‌ 
11.30 నుంచి 12 గంటల వరకు  
ఫలక్‌నుమా ఏసీపీ, ఫలక్‌నుమా రైతుబజార్‌ మీదుగా షంషీర్‌గంజ్, శాలిబండ క్రాస్‌ రోడ్డు వరకు వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. శాలిబండ వద్ద రాత్రి 11.30 ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చార్మినార్‌ వద్ద ఎవరూ లేరు. రంజాన్‌ సందడి కనిపించలేదు. 
అర్ధరాత్రి 12 నుంచి 12.30 వరకు
ఖిల్వత్‌ రోడ్డులోని చౌమహాల్లా ప్యాలెస్‌ రోడ్డులో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు వీధుల్ని శుభ్రం చేస్తున్నారు. లాడ్‌బజార్,మోతీగల్లీల మీదుగా మూసాబౌలీ వరకు ఈ పనులు చేశారు.
12.30 నుంచి ఒంటి గంట వరకు  
పేట్లబురుజు మెటర్నిటీ ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు, రోగుల బంధువుల అవస్థలు పడుతుండటం కనిపించింది.  
1.00 నుంచి 1.30 వరకు
పేట్లబురుజు చౌరస్తా ద్వారా సిటీ కాలేజీ, హైకోర్టు రోడ్డు, మదీనా చౌరస్తా వరకు జన సంచారం లేదు.  
1.30 నుంచి 2 గంటల వరకు
మదీనా చౌరస్తా నుంచి పటేల్‌మార్కెట్, పత్తర్‌గట్టి,నయాపూల్,సాలార్‌జంగ్‌ మ్యూజియం  రోడ్డు  వరకు  నిర్మానుష్యమే రాజ్యమేలింది.  

జీతాలు నెలనెలా ఇవ్వడం లేదు
నేను సైదాబాద్‌లోని ఖాజాబాగ్‌లో ఉంటాను. ప్రతిరోజూ చార్మినార్‌ వద్ద నైట్‌ డ్యూటీ చేస్తాను. అర్దరాత్రి వీధులన్నీ ఊడ్చుతాను. ప్రస్తుతం కోవిడ్‌ వైరస్‌ భయం తనతో పాటు మా ఇంటోల్లందర్నీ భయపెడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతోంది ఎవరికీ తెల్వడం లేదు. పొట్టకూటి కోసం డ్యూటీకి వస్తున్నా..మాకు నిత్యావసర వస్తువుల కిట్లు అంద లేదు. జీతాలు కూడా నెల నెలా ఇవ్వడం లేదు. ఎట్లా బతికేది.  – కె.పట్టు,  పారిశుధ్ధ్య కార్మికురాలు   

ఐటీ కారిడార్‌లో నిశ్శబ్దానిదే రాజ్యం
రాత్రి 11.15 : రాయదుర్గం విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌లో రాయదుర్గం పోలీసులు వాహనాల రాకపోకలను తనిఖీ చేస్తున్నారు. వాహనాల రాకపోకల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
రాత్రి 11.20:  గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్‌లో వాహనాల రాకపోకలు కనిపించ లేదు. దీంతో జనం సంచారం, వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఆ జంక్షన్‌ బోసిపోయింది.
రాత్రి 11.30:  రాయదుర్గం ఏఎస్‌ఐ వాహెద్‌ ఆధ్వర్యంలో గచ్చిబౌలి జంక్షన్‌లో సిబ్బందితో బందో బస్తులో ఉన్నారు. రాత్రి విధులు ముగించుకొని వచ్చే ఆస్పత్రులు సిబ్బంది, ఆస్పత్రుల నుంచి వచ్చే వారిని పరిశీలించి పంపించారు. కూరగాయలు, వాటర్‌ ట్యాంకర్లు, పండ్ల వాహనాలు రాక పోకలు సాగించాయి.
రాత్రి11.35: గచ్చిబౌలిలో అండర్‌ గ్రౌండ్‌ పవర్‌ కేబుల్‌  పనులు వేగంగా సాగుతున్నాయి. కూలీలు తమ పనుల్లో నిమగ్నమయ్యారు.  
రాత్రి 11.45:  ఐటీ కంపెనీలకు హబ్‌గా ఉన్న ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఉద్యోగులు, వాహనాల రాకపోకలు లేకపోవడంతో బోసిపోయింది. రాత్రి సమయంలో జిగేల్‌మనిపించే ఐటీ కారిడార్‌లోని కంపెనీలలో పరిమితంగా లైట్ల వెలుగులు కనిపించాయి. ఆయా ఐటీ కంపెనీల ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.  
అర్ధరాత్రి 12.20:  మాదాపూర్‌ ఏఎస్‌ఐ బుచ్చేశ్వర్‌ రావు సిబ్బందితో కొత్తగూడ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే వాహనాలు ఆ జంక్షన్‌లో కనిపించ లేదు. వాటర్‌ ట్యాంకర్లు మాత్రమే కనిపించాయి. కూరగాయలు, పాలు, పండ్లు తరలించే వాహనాలే వెళుతున్నాయని ఏఎస్‌ఐ తెలిపారు.
రాత్రి 12.30:  అర్ధరాత్రి శిల్పారామం మూసివేసి ఉన్న అటుగా పాదాచారులు కనిపిస్తుండే వారు. కర్ఫ్యూ నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మినహా ఎవరూ కనిపించ లేదు.
రాత్రి 12.50: సైబర్‌ టవర్‌ జంక్షన్‌ ఎప్పుడు చూసిన జన సంచారంతో సందడిగా కనిపించేది. వాహనాల రాకపోకలు రాత్రంతా అక్కడ కనిపించేవి. కర్ఫ్యూ నేపథ్యంలో వాహనాల రాకపోకలు లేవు. నగరం నుంచి విధులు ముగించుకొని, ఆస్పత్రుల నుంచి ద్విచక్ర వాహనాలపై వచ్చిన వారిని మాదాపూర్‌ ఎస్‌ఐ నారాయణ గౌడ్‌ నేతృత్వంలోని సిబ్బంది అన్ని వివరాలు ఆరా తీసిన తరువాతే పంపిస్తున్నారు.  
రాత్రి–1.12:  మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌లో వాహనాల రాకపోకలు పూర్తిగా లేకపోవడంతో నిశబ్ధ వాతావరణం నెలకొంది. మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్‌ రాకపోకలు లేక మూగబోయింది.
రాత్రి 1.38 :కాలినడకన వలస కూలీలు పొట్ట చేత పట్టుకొని వందల మైళ్లు దాటి వచ్చిన వలస కూలీలు పగలు అందరు చూస్తారనే ఆలోచనతో రాత్రి సమయంలో కాలినడకన ఊరి బాట పట్టారు. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో గ్లాస్‌ వర్క్‌ చేస్తున్న మహ్మద్‌పూర్‌గౌతి, అలహబాద్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు మూట ముల్లె సర్దుకొని బయలుదేరారు. 1100 కిలో మీటర్ల దూరంలో ఉన్న సొంత ఊర్లకు బాట పట్టారు.. ఫిబ్రవరి నెల జీతం   రాలేదని, రూ.నాలుగు వేలు ఖర్చులకిస్తే సరిపోవడం లేదని వలసకూలీలు పేర్కొన్నారు. తమ వారి వద్దకు వెళ్లేందుకు బయలుదేరామని 15 రోజుల్లో చేరుకుంటామని చెప్పారు. అయితే సైబర్‌ టవర్‌ జంక్షన్‌లో వారిని పోలీసులు అడ్డుకున్నారు.అలాగే మాదాపూర్‌లోని ఫేజ్‌–11 వద్ద మూడు కుటుంబాలు కాలి నడకన వరంగల్‌కు బయలు దేరారు. బ్యాగ్‌లలో సామగ్రితో పాటు చిన్న పిల్లలు ఎత్తుకొని కుటుంబ సభ్యులతో బయలుదేరారు.
రాత్రి 2 గంటలు: వాహనాల రాకపోకలు లేవు, పోలీసుల బందో బస్తు లేకుండా నిర్మానుష్యంగా ఉంది. కేబీఆర్‌ పార్క్‌  వద్ద వాహనాల రాకపోకలు, జన సంచారం కనిపించ లేదు.

ఇలాంటి పరిస్థితి  చూడలేదు
కోవిడ్‌–19ను కట్టడిలో భాగంగా పగలు లాక్‌ డౌన్‌ రాత్రి కర్ఫ్యూతో హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలు, జన సంచారం లేని పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు. ఎంతో రద్దీగా ఉండే మాదాపూర్‌ రాత్రి సమయంలో బోసిపోయింది. అత్యవసరమైన కొందరు బయటకు వస్తున్నారు. వాహనాలు ఎక్కడి ఎక్కడికి వెళుతున్నాయి, ఏ పని మీద వెళుతున్నారో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే విడిచిపెడుతున్నాం.–నారాయణ గౌడ్, ఎస్‌ఐ, మాదాపూర్‌

సికింద్రాబాద్‌ సైలెంట్‌
రాత్రి 11 గంటలు : సికింద్రబాద్‌లోని గణేష్‌ టెంపుల్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికులు పరిసరాలను శుభ్రం చేస్తున్నారు.
11.05 : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్, అల్ఫా హోటల్‌ వద్ద పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
11.10: సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ సర్కిల్‌ నిర్మానుష్యంగా ఉంది.
11.22 : ఎప్పుడూ కిటకిటలాడే ప్యారడైజ్‌ సర్కిల్‌ పూర్తిగా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంది. రంజాన్‌ మాసంలో 24 గంటలు జనాలతో నిండిపోయే ప్రాంతం మూగబోయింది.  
11.34 : రాణిగంజ్‌ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు పరిమితికి మించి ప్రయాణిస్తున్న ఆటోట్రాలీని అడ్డుకున్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌లో క్యారెట్‌ లోడ్‌ చేసి తిరిగి చేవెళ్లకు వెళ్తున్నామని చెప్పడంతో వదిలేశారు.  
11. 43 : బుద్ధభవన్‌ రోడ్డు మార్గం ఖాళీగా ఉంది.
11. 51 : ట్యాంక్‌బండ్‌ మీదుగా కొంతమంది వలస కార్మికులు వారి వారి స్థగ్రామాలకు వెళుతుండడం కనిపించింది.
12.19 : మింట్‌ కంపౌండ్‌ మార్గం ఖాళీగా ఉంది. కేవలం పోలీసులు మాత్రమే రోడ్లపై సంచరిస్తున్నారు.
12.25 :  ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌ ప్రధాన రోడ్డులో కుక్కలు  మాత్రమే కనిపించాయి.  
12.30 : ఇందిరా గాంధీ విగ్రహం సమీప రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు.  
12.40 :ఎన్‌టీఆర్‌ మార్గ్‌ రోడ్డులో ఒక్క వాహనం కూడా కనబడలేదు.  
12.48: ట్యాంక్‌ బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. కేవలం బారికేట్లు మాత్రమే వేసి ఉన్నాయి.  
12.59 : ఇందిరా పార్క్‌ చౌరస్తా నిర్మానుష్యంగా  ఉంది.
01.06 : ముషీరాబాద్‌ చౌరస్తా కూడా నిర్మానుష్యంగా కనిపించింది. అక్కడక్కడా పోలీసులు చెక్‌పోస్టుల వద్ద  విధులు నిర్వహిస్తుండటం      కనిపించింది.

నడుచుకుంటూనే చత్తీస్‌ఘడ్‌కు..
‘ మా ఊళ్లో పనులు లేవు.. ఇక్కడ ఏదైనా పని చేసుకొని బతుకుదామని చత్తీస్‌ఘడ్‌నుంచి రెండు నెలల క్రితం వచ్చాం.  లాక్‌డౌన్‌తో రోజు గడవడానికి కష్టంగా ఉంది. అందుకే మా ఊరికి  12 మంది నడిచే వెళుతున్నాం. – హిందూ సాహూ 

మరిన్ని వార్తలు