రోగుల్లో ధైర్యం నింపేలా...

21 Feb, 2019 03:29 IST|Sakshi

వైద్య, ఆరోగ్యశాఖ నూతన మంత్రి ఈటల రాజేందర్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించడమే కాకుండా వారికి జబ్బు నయం అవుతుందన్న భరోసా కల్పించాల్సిన అవసరముందని వైద్య, ఆరోగ్య శాఖ నూతన మంత్రి ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. అందుకు ప్రత్యేకంగా ఆసుపత్రి యాజమాన్య వ్యవస్థను నెలకొల్పాలని భావిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు వైద్యం చేయడంతోనే వారి సమయమంతా గడిచిపోతుందని, కానీ రోగులకు అవసరమైన ధైర్యం, సంతృప్తి కలిగించేందుకు వారికి సమయం చిక్కట్లేదన్నారు. దీంతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన ప్రత్యేకంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

ప్రజలకు మెరుగైన వైద్యం 
ఏ రాష్ట్రంలోనైనా విద్య, వైద్యం చాలా కీలక రంగాలు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ వాటిని ప్రత్యేకంగా గుర్తించారు. ఎక్కడైనా నాణ్యమైన మానవ వనరులు ఉంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది. విజ్ఞానం, ఆరోగ్యంతోనే నాణ్యమైన వనరులు మెరుగుపడతాయి. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్, నాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వైద్య రంగంలో అనేక పెనుమార్పులు తీసుకొచ్చారు. కేసీఆర్‌ కిట్, కంటి వెలుగు, ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్, మౌలిక సదుపాయాల కల్పన, సీఎం రిలీఫ్‌ఫండ్‌ పెంచడం, ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడం వంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో విశ్వాసం పొందాం. వైద్యంపై నమ్మకం కలిగించాం. వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాలకు సంబంధించి అక్కడక్కడ కొరత ఉన్న మాట వాస్తవమే. ఆ లోటును తీర్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తాం. కేసీఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. మాతా శిశు మరణాలు తగ్గాయి. వారికి ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం ఏర్పడింది. దీన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తాను. 

ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి 
ప్రభుత్వ వైద్య సేవల విషయంలో గతంలోనే మా సర్కారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. వాటిని మరింత ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న ప్రధాన బాధ్యత. సమస్యలను అన్ని కోణాల్లో తెలుసుకొని అర్థం చేసుకుంటాను. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాను. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్యం మెరుగుపడింది. దాన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే నేడు సర్కారీ వైద్యుల్లో అంకితభావం పెరిగింది. దాన్ని మరింత పెంపొందించేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల కొరత కారణంగానే వారి వయో పరిమితిని పెంచాం. దీని అమలుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో రోగులకు సేవలు అందట్లేదు. రాష్ట్రంలో ప్రైవేటు వైద్య విద్య కాలేజీల్లో కొన్నింటిలో 750 పడకల వరకు ఉన్నాయి. వాటిలో పేద ప్రజలకు సేవలందేలా చూడాల్సిన అవసరముంది. దానిపై కూడా దృష్టిపెడతాం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు