'ఆ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది'

28 Jul, 2019 11:37 IST|Sakshi

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు

సాక్షి, మహబూబాబాద్‌ : ‘రాజకీయాల్లోకి రావడం ద్వారా పేదలకు సేవ చేయొచ్చని చిన్నప్పుడే తెలుసుకున్నా.. అందుకే నిర్ణయించుకున్నాను.. దీనికి తోడు మా చిన్నమ్మ సత్యవతి రాథోడ్‌ ఇదే రంగంలో ఉండడంతో అవగాహన పెరిగింది.. నలుగురు ఆడపిల్లల్లో చిన్నదాన్ని కావడంతో మా తల్లిదండ్రులు నన్ను కొడుకులా పెంచారు.. అందుకే మగ వాళ్లలా దుస్తులు వేసుకోవడం అలవాటైంది’ అని చెప్పారు మహబూబాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి పర్సనల్‌ టైం’లో వెల్లడించిన మరికొన్ని అంశాలు ఆమె మాటల్లోనే.. 

మధ్య తరగతి కుటుంబం
మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం బాల్యాతండలోని మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం మాది. నాన్న శ్రీకాంత్‌ నాయక్, అమ్మ కాంతి. మా ఇంట్లో ముగ్గురు అక్కల తర్వాత నేను పుట్టాను. అందరికంటే చిన్నదాన్ని. దీంతో ఇళ్లు, బంధువుల్లో నేనంటే గారాబం. అందరూ నన్ను ఆప్యాయంగా చూసుకుంటారు. అయితే మా పెద్ద అక్క అంటే మాత్రం కొంచెం భయం. మిగతా ఇద్దరు అక్కలతో క్లోజ్‌గా ఉండేదాన్ని.

ఫస్ట్‌ డే చూడాల్సిందే
సినిమాల విషయానికొస్తే న్యాచురల్‌ స్టార్‌ నానీ అంటే ఇష్టం. నేను చూసిన లాస్ట్‌ మూవీ మజీలీ. నాని సినిమా అంటే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడాల్సిందే. కాలేజీలో మా గ్యాంగ్‌తో కలిసి సినిమాలు రెగ్యులర్‌గా చూసేదాన్ని. ఆన్‌లైన్‌లో వెబ్‌ సిరీస్‌ సీరియల్స్, కోరియన్‌ మూవీస్‌ రెగ్యులర్‌గా చూస్తా. ఇక సీరియల్స్‌ అంటే మాత్రం తెగ బోర్‌. అందుకే వాటికి జోలికి వెళ్లను. 

చిన్నప్పుడే అనుకున్నా...
చిన్నప్పటి నుంచి చిన్నమ్మ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను రాజకీయాల్లో చూస్తూ పెరిగినా. వేసవి సెలవుల్లో ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు చిన్నమ్మను కలుసుకోవడానికి చాలామంది ప్రజలు వచ్చి తమ గోడు చెప్పుకునేవారు. అలాగే చిన్నమ్మతో కలిసి కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, చిన్నమ్మకు ఇచ్చే గౌరవం బాగుండేది. చేతిలో అధికారం ఉంటే అక్కడిక్కడే ప్రజల సమస్యలు పరిష్కరింవచ్చని తెలుసుకుని రాజకీయాల్లోకి రావాలనుకున్నా. ఈ దశలో 2018లో బీటెక్‌ పూర్తికాగానే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రావటం.., రిజర్వేషన్‌ కలిసి రావటంతో ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నా. చిన్నమ్మ, అమ్మ,నాన్న కూడా సరే అనటంతో బయ్యారం జెడ్పీటీసీగా పోటీచేసి విజయం సాధించా. ఆ తర్వాత జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది.

నన్ను కొడుకులా పెంచారు..
నేను కాలేజీలో ఉన్నప్పుడు పెద్దగా నా డ్రెస్సింగ్‌  స్టైల్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చాక చాలా మంది నా డ్రెస్సింగ్‌ గూర్చి మాట్లాడుతున్నారు. అమ్మనాన్నలకు నలుగురం ఆడపిల్లలమే కావటం.. చిన్న దాన్నయిన నన్ను కొడుకులా పెంచారు. దీంతో చిన్నప్పటి నుంచి ఇలా డ్రెస్సింగ్‌ చేసుకోవటం అలవాటైంది. ఇదే కంఫర్ట్‌గా ఉండటంతో కంటిన్యూ చేస్తున్నా. లక్ష్మీనర్సింహస్వామి అంటే నా ఇష్ట దైవం. అయితే, దైవభక్తి కొంచెం తక్కువే.

ఆ సంఘటన కలిచి వేసింది
జెడ్పీటీసీగా పోటీచేసి ప్రచారంలో ఉండగా కోడిపుంజల తండాలో ఓ సంఘటన నన్ను కలిచివేసింది. అక్కడి మహిళ ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతుండగా హాస్పిటల్‌కు తీసుకపోవటానికి సరైన రోడ్డు సదుపాయం లేదు. కచ్చా రోడ్డులో మూడు కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి అక్కడి నుంచి మహబూబాబాద్‌కు ఆటోలో 8కి.మీ తీసుకెళ్తే హస్పిటల్‌కీ చేరుకోలేని పరిస్థితి. ఆ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది. దీంతో ఖచ్చితంగా గెలిచి, పల్లెల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ధృడంగా నిర్ణయించుకున్నా. అందుకే నా మొదటి ప్రాధన్యత విద్య, వైద్య రంగాలకు ఇస్తాను. 

మరిన్ని వార్తలు