నా హీరో.. నా దైవం కేసీఆర్‌

7 Jul, 2019 10:22 IST|Sakshi
భార్య సుజాత, కుమార్తె సంజనారెడ్డితో జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి

తెలంగాణ కోసమే రాజకీయాల్లోకి వచ్చా

‘సాక్షి’ పర్సనల్‌ టైమ్‌లో జనగామ జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి 

నేను అసలు సినిమాలు చూడను.. నాకు అభిమాన హీరోలు లేరు.. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ఉద్యమ సారధి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాకు హీరో.. అంతే కాదు నాకు దైవంతో సమానం. ఏదో ఓ కాంట్రాక్టర్‌ దగ్గర సూపర్‌వైజర్‌గా ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమంలోకి వచ్చా. వ్యాపారం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపా. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న.. నిర్బంధాన్ని తట్టుకొని ఉద్యమంలో పాల్గొన్న. నా మీద 28 కేసులు నమోదయ్యాయి. ఎన్నో కష్టాలను అనుభవించా. ఈ సమయంలో నా కుమారుడు ఉంటే బాగుండు. అధినేత కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతానని జనగామ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. ‘సాక్షి’ పర్సనల్‌ టైమ్‌లో తన ఉద్యమ సమయం నాటి జ్ఞాపకాలతోపాటు తన ఇష్టాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..

సాక్షి, జనగామ: మాది జనగామ జిల్లాలోని చిల్పూర్‌ మండలం రాజవరం గ్రామం. మా అమ్మానాన్నలు సుకన్య, జయపాల్‌రెడ్డి. ముగ్గురు సంతానంలో నేనే పెద్దవాడిని. నా ప్రాథమిక విద్య ను రాజవరంలో పూర్తి చేసి 8, 9 తరగతులను హన్మకొండలో చదివాను. 10వ తరగతి, ఇంటర్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌లో చదివాను. బీకాం హైదరాబాద్‌లో చదివి, హన్మకొండలో ఐటీఐ చేశాను. కాంట్రా క్టర్‌గా మారి కొంతమందికి ఉపాధి కల్పించాలనే భావనతో ప్రత్యేకంగా ఐటీఐ కోర్సు తీసుకున్నా. 1992లో సుజాతతో వివాహం అయింది. కుమార్తె సంజనారెడ్డి బీటెక్‌ చదువుతోంది. 

రూ.4వేలకు సూపర్‌వైజర్‌ ఉద్యోగం చేశా..
మాది పక్కా వ్యవసాయ కుటుంబం. గ్రామీణ నేపథ్యంలోనే పెరిగాను. కాంట్రాక్టర్‌గా మారి పది మందికి ఉపాధి కల్పించాలనే కోరిక నాలో బలంగా ఉండేది. డిగ్రీ తర్వాత ఐటీఐ కోర్సు చేశా. ఆ తరువాత హైదరాబాద్‌లో ఓ కాంట్రాక్టర్‌ దగ్గర నెలకు రూ.నాలుగు వేల జీతానికి పనిచేశాను. అలా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాను. 

కేసీఆర్‌ పిలుపుతో ఉద్యమకారుడిగా మారా..
ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకొచ్చారు. ఉద్యమంలో చేరాలని కేసీఆర్‌ పిలుపునివ్వడంతో కరీంనగర్‌లో జరిగిన జైత్రయాత్ర సభకు వెళ్లాను. అప్పటి నుంచి కేసీఆర్‌ వెంటే ఉన్నా. 2002–06 వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా యువజన విభాగం ప్రచార ప్రధాన కార్యదర్శిగా, 2006–13 వరకు  స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల అధ్యక్షుడిగా, 2013–15 వరకు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జితో పాటు పలు పదవుల్లో పనిచేశాను. 

నిర్బంధంతోనే పట్టుదల పెరిగింది..
తెలంగాణ ఉద్యమ సమయంలో నాపైన తీవ్రమైన నిర్బంధం ఉండేది. నా ప్రతి కదలికపై పోలీసుల నిఘా ఉండేది. ఉద్యమ సమయంలో ఓ సారి అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాలకుర్తి పర్యటనకు వస్తున్నారు. పర్యటనకు ముందే నన్ను అరెస్టు చేయాలని పోలీసులు భావించి అర్ధరాత్రి మా ఇంటికి వచ్చారు. సంపత్‌రెడ్డిని పిలవమని నా భార్యను కోరారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఇంటి వెనుకవైపు ఉన్న గోడ నుంచి దూకాను. రాత్రి కావడంతో రాళ్లపై పడడంతో నాకు గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకొని అదేరోజు తిరిగొచ్చి పొన్నాల పర్యటనను అడ్డుకున్నా.

ఓ సారి ఘన్‌పూర్‌లో రాస్తారోకో చేస్తుంటే ఓ పోలీసు అధికారి వాహనాన్ని అడ్డుకున్నాం. ఆ సమయంలో నన్ను భయపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు ఉన్నాయంటే ముందుగానే స్టేషన్‌కు తీసుకుపోయే వారు. నా కోసం ఒక పోలీసు టీం ఎప్పటికీ తిరుగుతూ ఉండేది.  నిర్బంధం కారణంగా వ్యవసాయ బావులు దగ్గర పడేకునేది. నాపైన 28 కేసులు పెట్టారు. 

ఈ సమయంలో నా కుమారుడు ఉంటే బాగుండు..
నా  కుమారుడు ఈ సమయంలో ఉంటే బాగుండు అనిపిస్తోంది. నా కుమారుడు సాయి 2012లో ఇంటర్‌ చదువుకునే రోజుల్లో బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. నా కుమారుడి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఆ ప్రభావం మా కుటుంబంపై పడింది.

నా భార్య గౌరవాన్ని పెంచింది..
నా భార్య సుజాత నా గౌరవాన్ని పెంచింది. ఆమె పీజీ వరకు చదువుకుంది. ఉద్యమం సమయంలో నేను ఎక్కువగా బయటనే ఉండేవాడిని. ఏ రోజు కూడా ఆమె నన్ను వద్దనలేదు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమలోనే ఉండాలని చెప్పేది. ఆమె మాటలు నాకు స్ఫూర్తిగా నిలిచాయి. మేము ముగ్గురం అన్నదమ్ములం ఇప్పటికీ కలిసే ఉంటాం. మాది ఉమ్మడి కుటుంబమే. 

రాజవరంలో క్రికెట్‌ ప్రారంభించాను..
మా ఊరు రాజవరంలో మొదటగా క్రికెట్‌ను ప్రారంభించిందే నేను. నాకు క్రికెట్‌ అంటే మహా ఇష్టం. స్వయంగా నేను ఆడుతా. గ్రామంలో క్రికెట్‌ టోర్నమెంట్లు పెట్టేది. ఇప్పటికీ క్రికెట్‌ కిట్లు అందజేస్తాను. క్రీడాకారులను ప్రోత్సహిస్తాను. 

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా..
నాకు చాలా ఆనందంగా ఉంది. ఉద్యమకారుడిని కావడం వల్లనే పదవి దక్కింది. సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం కొట్లాడినట్లుగానే అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాను. వెనుకబడిన జిల్లాను సమగ్రాభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా పని చేస్తా. నిత్యం జిల్లా ప్రజానీకానికి అందుబాటులో ఉంటా. కేసీఆర్‌ నాపైన పెట్టిన బాధ్యతలు నేరవేరుస్తా.. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయను.

వ్యాపారం చేసి  ఉద్యమాన్ని నడిపా..
నాడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడిని. మాకు ఆర్థికంగా లేకపోయేది. దీంతో స్వయంగా నేనే ఇటుక బట్టీల వ్యాపారం ప్రారంభించాను. దాంతో వచ్చిన డబ్బులను ఉద్యమానికి ఉపయోగించేది. ప్రస్తుతం 50 మంది బట్టీల్లో పని చేస్తున్నారు. వారందరికి ఉపాధి కల్పిస్తున్నా.  

తెలంగాణ ప్రకటన మర్చిపోలేను..
డిసెంబర్‌ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉంటుంది. కేసీఆర్‌ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించారు. తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మళ్లీ జూన్‌ రెండో తేదీన చిరకాల కోరిక నేరవేరింది. ఈ రెండు సందర్భాల్లో ఎంతో ఆనందంగా గడిపాం.

మరిన్ని వార్తలు