అవిశ్వాసం ఎరుగను.. అభిమానం మరువను

8 Jan, 2020 11:16 IST|Sakshi
తాండూరుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో లక్ష్మారెడ్డి

తాండూరు మున్సిపాలిటీకి  ప్రగతికి బాటలు వేశా..

మంచినీటికి అధిక ప్రాధాన్యం

ఒకే సారి నాలుగువేల నల్లా కనెక్షన్లు ఇచ్చాను

సాక్షి’తో తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి

సాక్షి, తాండూరు: “మున్సిపల్‌ చరిత్రలో అవిశ్వాస పరీక్ష ఎదుర్కొననిది నేను ఒక్కడినే. ప్రత్యక్ష చైర్మన్లు కాకుండా మిగతా వారంతా చైర్మన్‌ పదవీకాలం మొత్తం కొనసాగకుండా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు. మున్సిపల్‌ పరిధిలోని ప్రజల తాగు నీటికి ఇబ్బందులు తొలగించేందుకు ఒకేసారి రూ.4వేల నల్లా కనెక్షన్లు మంజూరు చేశాను. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ చలువతో నిధులు భారీగా తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేశాను. రూ.16.20 కోట్ల నిధులతో రోడ్లు వేయించడం   మరిచిపోని అనుభూతి’ అని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పి.లక్ష్మారెడ్డి (2005– 2010) అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా లక్ష్మారెడ్డి ‘సాక్షితో మాట్లాడారు. అనాటి విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలు

ఆయన మాటల్లోనే..
మాది పెద్దేముల్‌ మండలం రుద్రారం గ్రామం. నాలుగు దశాబ్దాల క్రితం గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. ప్రతి రోజు ఆరు కిలో మీటర్లు నడిచి పెద్దేముల్‌కు వచ్చి చదువుకున్నాను. ఇంటర్‌ విద్యను అభ్యసించేందుకు మండలంలో ఇంటర్‌ విద్య లేక పోవడంతో తాండూరుకు వచ్చి చదువుకున్నాను. దుద్రారం గ్రామ సర్పంచ్‌గా 14 ఏళ్ల పాటు సేవలు అందించాను.  సర్పంచ్‌గా పని చేసిన కాలంలో పెద్దేముల్‌ నుంచి రుద్రారం, గోపాల్‌పూర్, నర్సాపూర్‌ గ్రామాలకు రోడ్లు వేయించాను. నాటి మంత్రి చందు మహరాజ్‌ ప్రోత్సాహంలో ఆర్టీసీ బస్సు సేవలు అందేలా చేశాను.   

ఎన్నికలకు ముందే పార్టీ చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించింది. 
2005లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు పరోక్ష పద్ధతిన జరిగాయి. అంతకు ముందు కొనసాగిన వారు ప్రత్యక్ష ఎన్నికలలో చైర్మన్‌లుగా గెలిచారు. తానకు మాత్రం కౌన్సిలర్లే చైర్మన్‌ను ఎన్నుకొనే విధానం వచ్చింది.

అవిశ్వాస పరీక్ష ఎదురుకాలేదు..
మున్సిపాలిటీకి ప్రత్యక్ష ఎన్నికలను మినహయిస్తే పరోక్ష పద్ధతిలో చైర్మన్‌లు అయిన వారిలో 1953లో ముదేళి నారాయణరావు, తర్వాత తానేనని చెప్పారు. మిగతా వారంతా చైర్మన్‌ పదవిలో అవిశ్వాస తీర్మానంతో పదవులను కోల్పోయిన వారు అధికంగా ఉన్నారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పలువురు కౌన్సిలర్‌లు ప్రయత్నించిన కూడ సభ్యుల మద్దతు లభించలేదు. 

పదవీ కాలంలో రూ.80 కోట్ల అభివృద్ధి పనలు.. 
మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన ఐదేళ్ల పదవీకాలంలో సుమారు రూ.80 కోట్ల నిధులతో అభివృద్ధి పనలు జరిగాయి. మున్సిపల్‌ పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం కోసం కొత్తగా రూ.6.20 కోట్ల నిధులతో వాటర్‌ సప్లయి పథకం మంజూరు చేసి పనులను పూర్తి చేశాను. మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సహకారంతో రూ.16.50కోట్ల నిధులతో పట్టణంలోని వాడ వాడలో సీసీ రోడ్లను వేశాను. రాజీవ్‌గృహకల్ప, ఇందిరమ్మ కాలనీలలో అర్హులైన పేదలకు గుర్తించి 1500 ఇళ్లను మంజూరు చేయించి నిర్మించి ఇవ్వడం జరిగింది. 

డిగ్రీ కళాశాల మంజూరు 
అప్పట్లో జిల్లాలో చేవెళ్లకు మాత్రమే డిగ్రీ కళాశాల మంజూరు అయింది.  ఈ విషయం తెలుసుకున్న వెంటనే అప్పటి మంత్రిగా ఉన్న సబితారెడ్డి వద్దకు వెళ్లి కలిశాను. తాండూరు పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరాను. అయితే సీఎం వైఎస్సార్‌ వద్దకు తనను తీసుకెళ్లారు. అప్పటికప్పుడే వైఎస్సార్‌ తాండూరుకు డిగ్రీ కళాశాల మంజూరు చేశారు. ఊహ తెలిసిన నాటి నుంచి నాకుటుంబం అంతా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగాం.

మా నాన్న పెద్ద బాల్‌రెడ్డి పార్టీలో ఉంటూనే సర్పంచ్‌గా పని చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బాధ్యతలు చేపట్టాక పార్టీకి బలం పెరిగింది. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో వైఎస్సార్‌ మణించారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీ కోసం పని చేసిన సీనియర్‌లకు కాదని ఇతరులకు అవకాశాలు కట్టబెడుతూ వచ్చారు.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తాండూరు టికెట్‌ తనకే అవకాశం వచ్చింది. అయితే ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కారణంగానే తనకు టికెట్‌ చేజారీ పోయింది, అందుకోసమే ఎంపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీని వీడాను. అయితే తాను పార్టీ మారినా కొన్నాళ్లకే స్థానిక ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వచ్చారు. పార్టీ మారుతున్నట్లు తెలిస్తే కాంగ్రెస్‌ పార్టీని వీడే వాణ్ణి కాదు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు