నవ్వుల రారాజు..

12 Aug, 2014 02:03 IST|Sakshi
నవ్వుల రారాజు..

మాది చిట్యాల మండలంలోని వెల్లంపల్లి. నాన్న మల్లయ్య సింగరేణి ఉద్యోగి. అమ్మ సరోజన గృహిణి.  ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. హన్మకొండలోని సరస్వతి కాలేజీలో ఇంటర్మీడియెట్, అరోరా డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశా. కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘డిప్లొమా ఇన్ మిమిక్రీ’లో గోల్డ్ మెడల్ అందుకున్నా. అనుకరణే.. కమెడియన్‌ను చేసింది.
 
చిన్నప్పటి నుంచే తోటివారిని అనుకరించేవాడిని. స్నేహితులతో ఉపాధ్యాయుల్లా మాట్లాడేవాడిని. విషయం తెలిసిన టీచర్లు మమ్మల్నే ఇమిటేట్ చేస్తావా అంటూ బెత్తం దెబ్బలు వేసేవారు. ఇక సినిమాలంటే విపరీతమైన పిచ్చి. హీరోలు, కమెడియన్ల డైలాగులు చూసి వారిలా ఊహించుకుంటూ సినిమా హాల్లోనే యాక్టింగ్ చేసేవాడిని. మందమర్రి నుంచి హన్మకొండకు రావడంతో నా దశ తిరిగింది. ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు మిత్రుల వద్ద మిమిక్రీ చేసేవాడిని. విద్యాసాగర్ అనే వ్యక్తి.. ‘హీరోలను భలే అనుకరిస్తున్నావు స్టేజీ ప్రోగాములు ఇవ్వొచ్చు కదా’ అని ప్రోత్సహించాడు. ఆయన ప్రోద్బలంతో మిమిక్రీ షోలు చెయ్యడం మొదలుపెట్టా. అలా వందలాది ప్రదర్శనలు ఇచ్చాను. అప్పటి హన్మకొండ సీఐలు కిరణ్‌కుమార్, ఫణికుమార్ నా వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. సినిమాల్లోకి వెళ్లాలని ఒత్తిడి చేశారు.
 
నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది
హైదరాబాద్ వెళ్లి టీవీల్లో అవకాశాలు వెతుక్కుంటానని ఇంట్లో చెప్పగానే అడ్డుచెప్పకుండా వెళ్లి ప్రయత్నించమన్నారు. దీంతో ఓ టీవీ చానల్‌కు వెళ్లి ప్రదర్శన ఇచ్చా. నిర్వాహకులు వెంటనే శభాష్ అంటూ కితాబిచ్చారు. తమ చానల్‌లో రోజూ గంటపాటు కార్యక్రమం నిర్వహించాలని సూ చించారు. దీంతో నా సంతోషానికి అవధుల్లేకుండా పో యాయి. అలా నవ్వుల డాన్.. రేడియో జాకీగా ప్రస్థానాన్ని ప్రారంభించా. తర్వాత 91.1ఎఫ్‌ఎంలో కార్యక్రమాలు చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం ఏడు చానళ్లలో, రేడియోలో కమెడియన్‌గా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.
 
ఓరుగల్లు వీధుల్లో వినాయకుడి వేదికలపై నవ్వుల పువ్వులు పూయించిన వెంకీ.. నేడు వెండి, బుల్లి తెరలపై కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు. స్నేహితుల ప్రోద్బలంతో టెలివిజన్ ఇంటర్య్వూకు వెళ్లిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. బుల్లి తెరపై నవ్వుల రారాజుగా పేరుగాంచిన వెంకీ అసలు పేరు బొజ్జపల్లి వెంకటేశ్వర్లు. టీవీ వీక్షకుల హృదయాలు దోచుకుంటున్న ఈ వరంగల్ కుర్రోడు హన్మకొండ సుబేదారిలోని తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడాడు. అంతరంగాన్ని ఆవిష్కరించాడు. వివరాలు ఆయన మాటల్లోనే..
 - వరంగల్ అర్బన్
 
‘జబర్‌దస్త్’తో సినిమా అవకాశాలు
జబర్దస్త్ టీం లీడర్లు చంద్ర, ధన్‌రాజ్, చిత్రం శ్రీనులతో కలిసి  విజయవాడలో ఓ కార్యక్రమం నిర్వహించే అవకాశం లభించింది. అక్కడ నా ప్రదర్శన చూసి మెచ్చుకున్నారు. ఆ వెంటనే ‘జబర్‌దస్త్’లోకి కమెడియన్‌గా వస్తావా అని నన్ను అడిగారు. ఎగిరి గంతేశా. మొత్తం 74 షోలు చేశా. మహిళ గెటప్‌తోనే 50షోలు చేశా. ‘వద్దురా రాములా’ అనే డైలాగ్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. రేసుగుర్రంలోనూ ఓ చిన్నపాత్ర చేశా. ఇది నాకు నిజంగా కొత్త జీవితమే. ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్, ఈ వర్షం సాక్షిగా, ఈజీ మనీ, ఓరే సాంబ రాసుకోరాతోపాటు పలు సినిమాల్లో నటిస్తున్నా.
 
పేరుపెట్టని ఓ సినిమాలో హీరోయిన్ ప్రియమణిని ప్రేమించే ఓ పెద్ద క్యారెక్టర్ చేస్తున్నా. సుబేదారి నుంచి రోజూ హైదరాబాద్‌కు వెళ్లి వస్తున్నా. అయితే బిజీ కావడం వల్ల అక్కడికే మకాం మార్చాలని అనుకుంటున్నా. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నా. సంపాదించిన సొమ్ములో కొంత సేవకు ఉపయోగిస్తున్నా. ప్రతిభ ఉండి చదువుకు దూరమైన నలుగురు నిరుపేద విద్యార్థుల బాగోగులు చూసుకుంటున్నా. సినిమాల్లో అవకాశం రావడంతో నా జన్మ ధన్యమైంది. కష్టపడితే తప్పకుండా విజయం వరిస్తుంది. నా ఎదుగుదలకు ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, స్నేహితులకు, కమెడియన్‌లకు, హీరోహీరోయిన్లకు కృతజ్ఞతలు.

మరిన్ని వార్తలు