కలంపై ఖాకీ కుట్ర

27 Feb, 2016 00:57 IST|Sakshi
కలంపై ఖాకీ కుట్ర

సాక్షి విలేకరి అక్రమ అరెస్ట్‌పై భగ్గుమన్న జర్నలిస్టులు
జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు
ముత్తారం విలేకరిపై కేసు  ఎత్తివేయాలని డిమాండ్
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా
పోలీసుల అతిజోక్యంపై  జర్నలిస్టు నేతల మండిపాటు
 టవర్‌సర్కిల్ 


టవర్‌సర్కిల్ : ముత్తారం మండల సాక్షి విలేకరి పొన్నం శ్రీనివాస్‌గౌడ్‌పై అక్రమ కేసు బనాయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే హెచ్-143), తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా సంఘం(టెమ్జు) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తప్పుడు కేసు బనాయించిన గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని 57 మండల కేంద్రాల్లోనూ విలేకరులు నిరసన తెలపడంతోపాటు తహసీల్దార్లు, ఆర్డీవోలు, పోలీసు అధికారులకు వినతిపత్రాలను సమర్పించారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గంటన్నరపాటు ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ నీతూప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. సాక్షి విలేకరిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయడంతోపాటు గోదావరిఖని ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పసునూరు మధు మాట్లాడుతూ... సాక్షి రిపోర్టర్‌పై అక్రమ కేసు బనాయించి, అరెస్టు చేయడంలో గోదావరిఖని ఏఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు.

తనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పూర్తిగా కుట్రపూరితమని శ్రీనివాస్ వేడుకున్నా, అందుకు తగిన ఆధారాలను సమర్పించినా ఏఎస్పీ వినిపించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. విలేకరి పోలీసుల తప్పిదాలను ఎత్తి చూపుతున్నారనే అక్కసుతో ఎస్టీ, ఎస్టీ కేసును అస్త్రంగా ఉపయోగించుకోవడం అప్రజాస్వామికమన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌కు న్యాయం జరిగే వరకు జిల్లా జర్నలిస్టులు అండగా నిలువాలని కోరారు. కేసు పూర్వాపరాలను, ఏఎస్పీ వైఖరిని డీఐజీ మల్లారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రెస్ అకాడమీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పూదరి వెంకటేశ్ మాట్లాడుతూతక్షణమే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కేసుపై సమగ్ర విచారణ జరపడంతోపాటు ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ జిల్లా నాయకులు బోనాల తిరుమల్, జేరిపోతుల సంపత్, చిప్పరి వెంకట్రాజు హెచ్చరించారు. సాక్షి టీవీ జిల్లా కరస్పాండెంట్ విజేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ఎటువంటి సరైన విచారణ జరుపకుండా కేసుపెట్టి, అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. గతంలో ముత్తారంలోని హోటల్ యాజమాని మల్యాల రాజయ్య భూకబ్జాలపై శ్రీనివాస్‌గౌడ్ పలుమార్లు వార్తా కథనాలు రాశాడని, దానిని మనసులో పెట్టుకున్న రాజయ్య కక్షగట్టి తన వద్ద పనిచేసే మీనుగు రాములు చేత అక్రమ కేసు పెట్టించాడని అన్నారు. కేసుపై సమగ్ర విచారణ జరిపించి శ్రీనివాస్‌గౌడ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ధర్నాలతో దద్దరిల్లిన పోలీస్ స్టేషన్లు...
శ్రీనివాస్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్ల ముందు జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాలు నిర్వహించారు. అనంతరం అక్రమ కేసు ఎత్తివేయాలని ఎస్‌హెచ్‌వోలతోపాటు స్థానిక తహసీల్దార్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేశారు. మంథనిలో పోలీసుల తీరును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

మరిన్ని వార్తలు