అభినందనలు..

10 Mar, 2020 10:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సాక్షి’ దినపత్రిక చీఫ్‌ రిపోర్టర్‌ నిర్మలారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తమ మహిళా జర్నలిస్ట్‌ అవార్డును అందుకున్నారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి  రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాధోడ్‌ ఆమెకు పురస్కారాన్ని అందజేశారు. దీనిని పురస్కరించుకుని  ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్‌ వర్ధెల్లి మురళి, డిప్యూటీ ఎడిటర్‌ రమణమూర్తి, అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఖదీర్‌బాబు  పలువురు సీనియర్‌ పాత్రికేయులు సోమవారం ఆమెకు అభినందనలు తెలిపారు.  నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్ల మండలం, చిలకమర్రి గ్రామానికి చెందిన నిర్మలారెడ్డి గత 20 ఏళ్లుగా  పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. మహిళల ఆదరణ పొందిన ‘సాక్షి’ ఫ్యామిలీ విభాగంలో ఫీచర్‌ జర్నలిస్ట్‌గా పలువురు మహిళల స్ఫూర్తిదాయక విజయాలను వెలుగులోకి తెచ్చారు. మానవీయ కథనాల ద్వారా ఎందరో ఆపన్నులకు చేయూత అందేలా చేశారు. కథా రచయిత్రిగానూ తనదైన ముద్రవేసుకున్న ఆమె గతంలో ప్రతిష్టాత్మక డీఎన్‌ఎఫ్‌ ఉత్తమ మహిళా జర్నలిస్ట్‌ అవార్డును సైతం అందుకున్నారు.

అవార్డు గ్రహీత నిర్మలను అభినందిస్తున్న ‘సాక్షి’ ఎడిటర్‌ వర్దెల్లి మురళి తదితరులు 

మరిన్ని వార్తలు