‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం

20 May, 2018 01:09 IST|Sakshi
‘సాక్షి’ ప్రాపర్టీ షోను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు. చిత్రంలో రాంకీ ప్రతినిధి శరత్‌బాబు, సాక్షి అడ్వరై్టజ్‌మెంట్‌ డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డి, క్రెడాయ్‌ జనరల్‌ సెక్రటరీ రామచంద్రారెడ్డి, సాక్షి అడ్వరై్టజ్‌మెంట్‌ జీఎం రమణకుమార్, అసిస్టెంట్‌ మేనేజర్‌ నాగరాజు, అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ దివాకర్ల, రాంకీ ఎస్టేట్స్‌ రాజ్‌ నారాయణ్, ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌ వి.సత్తిరాజు

తొలిరోజు సందర్శకులతో కిటకిట

నేటితో ముగియనున్న స్థిరాస్తి ప్రదర్శన

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహానగరంలో సొంతింటి ఎంపిక అంత సులువేమీ కాదు. నమ్మకమైన బిల్డర్, నాణ్యమైన నిర్మాణం, గడువులోగా ప్రాజెక్ట్‌ పూర్తి, ఆధునిక వసతులు, తక్కువ ధర.. ఇవన్నీ ఉండాలి. మరి ఇలాంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకోవాలంటే కొనుగోలుదారులు చెమటోడ్చాల్సిందే! కానీ కొనుగోలుదారులు ఒకే వేదికపై ఇవన్నీ పొందటానికి ‘సాక్షి ప్రాపర్టీ షో’ ఆరంభమైంది. శనివారం మాదాపూర్‌ హైటెక్స్‌ దగ్గర్లోని సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ మెగా ప్రదర్శన మొదలైంది. ఉదయం 10 గంటలకు ప్రాపర్టీ షో ప్రారంభమైనప్పటికీ.. మధ్యాహ్నం ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా సందర్శకులతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. నగరానికి చెందిన 32 నిర్మాణ సంస్థలు, 70కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌ల వివరాలను సందర్శకులకు వివరించాయి.

ఆదివారం రాత్రి వరకూ ఈ షో కొనసాగనుంది. ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా హాజరైన హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు మాట్లాడుతూ, ‘‘గతంలో హెచ్‌ఎండీఏ పరిధిలో నెలకు 20 లేఅవుట్ల వరకూ అనుమతులిచ్చే వాళ్లం. ఇప్పుడవి 100 దాటేస్తున్నాయి. హైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌ మొదలైందనడానికి ఇదో ఉదాహరణ’’అని అన్నారు. గతేడాదితో పోలిస్తే దేశం లోని ఇతర నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైల్లో ధరలు పడిపోతుంటే నగరంలో మాత్రం 34% వృద్ధి నమోదైందన్నారు. నగరంలో మెట్రో, ఓఆర్‌ఆర్‌లకు తోడు ఎస్‌ఆర్‌డీపీ, ఫ్లైఓవర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. క్రెడాయ్‌ జనరల్‌ సెక్రటరీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ల్యాండ్, కార్మికులు, సిమెం ట్, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయ ని, దీంతో స్థిరాస్తి ధరలు కూడా 20–40% వరకూ పెరిగాయన్నారు. ఇంకా రేట్లు తగ్గుతాయని చూడటం సరికాదని, ప్రాపర్టీ ఎంపికకు సరైన సమయమిదేనని అన్నారు. కార్యక్రమంలో సాక్షి అడ్వరై్టజ్‌మెంట్‌ డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డి, జీఎం కె.రమణకుమార్‌ పాల్గొన్నారు. 

సరైన సమయంలో ప్రాపర్టీ షో 
ప్రభుత్వ సానుకూల నిర్ణయాలతో నగరంలో రియల్‌ బూమ్‌ మొదలైందని, ఈ సమయంలో ఒకే చోట నగరంలోని అన్ని రకాల ప్రాపర్టీలను ప్రదర్శించడం సరైన నిర్ణయమని ‘సాక్షి’ప్రాపర్టీ షో ప్రధాన స్పాన్సర్‌ అపర్ణా కన్‌స్ట్రక్షన్స్, రాంకీ గ్రూప్‌ అభినందించాయి. అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ దివాకర్ల మాట్లాడుతూ.. ప్రధాన నగరంతోపాటు శివారుల్లోనూ రియల్‌ వ్యాపారం జోరందుకుందని.. అందుకే ఎంపిక చేసిన ప్రాంతాల్లో అపర్ణా ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోందని తెలిపారు. రాంకీ ప్రతినిధి ఎస్‌.శరత్‌బాబు మాట్లాడుతూ.. రెండేళ్లుగా నగరంలో ఆఫీసు, కమర్షియల్‌ లావాదేవీలు పెరిగాయని, దీంతో వచ్చే రెండేళ్లూ నివాస సముదాయాలకు డిమాండ్‌ పెరగడం ఖాయమన్నారు.

మరిన్ని వార్తలు