ఇప్పుడే ముప్పెక్కువ

1 Jun, 2020 02:24 IST|Sakshi

లాక్‌డౌన్‌ సడలింపులతో ‘కరోనా’ పోయిందనే భావన వద్దు

అందరూ మరింత బాధ్యతగా ఉండాల్సిన సమయమిది

వ్యాక్సిన్‌ వచ్చే వరకు  జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి

‘సాక్షి’తో ప్రముఖ వైద్యుడు దశరథరామారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘సాధారణంగా మనమంతా ఒక్కో కాలానికి ఒక్కో పేరు పెట్టుకుంటాం. ప్రస్తుతం మనమంతా ‘కరో నా కాలంలో’ బతుకుతున్నాం అనుకోవాలి. ఊహ తెలిశాక ఎ ప్పుడూ చూడని, కనీసం వినని భయానకమైన పరిస్థితిని చూ స్తున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో కష్టాలుపడుతూ.. చే యాల్సిన పనులెన్నో ఆపుకుంటూ ఇప్పటివరకు కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ సడలింపు ప్రక్రియ చేపట్టాయి.

ఈ వెసులుబాటు ప్రజా సౌలభ్యం కోసమే కానీ, కరోనా ఉధృతి తగ్గినందువల్ల అని అనుకోకూడదు. నిజానికి ఈ సమయంలోనే మన బాధ్యత మరింత పెరగాలి’ అంటున్నారు ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ దశరథరామారెడ్డి. ‘ప్రస్తుతం దేశంలో రోజూ 6,000 కేసులకుపైగా నమోదవుతున్నాయి. అన్ని దేశాల్లో బయటకు కనిపించే సంఖ్య కన్నా, అనధికారికంగా మరిన్ని ఎక్కువగానే కేసులు ఉండొచ్చ’ని చెబుతున్న ఆయన లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనాకు సంబంధించిన ఇతర అంశాలపై చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

ప్రస్తుతానికన్నీ ప్రయోగాలే!
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుం దనేది ఇవాళ అతిపెద్ద ప్రశ్న. అన్ని దేశాలు దీనిపై పరిశోధనలు ముమ్మరం చేశాయి. కానీ, ఎప్పటికప్పుడు వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏ ప్రొఫైల్‌ మారిపోతుండటంతో ఎలాంటి వ్యాక్సిన్‌ దాన్ని అరికట్టే పరిస్థితి లేదు. మన దేశంలోనూ రెండు మూడు రకాల మందులను దీనికి విరుగుడుగా పనిచేస్తాయా లేదా అని గమనిస్తున్నారు. కానీ ఆశించిన ఫలితం లేదు. ప్రయోగాలైతే జరుగుతున్నాయి. మరో 2 నుంచి 6 నెలల్లో ఈ వ్యాధికి మందు ఏదైనా దొరికే అవకాశం ఉండొచ్చు. మొన్ననే ఇంగ్లాండ్‌లో వ్యాక్సిన్‌ సక్సెస్‌ అయ్యిందని మొదట ప్రకటించి తరువాత వెనక్కి తగ్గారు. వ్యాక్సిన్‌ తయారీలో ఎన్నో అవరోధాలుంటాయి. దశలవారీగా పలు ప్రయోగాలు చెయ్యాలి. అందుకే కరోనా వ్యాక్సిన్‌ రావడానికి చాలా కాలం పడుతుంది.

ఇప్పుడే ఎక్కువ జాగ్రత్త అవసరం
లాక్‌డౌన్‌ తీసెయ్యగానే కరోనా పోయిందనే భావన సరికాదు. ముఖ్యంగా మనం లాక్‌డౌన్‌ సమయంలో ఉన్నప్పటి కంటే మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉంటేనే ఈ మహమ్మారి బారి నుంచి బయటపడగలం. సామూహిక వ్యాప్తి ఇంకా మొదలుకాలేదని అంటున్నా.. వాస్తవిక పరిస్థితులు దాన్నే తలపిస్తున్నాయి. మనం జాగ్రత్తలు పాటించక, పరిస్థితి తారుమారైతే సడలింపులు వెనక్కితీసుకుని, మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిన అసహాయస్థితికి ప్రభుత్వాలను నెట్టకూడదు.

అందుకే మన దగ్గర మరణాలు తక్కువ
ప్రపంచ నిష్పత్తితో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాల శాతం కాస్త తక్కువే. నవంబర్‌లో వూహాన్‌లో కరోనా రాకముందే కరోనా కుటుంబానికి చెందిన తక్కువ తీవ్రత కలిగిన కొన్ని వైరస్‌లు మన దేశంలోకి ప్రవేశించడం, దాన్ని తట్టుకునే ఇమ్యూనిటీ ఉండటం వల్ల మన దేశంలో మరణాలు తక్కువ నమోదవుతున్నాయనేది కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మిగతా దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం, జనాభాలో వృద్ధులు ఎక్కువ మంది ఉండటమే.

ఆగస్టు వరకు ఆందోళన తప్పదు
మన దేశంలో కరోనా బారినపడిన వారిలో బీపీ, షుగర్‌లాం టి పెద్ద జబ్బులున్న వాళ్లుంటే వారికది ప్రాణాంతకం గా మారుతోంది. ముఖ్యంగా 60ఏళ్లు దాటిన వారు, చిన్న పిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలి. ఆగస్టు నాటికి కరోనా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా. అప్పటికి హెర్డ్‌ ఇమ్యూనిటీ  (జనాభాలో 60 నుంచి 70% మందికి వైరస్‌సోకి వారిలో వ్యాధి నిరోధకశక్తి వృద్ధి చెందడం) పెరి గితే అప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్పుడిక ఈ వైరస్‌ మిగతా ఫ్లూల మాదిరిగానే సీజనల్‌గా మారిపోతుంది. విషమమైతే తప్ప ప్రాణహాని చేయదు.

రెస్పెక్ట్‌ ఆల్‌.. సస్పెక్ట్‌ ఆల్‌
► ప్రస్తుత పరిస్థితుల్లో భౌతికదూరం పాటించడం తప్ప వేరే మార్గం లేదు. కచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న మనుషుల నుంచి ఆరడుగుల దూరాన్ని పాటిస్తే కరోనా వచ్చే అవకాశాన్ని 90శాతం తప్పించుకున్నట్టే. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి.
► కళ్లు, ముక్కు, నోటి వద్ద చేతివేళ్లతో తాకొద్దు. పొరపాటున ఎక్కడైనా చేత్తో కరోనా ఉన్న వస్తువులని తాకి ఉన్నట్టయితే, పై శరీర భాగాల ద్వారా మనకు కరోనా సంక్రమించే ప్రమాదం ఉంది.
► బయటకి, మరెక్కడికి వెళ్లొచ్చినా శానిటైజర్‌తో చేతులు పూర్తిగా, కచ్చితంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లినప్పుడు వేసుకున్న బట్టలు, ఉతకకుండా మరోసారి వాడకూడదు.
► ఇంట్లో ఏసీకి ఉన్న ఫిల్టర్‌ మార్చుకోవడం మంచిది. 24 డిగ్రీలు లేదా ఆపై సెట్టింగ్‌ ఉంచాలి. ఎయిర్‌ ప్యూరిఫైర్‌ ఉంటే ఇంకా మంచిది.
► క్లాత్‌ మాస్క్‌ కానీ ఎన్‌–95 మాస్కు కానీ ధరిస్తేనే మంచిది. సన్నటి మాస్కులు వాడటం వల్ల ఫలితం లేదు.
► కొందరు కరోనా తగ్గడానికి మందులంటూ ఇళ్లకు వచ్చి అమ్ముతూ బాగా క్యాష్‌ చేసుకుంటున్నారు. అలాంటి మందులకు శాస్త్రీయత లేదు.
► ఆరోగ్యకరమైన, ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తప్ప దేనినీ కరోనాకి మందుగా భావించవద్దు. ప్రస్తుతానికి నివారణను మించిన చికిత్సలేదు.
► కరోనాకు సంబంధించి ఎవరి విషయంలోనూ అలసత్వం, అతి నమ్మకం వద్దు. వేరొకరి నుంచి మనకెంత ముప్పుందో మన నుంచీ ఇతరులకూ అంతే ముప్పుంది. అందుకే రెస్పెక్ట్‌ ఆల్‌.. సస్పెక్ట్‌ ఆల్‌.

మరిన్ని వార్తలు