కరోనా వ్యాప్తి తగ్గుముఖం!

13 Jun, 2020 01:09 IST|Sakshi

మాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్థారణ

వంద లోపలకు తగ్గిస్తే కరోనా మాయం

భౌతిక దూరం, శుభ్రతలతో సాధ్యమే

‘సాక్షి’తో ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి దేశంలో గణనీయంగా తగ్గిందని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ తెలిపారు. గతేడాది డిసెంబర్‌ మూడు, నాలుగో వారంలో చైనాలోని వూహాన్‌లో తొలిసారి కరోనాను గుర్తించగా జనవరి ఆఖరుకు భారత్‌లో ప్రవేశించిందని, అప్పట్లో వైరస్‌ వ్యాప్తిని సూచించే ఆర్‌ నాట్‌ ప్రతి వంద మందికి 180–190 వరకు ఉండేదని బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌ నిర్ధారించిందని శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. వంద మంది కరోనా వైరస్‌ బారిన పడితే.. వారి నుంచి ఇంకో 180–190 మందికి వైరస్‌ సోకుతుందని దీని అర్థం. దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలు విధించిన తర్వాత, వైరస్, వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ప్రస్తుతం ఆర్‌–నాట్‌ 118కి చేరుకున్నట్లు ఆ సంస్థ చెబుతోందని వివరించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లు ప్రతి ఒక్కరూ చేతులను సబ్బుతో తరచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటిస్తూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులకు ధరించడం ద్వారా ఆర్‌ నాట్‌ను వంద కంటే తక్కువ స్థాయికి తీసుకురావొచ్చని, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ జరిపిన అధ్యయనం కూడా స్పష్టం చేసిందని తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే భారత్‌లో కరోనా వైరస్‌ పీడ ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి నియంత్రణలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎస్‌ఐఆర్‌ ఐఐసీటీ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో తొలి నుంచి ముందంజలో ఉందని, సంస్థలోని అన్ని విభాగాల శాస్త్రవేత్తలు అహర్నిశలు చేసిన కృషి ఫలితంగా కోవిడ్‌–19 చికిత్సకు ఉపయోగపడే 3 రసాయన మూలకాలను గుర్తించామని తెలిపారు.

విద్యార్థుల కోసం వెబినార్‌.. 
దేశ యువతను శాస్త్ర రంగాల వైపు మళ్లించే లక్ష్యంతో ఐఐసీటీ శుక్రవారం కరోనాకు సంబంధించిన వేర్వేరు అంశాలపై వెబినార్‌ నిర్వహించింది. కరోనా వైరస్‌ తీరు తెన్నులు, దాన్ని ఎదుర్కొనేందుకు ఐఐసీటీ చేపట్టిన కార్యకలాపాలను ఐఐసీటీ డైరెక్టర్‌ వివరించారు. వ్యాధులకు మందులు ఎలా తయారు చేస్తారన్న విషయాన్ని.. వ్యాక్సిన్‌ తయారీ వాటి పరీక్షలకు సంబంధించిన స మాచారాన్ని సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌లు డాక్టర్‌ ప్రథమ ఎస్‌ మైన్‌కర్, సీహెచ్‌ రాజిరెడ్డి, డాక్టర్‌ ఆంథొనీ అడ్లగట్ట వివరించారు. శానిటైజర్ల వాడకం, ఇళ్లల్లో వాటి తయారీపై సీనియర్‌ శాస్త్రవేత్త రతి రంజన్‌ వివరించారు. తిరిగి వా డగల మాస్కులను అభివృద్ధి చేసిన సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ శ్రీధర్‌ వాటి అవసరానికి సంబంధించిన సమాచారాన్ని వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం వివరాలు డాక్టర్‌ రామానుజ్‌ నారాయణ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు