అంగుళం భూమినీ ఆక్రమించనివ్వం 

3 Jul, 2019 08:45 IST|Sakshi

ఎలాంటి సవాళ్లనైనాఎదుర్కొనేందుకు సిద్ధం 

ప్రభుత్వం నుంచి మాకు పూర్తి మద్దతు 

దాడులతో మా ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు 

అమాయక ప్రజలను రెచ్చగొట్టడం వల్లే ఘర్షణాత్మక పరిస్థితి 

సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో పీసీసీఎఫ్‌ పీకే ఝా

సాక్షి, హైదరాబాద్‌ : కొత్తగా ఒక్క అంగుళం అటవీభూమిని కూడా ఆక్రమణలకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, ఈ విషయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ప్రశాంత్‌కుమార్‌ ఝా స్పష్టంచేశారు. ప్రభుత్వపరంగా తమకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు, మద్దతు అందుతున్న నేపథ్యంలో తమకు అప్పగించిన విధులను అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. విధుల నిర్వహణ, అటవీ ఆక్రమణలను అడ్డుకునే క్రమంలో ఇటీవల కొన్నిచోట్ల చోటుచేసుకున్న ఘటనలతో అధికారులు, సిబ్బంది ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కేసులు పెట్టడంతోపాటు దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుందని, అలాగే తమ విధుల నిర్వహణకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందున వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వపరంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయడంతో పాటు అడవుల సంరక్షణ, తదితర చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు.  

సాగుకాలం మొదలు కావడంతో ఆక్రమణలు
సాగుకాలం జూలైలో మొదలుకానుండటంతో అడవుల్లో కొత్త ఆక్రమణలకు ప్రయత్నాలు మొదలయ్యాయని ఝా వెల్లడించారు. గతంలోనే గుర్తించిన అటవీభూమిలో మొక్కలు నాటేందుకు అధికారులు, సిబ్బంది వెళుతుండడంతో కొన్నిచోట్ల ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడుతోందన్నారు. గిరిజనులు, ఇతర రైతులు ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు బలవంతంగా చెట్లు నాటుతున్నారనే ఆరోపణలున్నాయి కదా అని అడగ్గా.. అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది ఎన్నో కష్టనష్టాలకోర్చి పనిచేస్తున్నా అటవీశాఖను అడవులు సంరక్షించే విభాగంగా, చట్టాలను కాపాడే శాఖగా చూడకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. సార్సాలో జరిగిన ఘటన చూస్తే పోలీసులు, అటవీ సిబ్బందిపై దాడి జరిగిన తీరు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. చట్ట పరిరక్షణకు వెళ్లినవారిపై ఇలాంటి దాడులు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

సిబ్బందికి ఆయుధాలిస్తే ఇలాంటి దాడులు జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని భావిస్తారా అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నారు. అటవీ అధికారులకు కూడా ఆయుధాలు సమకూర్చాలని వస్తున్న డిమాండ్‌పై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా.. అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే సూచనలు కనిపించడం లేదని పేర్కొన్నారు. స్మగ్లర్లు, అటవీ నేరస్తులపై తప్ప ప్రజలపై అటవీ అధికారులు ఆయుధాలను ప్రయోగించే పరిస్థితి రాదని స్పష్టంచేశారు. 1980లలో అటవీశాఖ వద్ద కూడా ఆయుధాలుండేవని.. అయితే, మారుమూల ప్రాంతాల్లో అటవీ సిబ్బంది నుంచి నక్సలైట్లు ఆయుధాలు ఎత్తుకెళ్తుండటంతో వాటన్నింటినీ పోలీస్‌శాఖ వద్ద డిపాజిట్‌ చేశారని తెలిపారు. అప్పటి నుంచి ఆయుధాలు లేకుండానే అన్నిస్థాయిల్లోని అధికారులు అడవుల్లో విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. గిరిజనుల భూములను అటవీశాఖ బలవంతంగా లాక్కుంటోందని, కొన్నేళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న చోట కూడా హరితహారం కింద మొక్కలు నాటుతోందని, దాడులకు కూడా పాల్పడుతోందని వస్తున్న ఆరోపణలను ఝా తోసిపుచ్చారు. అడవుల్లోని భూమిని అప్పగిస్తామని, చెట్లను కొట్టి వ్యవసాయం చేసుకుంటే పట్టాలు ఇప్పిస్తామని అమాయక ప్రజలను కొంతమంది రెచ్చగొట్టడం వల్లే అడవుల్లో ఘర్షణాత్మక పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు