హాజరు అంతంతే..

15 Feb, 2019 12:50 IST|Sakshi

ముగిసిన 16వ లోక్‌సభ సమావేశాలు

17 సెషన్లలో 331 రోజుల పాటు నిర్వహణ

ఎక్కువ రోజులు హాజరైన మానుకోట ఎంపీ ‘నాయక్‌’

ఆ తర్వాత స్థానంలో భువనగిరి ఎంపీ నర్సయ్యగౌడ్‌

ఎక్కువ ప్రశ్నలు సంధించింది ‘బూర’

అతి తక్కువగా వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : లోక్‌సభ సమావేశాల్లో మన ఎంపీల హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం 2014 మే 26న కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టగా.. 16వ లోక్‌సభ మొదటి సమావేశం జూన్‌ నాలుగో తేదీన జరిగింది. అప్పటినుంచి 17 సెషన్లలో 331 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఉమ్మడి వరంగల్‌ నుంచి ముగ్గురు ఎంపీలు పసునూరి దయాకర్‌ (వరంగల్‌), అజ్మీర సీతారాం నాయక్‌ (మహబూబాబాద్‌), డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి) ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఈ ఐదేళ్లలో వారు పలు సమస్యలపై గళమెత్తారు. అయితే కొన్ని సమస్యలు పరిష్కారం కాగా.. మరి కొన్ని అలానే ఉన్నాయి. మొత్తానికీ లోక్‌సభ సమావేశాలకు మన ప్రజాప్రతినిధులు కనీసం 80 శాతం హాజరుకాకపోవడం గమనార్హం. 16వ లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగిసిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

వరంగల్‌ : ‘పసునూరి’ ఇలా..
2015 నవంబర్‌ 24న వరంగల్‌ పార్లమెంట్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో నిలిచిన పసునూరి దయాకర్‌ గెలుపొందారు. అంతకంటే ముందు 2014లో వరంగల్‌ ఎంపీగా కడియం శ్రీహరి గెలుపొందారు. ఆ తర్వాత కాలంలో సీఎం కేసీఆర్‌ ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను అప్పగించడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గడిచిన నాలుగేళ్లలో దయాకర్‌ 112 రోజులు లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి చివరి సమావేశం వరకు ఐదు ప్రశ్నలు మాత్రమే లేవనెత్తారు. బాలికల అక్రమ రవాణా, పసుపు బోర్డు ఏర్పాటు, వాటర్‌ పొల్యూషన్, ట్రేడ్‌ ఇన్‌ బిట్‌కాన్, రూరల్‌ డెవలప్‌మెంట్ల్‌పై ప్రశ్నలు సంధించారు. 2015 డిసెంబర్‌ 18, నుంచి లెబర్‌ డిపార్ట్‌మెంట్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా పసునూరి కొనసాగారు.

మహబూబాబాద్‌ : సీతారాంనాయక్‌..
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మహబూబాబాద్‌ ఎంపీగా డాక్టర్‌ అజ్మీరా సీతారాంనాయక్‌ గెలుపొందారు.  ఐదేళ్లలో 331 రోజులు సభ జరుగగా.. 227 రోజులు హాజరయ్యారు. 44 డిపార్ట్‌మెంట్లపై 118 ప్రశ్నలు అడిగారు. 2014 సెప్టెంబర్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు పార్లమెంట్‌ నిబద్ధత కమిటీ సభ్యుడు, కమ్యూనికేషన్‌ ఇన్‌ఫర్మమేషన్‌ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా.. 2017 నవంబర్‌ 3 నుంచి కెమికల్‌ ఫర్టిలైజర్స్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2017 సెప్టెంబర్‌ ఒకటి నుంచి నవంబర్‌ 2 వరకు సోషల్‌ జస్టిస్‌ ఎంపవర్‌మెంట్‌ సభ్యుడిగా కొనసాగారు.

భువనగిరి : బూర నర్సయ్యగౌడ్‌..
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ సభ్యుడిగా డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌గెలుపొందారు. 16వ లోక్‌సభ సమావేశాలు ముగిసేసరికి ఆయన 184 రోజులు హాజరయ్యారు. సమావేశాల్లో 59 డిపార్ట్‌మెంట్లపై 216 ప్రశ్నలు సంధించారు. 2014 సెప్టెంబర్‌ ఒకటి నుంచి లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 2014 సెప్టెంబర్‌ 12 నుంచి 2018 జనవరి 8 వరకు పార్లమెంటరీ వెనుకబడిన తరగతుల స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సభ్యుడిగా కొనసాగారు.

పాస్‌పోర్ట్‌ కార్యాలయం తెచ్చా..
వరంగల్‌కు పాస్‌పోర్ట్‌ కేంద్రాన్ని మంజూరు చేయించి తీసుకొచ్చాను. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశాను. నా వంతు అభివృద్ధికి పాటుపడ్డా. తక్కువ సమయంలో సీనియర్ల దగ్గర చాలా నేర్చుకున్నా. వరంగల్‌లో నేషనల్‌ హైవేలు తీసుకొచ్చాను. కొడకండ్లకు ఏకలవ్య స్కూల్‌ మంజూరు చేయించాను. దీనికి దాదాపు రూ.200 కోట్ల వ్యయమవుతోంది. ప్రభుత్వం కేటాయించిన నిధుల ద్వారా రోడ్లు, కమ్యూనిటీహాళ్లు తదితర అభివృద్ధి పనులకు కేటాయించాను. – పసునూరి దయాకర్, వరంగల్‌ ఎంపీ

గొప్ప అనుభూతి..
మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రొఫెసర్‌గా, సోషల్‌ వర్కర్‌గా కొనసాగుతూనే సీఎం కేసీఆర్‌ ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమంలో పాల్గొన్నాను. కేసీఆర్‌ నన్ను గుర్తించి లోక్‌సభ టికెట్‌ ఇచ్చి గెలిపించి పార్లమెంట్‌కు పంపించారు. గిరిజన బిడ్డగా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి, దేశ గిరిజన సమస్యలపై పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లా. కొన్నింటిని సాధించాను. జిల్లాకు పాస్‌పోర్ట్, నేషనల్‌ హైవేలు, రెండు ఆర్వోబీలు, కొత్త రైళ్లను మంజూరు చేయించాను. – డాక్టర్‌ అజ్మీర సీతారాంనాయక్, మానుకోట ఎంపీ 

మరిన్ని వార్తలు