వేతనజీవి వర్రీ... శాలరీ

15 May, 2020 06:34 IST|Sakshi

లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌ వేతనం ఇవ్వలేమని పలు యాజమాన్యాల స్పష్టం.కార్మిక శాఖకు ఉద్యోగులు, కార్మికుల లిఖితపూర్వక ఫిర్యాదులు. పనిచేసిన రోజులకే జీతాలిస్తామని కొన్ని సంస్థల వెల్లడి. పనులు పునఃప్రారంభమయ్యాక సర్దుబాటు చేస్తామన్న మరికొన్నిసగం జీతం, అడ్వాన్స్‌లతో సరిపెట్టిన ఇంకొన్ని సంస్థలు. పూర్తి వేతనాలు చెల్లించిన సంస్థలు పది శాతంలోపే.. 

సాక్షి, హైదరాబాద్ ‌: వేతనజీవికి వణుకు పుడుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తిన సంక్షోభంతో సగటు ఉద్యోగి వేతనం సందిగ్ధంలో పడింది. మే నెల పక్షం రోజులు గడిచినా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగు లకు ఇంకా వేతనాలు అందలేదు. లాక్‌డౌన్‌ కారణంగా సంస్థలు మూతబడటం, కార్యకలాపాలు పూర్తిగా నిలిచి పోవడం, యాజమాన్యాల ఆర్థిక ప్రణాళిక తలకిందులు కావడంతో ఏప్రిల్‌ నెల వేతనాలు ఇవ్వడం గందరగోళంగా మారింది. కొన్ని సంస్థలు పనిచేసిన రోజులకే జీతాలిస్తా మని స్పష్టం చేయగా మరికొన్ని మాత్రం కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల జీవనాన్ని దృష్టిలో పెట్టుకుని సగం వేతనం ఇస్తున్నాయి. మరికొన్ని కార్యకలాపాలు పునరుద్ధ రించిన తర్వాత చెల్లిస్తామని చెబుతున్నాయి. రాష్ట్రవ్యా ప్తంగా ఇప్పటివరకు పూర్తి వేతనాలు చెల్లించిన సంస్థలు 10 శాతంలోపే అని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు.

సగం మందికి జీతం కట్‌
లాక్‌డౌన్‌ కారణంగా రోజువారీ కార్యకలాపాలు నిలిచి పోడంతో ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు చాలా వరకు ఏప్రిల్‌ నెల వేతనాన్ని అందుకోలేదు. వాస్తవానికి ఏప్రిల్‌ నెల పూర్తిగా లాక్‌డౌన్‌ అమలు కావడంతో నిర్దేశించిన సంస్థలు మినహా మిగతావన్నీ మూతపడ్డాయి. దీంతో వారి లావాదేవీలు నిలిచిపోయాయి. మార్చి నెలలో 22 నుంచి లాక్‌డౌన్‌ అమలైనప్పటికీ.. అప్పటివరకు కార్య కలాపాలు సాగడంతో యాజమాన్యాలు ఆర్థికంగా కొంత మేర నిలదొక్కుకోవడంతో ఏప్రిల్‌ నెల 10వ తేదీలోగా ఉద్యోగులకువేతనాలు ఇచ్చారు. కొన్ని సంస్థలు పనిచేసిన కాలానికి వేతనాలు ఇవ్వగా.. దాదాపు 40 శాతం సంస్థలు మాత్రం పూర్తి వేతనం అందించాయి. 20 శాతం కంపెనీలు కొంత మేర అడ్వాన్స్‌లుగా చెల్లించి చేతులు దులుపుకున్నాయి. కానీ ఏప్రిల్‌ నెల వేతన చెల్లింపుల్లో మాత్రం మెజార్టీ కంపెనీలు చేతులెత్తేశాయి. రాష్ట్రవ్యాప్తంగా సంఘటిత రంగంలో 49 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో పీఎఫ్‌ పొందుతూ కార్మిక శాఖ రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం 21.5 లక్షలు. మిగిలిన వారికి పీఎఫ్, ఈఎస్‌ఐ లాంటివి ఇవ్వనప్పటికీ నైపుణ్య ఆధార రంగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఏప్రిల్‌ నెల వేతనాలు అందుకోని వారు దాదాపు 50 శాతం మంది ఉన్నట్లు తెలుస్తోంది.

వెల్లువలా ఫిర్యాదులు..
వేతనాలు అందకపోవడంతో కొందరు ఉద్యోగులు కార్మిక శాఖ ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్లకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు ఈ మెయిల్, వాట్సాప్‌ ద్వారా లేఖలు ఇస్తున్నారు. ఇందులో సంస్థల పేర్లు ప్రస్తావిస్తున్నప్పటికీ, ఉద్యోగి వివరాలు, కేటగిరీ తదితరాలను మాత్రం ఇవ్వడం లేదని ఓ అధికారి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా విద్యా సంస్థలు బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదనే ఫిర్యాదులు కార్మిక శాఖకు ఎక్కువగా వచ్చాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, అటో మొబైల్‌ సంస్థల్లో చాలావరకు వేతనాలు ఇవ్వలేదని సమాచారం. కార్మిక శాఖకు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందిస్తున్నారు. ఆయా యాజమాన్యాలను ఫోన్‌ ద్వారా సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు వివరణ ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం వేతనాలు చెల్లిస్తామని కొందరు చెబుతుండగా.. పనిచేసిన కాలానికి వేతనాలు ఇచ్చామని, ఏప్రిల్‌ నెలలో అడ్వాన్స్‌ రూపంలో కొంత మొత్తాన్ని ఇచ్చామని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు