వృద్ధ అర్చకుల ‘సవరణ’ వెతలు

26 Oct, 2017 00:58 IST|Sakshi

     ‘వేతన సవరణ’ నేపథ్యంలో వయోపరిమితి అమలుకు అడుగులు

     చిన్న దేవాలయాల్లో వందల సంఖ్యలో వయసు మీరిన అయ్యవార్లు

     గుడినే నమ్ముకుని బతుకుతున్న పేద పంతుళ్లు.. 

     మరో అండ లేకపోవడంతో ఆందోళనలో ఆ కుటుంబాలు

కూకట్‌పల్లికి చెందిన రామశాస్త్రి స్థానిక దేవాలయంలో 20 ఏళ్లుగా అర్చకుడిగా పని చేస్తున్నారు.. ఇప్పుడు ఆయన వయసు 68 సంవత్సరాలు. ఇంతకాలం అడ్డురాని వయసు.. ఇప్పుడు ఆయన ఉపాధికే ఎసరు పెట్టింది. పదవీ విరమణ వయసు దాటినందున అర్చకుడిగా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పేదరికంలో మగ్గుతున్న ఆయనకు ఆదుకునే అండ లేకపోవడంతో ఆ కుటుంబం ఆందోళనలో పడింది.    
– సాక్షి, హైదరాబాద్‌

ఇలా ఒక్క రామశాస్త్రికే కాదు.. రాష్ట్రంలోని వందల మంది అర్చకులకు ఉన్నట్టుండి ఇబ్బంది వచ్చిపడింది. దేవాలయ అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతన సవరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో కసరత్తు మొదలెట్టిన అధికారులు అర్చకుల పదవీ విరమణ వయసుపై దృష్టి సారించారు. విరమణ వయసు దాటి అర్చకులుగా కొనసాగుతున్నవారి విషయంలో నిర్ణయం తీసుకునే దిశగా యోచిస్తున్నారు. వారి తొలగింపు విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అర్చకులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయిస్తే వందల మంది పేద అర్చకుల కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. 

పెద్ద ఆలయాల్లోనే..
అర్చకుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు. దేవాదాయ శాఖ పర్య వేక్షణలోని పెద్ద దేవాలయాల్లోనే ఈ ని బంధన అమలవుతోంది. చిన్న దేవాలయాల్లో నిబంధనను పట్టించుకోకపోవడంతో చాలా దేవాలయాల్లో వయసుతో నిమిత్తం లేకుండా అర్చకులు పని చేస్తున్నారు. పాలక మండళ్లు నియమించినవారు కావటంతో వారి వయసు నూ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పేదరికంలో మగ్గుతున్న వృద్ధులు అర్చకత్వాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 

ప్రభుత్వం నుంచే వేతనాలు..
అర్చకులకు ప్రభుత్వం నుంచే నేరుగా వేతనాలు అందేలా వేతన సవరణకు ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది. దేవాలయాల నుంచి వేతనాలకు కేటాయించే 30 శాతం నిధులు, లోటు ఏర్పడితే ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఇచ్చే నిధులనుంచి వేతనాలు చెల్లించనున్నారు. ఈ క్రమంలో ఒక్కో అర్చకుడి వివరాలు సేకరిస్తున్న అధికారులకు వయసు నిబంధన ఎదురైంది. ఇంతకాలం పట్టించుకో కుండా సాగినా, వేతన సవరణ జరుపుతున్నందున నిబంధన అమలు చేయకుంటే ఎలా అన్న సందేహం తలెత్తింది. అయితే 60 ఏళ్లు దాటిన అర్చకులు వందల సంఖ్యలో ఉండ టంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. 60 ఏళ్లు దాటిన అర్చకుల్లో ఎక్కువ మంది పేదలే కావటం, వారిలో చాలామందికి మరో అండ లేకపోవటంతో.. ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 

పాపం.. పాలక మండళ్లదే 
దేవాదాయ శాఖ ఆలయ నియామకాల్లో పాలక మండళ్లదే ప్రధాన పాత్ర. ఖాళీలు, అర్హతలతో సంబంధం లేకుండా డబ్బు వసూలు చేసి నియామకాలు జరిపిన దాఖలాలు కోకొల్లలు. కానీ దీన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. నియామకాలపై నిషేధం ఉన్నా, పాత తేదీలతో పోస్టింగులు ఇవ్వడం.. పాలక మండళ్ల గడువు తీరినా, పాత తేదీలతో పైరవీ చేసి పోస్టింగులు ఇప్పించడం పరిపాటిగా మారింది. మరోవైపు చిన్న దేవాలయాల్లో వయో నిబంధన అటకెక్కింది. ఇంతకాలం నామమాత్రంగా కూడా పట్టించుకోని దేవాదాయ శాఖ.. ఇప్పుడు వారిని ఉన్నట్టుండి తొలగించే దిశగా యోచిస్తుండటం వివాదాస్పదమవుతోంది.   

మరిన్ని వార్తలు