అధ్యాపకులకు వేతనాల పెంపు

15 Aug, 2018 02:42 IST|Sakshi

కనీసంగా 20% పెరగనున్న వేతనాలు

సెంట్రల్‌ ఏడో పీఆర్సీ వర్తింపునకు చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపకుల వేతనాలు త్వరలోనే పెరగనున్నాయి. పెంపు కనీసం 20 శాతం ఉంటుందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ఏడో వేతన సవరణ కమిషన్‌ సిఫారసులను అమలు చేసేందుకు ఇటీవల ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆ కమిటీ మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలో సమావేశమై చర్చించింది. కమిటీ ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 5వేల మందికి పీఆర్సీ ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చింది.

అందులో 240 మంది ఎయిడెడ్‌ డిగ్రీ అధ్యాపకులు, 1,350 మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సిబ్బంది, 1,000 మంది వరకు యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది ఉన్నట్లు అంచనా వేసింది. ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీల్లో పాత పెన్షన్‌ వర్తించే దాదాపు 2,500 మంది రిటైర్డ్‌ అధ్యాపకులకు ఈ పీఆర్సీ ప్రయోజనాలను వర్తింపచేయాల్సి ఉంటుందన్న ఆలోచనకు వచ్చింది. ఇందుకు రూ.100 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని భావిస్తోంది. అయితే అందులో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుండగా, మరో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది.

2019 మార్చి 31లోగా కేంద్ర ఏడో పీఆర్సీని వర్తింపజేయకపోతే అందుకోసం ఇవ్వాల్సిన నిధులను తాము ఇవ్వబోమని, ఈలోగా వర్తింపజేస్తేనే తమ వాటా కింద ఇవ్వాల్సిన నిధులను ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో వేతనాల పెంపునకు కసరత్తు ప్రారంభమైంది. ఈనెల 21న అధ్యాపకులు, అధికారులతో మరోసారి సమావేశం కావాలని, తర్వాత ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై నివేదిక ఖరారు చేయాలని నిర్ణయించింది. కమిటీ ఇచ్చే సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి, వేతనాల పెంపును ప్రకటించనుంది. దీనికి ఒకటి రెండు నెలల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు