ప్రభుత్వం ఆదేశిస్తే సేల్‌ డీడ్‌ రద్దు చేయొచ్చు

28 Sep, 2017 01:56 IST|Sakshi

రిజిస్ట్రార్లకు ఆ అధికారం ఉంది: ఉమ్మడి హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ఏదైనా ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేరు మీద సేల్‌ డీడ్‌ ద్వారా రిజిస్టర్‌ అయి ఉండి ఆ డీడ్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం కోరినప్పుడు రద్దు చేసే అధికారం రిజిస్ట్రేషన్‌ అధికారులకు ఉందని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్రైవేటు వ్యక్తులకు ముందస్తు నోటీసు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇలా సేల్‌ డీడ్‌ రద్దు చేయడంపై అభ్యంతరాలు ఉంటే సదరు ప్రైవేటు వ్యక్తులకు సివిల్‌ కోర్టులను ఆశ్రయించే ప్రత్యామ్నాయం ఉందని తెలిపింది. రాష్ట్రానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య ఇలాంటి వివాదాల్లో అనేక సాక్ష్యాలు అవసరం ఉంటాయని, వాటిని న్యాయ సమీక్ష ద్వారా ఉన్నత న్యాయ స్థానాలు తేల్చజాలవని స్పష్టం చేసింది.

ప్రస్తుత కేసులో పిటిషనర్లకు ప్రత్యామ్నాయాలు ఉన్నందున, వాటిని ఉపయోగించుకోవాలని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు తీర్పు నిచ్చారు. 2007లో రిజిస్టర్‌ అయిన సేల్‌ డీడ్‌ను 2017లో సంగారెడ్డి జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌–1 రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన వి.లక్ష్మీప్రసన్న, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఒకసారి రిజిస్టర్‌ అయిన భూమిని రద్దు చేసే అధికారం సబ్‌ రిజిస్ట్రార్‌కు లేదని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వై.వి.రవిప్రసాద్‌ వాదించారు. అది కూడా పదేళ్ల తర్వాత రద్దు చేయడానికి చట్టం ఒప్పుకోదని, అంతేకాక తమకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయని విన్నవించారు.

ప్రభుత్వ న్యాయవాది ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. చట్ట నిబంధనల ప్రకారం ఇలాంటి వివాదాల్లో అభ్యంతరం ఉన్న వ్యక్తి సివిల్‌ కోర్టుకు వెళ్లవచ్చన్నారు. ప్రభుత్వం ఫలానా సేల్‌ డీడ్‌ను రద్దు చేయాలని కోరినప్పుడు థర్డ్‌ పార్టీకి ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. రిజిస్ట్రేషన్‌ రూల్స్‌ ప్రకారం ప్రభుత్వం అధీకృత అధికారి సేల్‌ డీడ్‌ రద్దు కోసం దరఖాస్తు సమర్పించినప్పుడు గతంలో ఆ భూమి రిజిస్ట్రేషన్‌తో ముడిపడి ఉన్న వ్యక్తులందరికీ తెలియచేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. చట్ట నిబంధనల మేరకు డీడ్‌ను సమర్పించినప్పుడు దాన్ని తిరస్కరించే అధికారం రిజిస్ట్రేషన్‌ అధికారులకు లేదని తెలిపారు.

మరిన్ని వార్తలు