సేల్స్ డౌన్

7 Jun, 2014 00:05 IST|Sakshi

తగ్గుముఖం పట్టిన పెట్రోలు, డీజిల్ అమ్మకాలు
జోరు తగ్గిన సీమాంధ్ర వాహనాల రాకపోకలు
శివారు బంకులపైనే అధిక ప్రభావం

 
హైదరాబాద్: పెట్రోలు, డీజిల్ వినియోగంలో సింహభాగమైన గ్రేటర్‌లో వీటి అమ్మకాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో దీని ప్రభావం పెద్దగా లేనప్పటికీ శివారు ప్రాంతాల్లో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికలు తదితర కారణాలతో శివారు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గాయి. గత మూడునెలల నుంచి సగటున 20శాతం వరకు అమ్మకాలు (సేల్స్) పడిపోయినట్లు ఆయిల్ కంపెనీల ప్రతినిధులే ధ్రువీకరిస్తున్నారు. రాష్ట్రంలోనే పెట్రో ఉత్పత్తుల వినియోగంలో సగంవాటా ఉన్న నగరంలో అమ్మకాలు తగ్గడం ప్రభుత్వ ఖజానాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఇదీ లెక్క: మహానగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోలు, డీజిల్ బంకులు ఉన్నాయి. డిమాం డ్‌ను బట్టి సంబంధిత ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతినిత్యం 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంటోంది. ఒక్కో ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. మొత్తం బంకుల ద్వారా ప్రతి రోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోలు, 33 లక్షలలీటర్ల డీజిల్ విక్రయవుతుందని అంచనా. నగర ంలోని 40 లక్షల వివిధ రకాల వాహనాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించే సుమారు లక్ష వరకు వాహనాలు ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్‌ను వినియోగిస్తుంటాయి. అయితే గత మూడునెలలుగా రాజకీయ అనిశ్చితి, ఎన్నికల హడావుడి, వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటవుతుండడం తదితర కారణాలతో సీమాంధ్ర ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలు తగ్గాయని తెలుస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా శివారు ప్రాంతాల్లోని బంకులపై పడింది. ఫలితంగా సుమారు 22 శాతం పెట్రోలు, 18 శాతం డీజిల్ అమ్మకాలు పడిపోయినట్లు ఆయిల్ కంపెనీల మార్కెటింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 ప్రభుత్వ ఖజానాపై ప్రభావం: మహానగరంలో పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గుదల ప్రభా వం రాష్ట్ర ఖజానాపై చూపుతోంది. పెట్రోలు అమ్మకంపై 31 శాతం, డీజిల్ అమ్మకంపై 22 శాతం వ్యాట్ రూపంలో డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఖజానాకు కల్పవృక్షమైన వాణిజ్యపన్నులశాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల రాబడి అత్యంత కీలకం. మొత్తం రాష్ట్ర రాబడిలో 74శాతం వరకు ఇక్కడనుంచే జమవుతోంది. వాణిజ్యపన్నులశాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) ప్రధానమైనది.  ప్రస్తుతం నెల కొన్న పరిస్థితులతో పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గి వ్యాట్ వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టడంతో శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతియేటా ప్రభుత్వం టార్గెట్లు విధించి ఆదాయాన్ని పెంచాలని కోరుతుంటే.. ఇందుకు భిన్నంగా ఆదాయం తగ్గుతోందని అంటున్నారు.
 
 

మరిన్ని వార్తలు