సిద్దిపేటలో ‘సమంత’ సందడి

11 Mar, 2017 02:25 IST|Sakshi
సిద్దిపేటలో ‘సమంత’ సందడి

గొల్లభామ చీరల పరిశీలన

ఈ డిజైన్‌ను డ్రెస్‌ మెటీరియల్‌కు అన్వయించాలని సూచన
చేనేత కార్మికులతో మాటామంతీ
డబ్బులు, ఆర్డర్లు మావి..పని మీదంటూ భరోసా


సిద్దిపేట జోన్‌/దుబ్బాక: ప్రముఖ సినీనటి, తెలంగాణ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ సమంత శుక్రవారం సిద్దిపేటలో సందడి చేశారు. పట్టణంలోని పలు చేనేత సహకార సం ఘాలను సందర్శించారు. చేనేత కార్మికులను కలసి వారి కష్టసుఖాల గురించి ఆరా తీశారు. తెలంగాణకే తలమానికంలా నిలిచిన ‘గొల్లభామ’ చీరల ప్రత్యేకతను, కార్మికుడి పని తనం గురించి అడిగి తెలుసుకున్నారు. ముం దుగా ఆదర్శ చేనేత సహకార సంఘం పరి«ధి లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులు, ఇక్కడ తయారయ్యే వస్త్రాల వివరాలను తెలుసుకున్నారు. మహిళలు వినియోగించే స్టోన్స్, పురుషుల కోసం తయారు చేసిన కాటన్‌ షర్టులను కొనుగోలు చేశారు. అనంతరం చేనేత కార్మికుడు తుమ్మ గాలయ్య ఇంటికి వెళ్లి గొల్లభామ చీరలు, కాటన్‌ చీరలను పరిశీలిం చారు. అక్కడ రెండు గొల్లభామ చీరలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి నేరుగా వీరారెడ్డిపల్లి సొసైటీని సందర్శించారు.

డిజైన్‌ అన్వయిస్తే అదృష్టమే..
గొల్లభామ డిజైన్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఇదే పనితనాన్ని చేనేత కార్మికులు డ్రెస్‌ మెటీరియల్‌కు అన్వయిస్తే కార్మికులకు అదృష్టం పట్టుకుంటుందని సమంత పేర్కొన్నారు. గొల్లభామ డిజైన్‌ను, చీరల నైపుణ్యత చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే డిజైన్‌ను డ్రెస్‌ మెటీరియల్‌ మీద అందించడానికి కార్మికులు ముందుకు వస్తే చేనేత పరిశ్రమ అభివృద్ధి సంస్థ పక్షాన పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులకు సూచించారు. ఇందుకు కార్మికులు సుముఖత వ్యక్తం చేశారు. ఆమె వెంట జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

దుబ్బాక చేనేత సంఘంలో..
అనంతరం హీరోయిన్‌ సమంత దుబ్బాక చేనేత సహకార సంఘానికి చేరుకున్నారు. చేనేత కార్మికులు తయారు చేస్తున్న వస్త్రాలను పరిశీలించారు. మగ్గాల మీద కూర్చున్న కార్మికులు, కండెలు చుట్టే మహిళలతో కాసేపు ముచ్చటించారు. సంఘంలో తయారు చేస్తున్న చేతి రుమాలు, టవల్స్, ఇతర వస్త్రాలను చూసిన సమంత బాగున్నాయని ప్రశంసల వర్షం కురిపించారు. కార్మికులు తయారు చేస్తున్న వస్త్రాల మార్కెటింగ్‌ కోసం వ్యక్తిగతంగా ఆర్డర్లను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. శాంపిల్‌ కోసం కార్మికులిచ్చిన చేతి రుమాలు, లెనిన్‌ వస్త్రాలను తన వెంట తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు