తెగిన లెక్కలు

25 May, 2014 03:08 IST|Sakshi

 సమైక్య రాష్ట్రంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక బంధం పూర్తిగా తెగిపోయింది. శనివారం వారు ఆఖరి వేతనం అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పరిధిలో చెల్లింపులు పూర్తయ్యాయి. జిల్లా ట్రెజరీ ద్వారా ఒక్కరోజే రూ.112 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇకనుంచి ఏ రాష్ట్ర ఖర్చులు, చెల్లింపులు, ఆ రాష్ట్రం పరిధిలోకే వెళ్లనున్నాయి.
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మరో ఎనిమిది రోజులే మిగిలిఉంది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక అంశాలకు ఈ నెల 24 వరకు ప్రభుత్వం గడువు విధించింది. ఈ మేరకు శనివారం చెల్లింపులన్నీ పూర్తయ్యాయి. ఇకనుంచి తెలంగాణ, సీమాంధ్ర లెక్కలు వేటికవే అంటూ ఇప్పటికే ట్రెజరీ శాఖకు ఉత్తర్వులు అందాయి. ఆర్థిక ప్రక్రియ అంతా పూర్తి చేసి ఉద్యోగులకు, పెన్షనర్లకు 1750 బిల్లుల రూపంలో శనివారం ఒక్కరోజే రూ.112 కోట్లు చెల్లించారు.
 
 జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు (కేంద్ర ప్రభుత్వం, సింగరేణి, ఆర్టీ సీ ఉద్యోగులు, కార్మికులు మినహాయించి) ఉ న్నారు. ట్రెజరీ శాఖ పరిధిలోని 15వేల మంది ఉద్యోగులకు మే నెల వేతనాలు రూ.50 కోట్లు, 20,700 మంది పెన్షనర్లకు రూ.45 కోట్లు, జూన్ ఒకటో తేదీ వేతనం, టీఏ, డీఏ, ఇతర అలవెన్సులు రూ.17 కోట్లు కలిపి మొత్తంగా రూ.112 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. ట్రెజరీ పరిధి లో లేని మరో 15వేల మంది ఉద్యోగులకు రూ.30కోట్ల చెల్లింపులు జరిగినట్లు  సమాచారం.
 
 పదిహేను రోజులు సేవలకు బ్రేక్!
 రాష్ట్ర విభజన నేపథ్యంలో ట్రెజరీ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నేడు ఆదివారం సెల వు దినం కాగా, సోమవారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సేవలు ఆధారపడి ఉన్నాయి. సాంకేతికపరంగా ఇబ్బందులొస్తే అన్ని రకాల బిల్లుల చెల్లింపులు జరిపేందుకు ఈనెల 26 వరకు గడువు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ట్రెజరీ డీడీ పవన్‌కుమార్ తెలిపారు. జూన్ 2న రాష్ట్రం ఏర్పడుతుండడంతో వచ్చే నెల నుంచి బడ్జెట్ విధానం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి రానుంది. ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో కొత్త ఖాతాలు తెరుస్తుండగా 15 రోజులపాటు లావాదేవీలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాయతీరాజ్, శాసనసభ, పార్లమెంట్, సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పనుల బిల్లులు, కాంట్రాక్ట్, మెడికల్, రీయింబర్స్‌మెంట్ తదితర బిల్లుల చెల్లింపులు ఆగిపోనున్నాయి.
 
 ఉద్యోగుల్లో ఆనందం
 ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంతో  ఆతృతగా ఎదురుచూస్తున్నామని సమైక్య రాష్ట్రంలో శనివారం చివరి వేతనం తీసుకున్న పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పేర్కొన్నారు. జూన్ 2 తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం లాగా అనిపిస్తోందని పేర్కొంటున్నారు. సొంత రాష్ట్ర వికాసంలో కీలక భూమిక పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందుకునే మొదటి వేతనాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, రాష్ట్ర వికాసానికి విరాళంగా అందిస్తామని కొందరు ఉద్యోగులు గర్వంగా తెలుపుతున్నారు.
 
 బంగారు తెలంగాణకు పునరంకితం
 సమైక్య రాష్ట్రంలో ఆఖరి వేతనం అందుకోవడం భవిష్యత్‌కు శుభపరిణామం. ఇకనుంచి తెలంగాణ వికాసంలో కీలకభూమిక పోషిస్తాం. అదనపు పని గంటలు, సెలవుదినాల్లో పనిచేసి బంగారు తెలంగాణ నిర్మించుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలోని మొదటి నెల వేతనాన్ని రాష్ట్ర పునర్నిర్మాణానికి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు విరాళంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
 - సుబేదారి రమేశ్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్
 అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
 
 ప్రజల పక్షాన పోరాటం
 తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర క్రియాశీలకంగా ఉంటుంది. వివిధ ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం మేరకు ప్రజల పక్షాన పోరాడుతాం. జూన్ 2తో ఉమ్మడి రాష్ట్రంతో విముక్తి లభించబోతోంది. ఆర్థిక పరమైన విముక్తి లభించినప్పటికీ తెలంగాణ స్వాతంత్య్రం కోసం ఎదురుచూస్తున్నాం. తెలంగాణలో తీసుకునే మొదటి వేతనంలో కొంతభాగాన్ని అమరవీరుల కుటుంబాలకు సాయంగా అందిస్తా.
 - ఫయాజ్ అలీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
 
 అదనపు పని గంటలు
 ఆరు దశాబ్దాల ఉద్యమం, ఆత్మత్యాగాల ఫలితంగా సాధించిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటాం. అదనపు పని గంటలతో అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాం. జూన్ 2 తర్వాత ప్రతీ రోజూ కీలకమే. ఆర్థికపరమైన తెగతెంపులు వేగవంతంగా జరిగిపోవడం సంతోషంగా ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములం కావాలి. తెలంగాణలో జూన్ నెల వేతనాన్ని అమరవీరుల కుటుంబానికి సాయంగా అందిస్తా.
 - మర్రి శ్రీనివాస్‌యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
 

మరిన్ని వార్తలు