హరీశ్‌రావు ఫిర్యాదు.. సమీర్‌ చటర్జీ ఔట్‌!

12 Oct, 2017 05:20 IST|Sakshi

మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదుతో కృష్ణా బోర్డు నుంచి తొలగించిన కేంద్రం

కొత్త సభ్య కార్యదర్శిగా ఎ.పరమేశం

మరో నూతన సభ్యుడి నియామకం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పక్షపాత ధోరణిని నిరసిస్తూ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఫిర్యాదుపై కేంద్ర జల వనరుల శాఖ స్పందించింది. బోర్డు సభ్య కార్యదర్శి పదవి నుంచి సమీర్‌ చటర్జీని తొలగించింది. ఆయన స్థానంలో పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఎ.పరమేశంను బోర్డు సభ్య కార్య దర్శిగా నియమించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర జల  వనరుల శాఖ అండర్‌ సెక్రెటరీ నరేంద్రసింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డులో కొత్తగా హరికేశ్‌ మీనాను సభ్యుడిగా నియమించారు.

ఇది రెండోసారి..
వాస్తవానికి తొలుత సభ్య కార్యదర్శిగా ఉన్న ఆర్‌కే గుప్తా వ్యవహారశైలి సరిగా లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆయన తీరు కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని పేర్కొనడంతో కేం ద్రం ఆయనను తొలగించి.. ఆ స్థానంలో గతేడాది అక్టోబర్‌లో సమీర్‌ చటర్జీని నియమించింది. కృష్ణా జలాల నీటి వినియోగం, విడుదలకు సంబంధించిన అంశాల్లో సమీర్‌ చటర్జీ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తొలి  నుంచీ ఆయనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అయినా ఇంతకాలం నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. కానీ ఇటీవల కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే అంశంలో సమీర్‌ చటర్జీ మొండిగా వ్యవహరించారు.

ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేనందున ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసినా వినలేదు. పైగా ఫైన  ల్‌నోటిఫికేషన్‌ను తయారు చేసి, దాన్ని ఆమోదించాలంటూ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. దీంతోపాటు ఇటీవల వివాదాస్పద టెలీమెట్రీ లెక్కలు, నీటి పంపకాల విషయంలో ఏపీకి అనుకూలంగా వ్యవహరించారనే  ఆరోపణలున్నాయి. మంత్రి హరీశ్‌రావు ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ.. ఈ నెల 9న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీకి లేఖ రాశారు. బోర్డు సమర్థవంతంగా పనిచేయడంలో విఫలమైందని ఫిర్యాదు చేశారు. దీ నిపై ఉన్నతస్థాయిలో చర్చించిన కేంద్రం.. సమీర్‌ చటర్జీని తప్పించింది.

మరిన్ని వార్తలు