వనంలోకి జనదేవత!

4 Feb, 2018 01:47 IST|Sakshi
శనివారం సమ్మక్కను గద్దె నుంచి తీసుకువెళ్తున్న వడ్డెలు , సారలమ్మను గద్దె నుంచి తీసుకువెళ్తున్న వడ్డెలు

వన ప్రవేశం చేసిన సమ్మక్క–సారలమ్మ 

ఇంటి బాట పట్టిన భక్తులు 

దాదాపు కోటి మంది భక్తులకు దర్శనం

 స్వల్ప ఇబ్బందులు మినహా ప్రశాంతంగా జాతర

ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన మంత్రులు 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: భక్తుల ఇలవేల్పు.. కొంగు బంగారమై కోరికలు తీర్చే కల్పవల్లులు.. భక్త కోటిని చల్లగా కాచిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు వన ప్రవేశం చేశారు. భక్తులను కాపాడేందుకు మళ్లీ రెండేళ్లకు వస్తామంటూ వీడ్కోలు పలికారు. దీంతో సమ్మక్క–సారలమ్మ నినాదాల హోరుతో మార్మోగిన మేడారం గిరులు నిశ్శబ్దంలోకి జారిపోయాయి. భక్తుల పాద స్పర్శతో రేగిన ధూళిమేఘాలు ఆగిపోయాయి. సమ్మక్క–సారలమ్మతో పాటే పగిడిద్దరాజు, గోవిందరాజులు స్వస్థలాలకు పయనమయ్యారు. వచ్చే జాతర నాటికి వస్తామంటూ భక్తులు ఇంటిముఖం పట్టారు. అక్కడక్కడ స్వల్ప ఇబ్బందులు తప్ప మేడారం జాతర ప్రశాంతంగా ముగిసింది. 

మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పించేందుకు తులాభారం వేసుకుంటున్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 

మళ్లీ వస్తాం.. 
వనదేవతల వనప్రవేశంలో భాగంగా శనివారం సాయంత్రం 6.30 గంటలకు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజలు ప్రారంభమయ్యాయి. డోలు వాయిద్యాలు, బూరలు లయబద్ధంగా వాయిస్తూ గద్దెలపై పూజలు చేశారు. ఎవరికీ కనిపించకుండా చుట్టూ చీరలు అడ్డుగా పెట్టారు. సుమారు అరగంట పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. తొలుత 6.50 గంటలకు సమ్మక్కను తీసుకుని పూజారులు గద్దె దిగారు. ఆ తర్వాత విడిది గృహం వద్దకు చేరుకుని నాగులమ్మను తాకి అక్కడ్నుంచి వేగంగా చిలకలగుట్టకు పయనమయ్యారు. సాయంత్రం 6.51 గంటలకు పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజు, గోవిందరాజును తీసుకుని మరికొందరు పూజారులు గద్దె దిగారు. చివరగా సాయంత్రం 6.55 గంటలకు సారలమ్మను తీసుకుని కన్నెపల్లికి బయల్దేరారు. అమ్మల వనప్రవేశ కార్యక్రమం జరిగినంత సేపూ భక్తులు రెప్ప వాల్చకుండా తన్మయత్వంతో తిలకించారు.  

కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. 
మేడారం జాతర తొలిరోజు వరంగల్‌–పస్రా మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అనేకచోట్ల టాయిలెట్లకు నీటి సరఫరా కాలేదు. తాగునీటి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మేడారంలో 4 రోజుల పాటు బస చేసి స్వయంగా పర్యవేక్షించారు. జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు కోటి మంది భక్తులు వనదేవతలను సందర్శించుకున్నట్లు అంచనా. జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, కలెక్టర్‌ కర్ణన్, జాయింట్‌ కలెక్టర్‌ అమయ్‌కుమార్, ఎస్పీ భాస్కరన్‌ నిరంతరం జాతరను పర్యవేక్షించారు.  

ప్రముఖుల తాకిడి 
ఆదివాసీలు, సామాన్యుల జాతరగా పేరొందిన సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈసారి వీఐపీల తాకిడి పెరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. జాతరలో భాగంగా లగ్జరీ టెంట్లు, ఎకోటెంట్లు, హరిత హోటల్‌ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతర నిఘాలో డ్రోన్‌ కెమెరాలను వినియోగించారు. వీఐపీల తాకిడి పెరగడంతో పలుమార్లు క్యూలైన్లు గంటల పాటు నిలిపేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన భక్తులు తరలివచ్చి నాలుగు రోజులు ఇక్కడే ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర విశేషాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ మీడియా ఈసారి ఇక్కడే 4 రోజుల పాటు ఉంది. తొలిసారిగా ఇటలీ, అమెరికా, సింగపూర్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు 4 రోజుల పాటు ఉన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం, క్యూలైన్లలో కొబ్బరి చిప్పలు, బెల్లం ముద్దలు పేరుకుపోవడంతో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. 

మళ్లీ రెండేళ్లకు.. 
జాతర ముగియడంతో తిరిగి 2020 మాఘమాసంలో మేడారం జాతర జరగనుంది. మేడారం జాతర ముగియడంతో భక్తులు ఇంటి బాట పట్టారు. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన భక్తుల రద్దీ శనివారం రాత్రి వరకు కొనసాగింది. ఆర్టీసీ బస్సులు నిర్విరామంగా సేవలందించాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య పస్రా–తాడ్వాయి–మేడారం మధ్య ట్రాఫిక్‌ రద్దీ పెరగడంతో వన్‌వే విషయంలో సడలింపు ఇచ్చారు. ప్రైవేట్‌ వాహనాలను పస్రా–మేడారం మార్గంలో అనుమతించారు.  

మరిన్ని వార్తలు