జన జాతరలు

5 Feb, 2020 04:34 IST|Sakshi

గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకం

దేశవ్యాప్తంగా వందల జాతరలు

విభిన్నం ఆదివాసీల జాతరలు

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క – సారలమ్మ జాతరకు ములుగు జిల్లా ఎస్‌ఎస్‌.తాడ్వాయి మండలంలోని మేడారం ముస్తాబైంది. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోట్లాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకోనున్నారు. సమ్మక్క – సారలమ్మ జాతర తరహాలోనే బీరప్ప, కోట మైసమ్మ, రేణుకా ఎల్లమ్మ వంటి స్థానిక జాతరలు ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అనేక జాతరలు ప్రతీ ఏటా జరుగుతుంటాయి. వీటిలో ప్రధానమైన కొన్ని జాతరల విశేషాలు.

జంగూబాయి: గోండు తెగకు చెందిన ఆదివాసీలు ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం సమీపానికి సరిహద్దు ప్రాంతంగా కలసి ఉన్న మహారాష్ట్రలో ఈ జాతర జరుపుకుంటారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన జంగూబాయి దేవతకు ప్రతిరూపమైన పెద్దపులిని పూజిస్తారు. గోండులంతా మాఘ శుద్ద పౌర్ణమి మాసం రాగానే నెల రోజుల పాటు జంగూబాయి మాలలు వేస్తారు. జంగూమాతను టెంకాయలు మొక్కులుగా సమర్పిస్తారు. అక్కడి గుట్ట లోని గుహలో ఉండే పెద్దపులికి జంగో లింగో అంటూ జేకొడుతూ దర్శనం చేసుకుంటారు.

బీరమయ్య
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బీజీపూర్‌ జిల్లాలోని బస్తర్, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని వాజేడు మండల సరిహద్దు ప్రాంతంలో ఉన్న లొటపిట గం డి కొండల్లో ఆదివాసీలు బీరమయ్య జాతర నిర్వహిస్తారు. పూర్వ కాలంలో ప్రజలను దోపిడీ దొంగలు దోచుకుపోతుంటే వారి నుంచి రక్షించేందు కు ముగ్గురు అన్నదమ్ములు పగిడిద్దరాజు, పాంబోయి, బీరమయ్య సిద్ధమవుతారు. ఈ దోపిడీ దొం గలను తరుముకుంటూ పగిడిద్దరాజు మేడారానికి,  భూపాలపట్నం వైపు, బీరమయ్య లొటపిట గండికి వెళ్లి స్ధిరపడతారు. అప్పటి నుంచి బీరమయ్యకు లొటపిటగండిలో, పాం బోయికి భూపాలపట్నం లో, పగిడిద్దరాజుకు మేడా రంలో జాతరలు నిర్వహిస్తారని అక్కడి పెద్దలు చెబుతారు.

ఈశాన్య రాష్ట్రాల్లో హర్నిబిల్‌ 
భారత దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలు అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. పూర్తిగా కొండలు, అడవులతో నిండిన ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువ. వందల సంఖ్యలో గిరిజన తెగలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడున్న ఏడు రాష్ట్రాల్లో ప్రతి తెగకు సంబంధించి వేర్వేరుగా జాతరలు ఉన్నాయి. వీటిలో నాగాలాండ్‌లో జరిగే హర్నిబిల్‌ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఏటా డిసెంబర్‌ మొదటి వారంలో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర ప్రధాన ఉద్దేశం గిరిజన తెగలకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి , సంప్రదాయాలను కాపాడుకోవడం. ఈ పండుగ సందర్భంగా ఇక్కడి గిరిజనులు ఆటపాటలతో ఆడిపాడుతారు. సంస్కృతికి సంబంధించిన వేడుక కావడంతో ఇది కనులపండువగా సాగుతుంది. హర్నిబిల్‌ జాతర తర్వాత జనవరిలో మణిపూర్‌లో థీసమ్‌ ఫణిత్‌ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

సహ్రుల్‌ 
ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌ రాష్ట్రంలో సహ్రుల్‌ జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా ప్రకృతిని పూజిస్తారు. ఇక్కడ ఉండే సాల్‌ అనే చెట్టుకు ప్రత్యేక పూజలు జరుపుతారు. ధర్తీ మాతగా సీతాదేవి ఇక్కడ కొలుస్తారు. ప్రకృతి విపత్తులు ఇతర కష్టాల నుంచి తమను కాపాడుతారని ఇక్కడి గిరిజనుల విశ్వాసం.

మఘేపరాబ్‌ 
ఒడిశా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్లో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా అనేక జాతరలు జరుగుతాయి. ఇందులో ఏడు ప్రధానమైన జాతరలు ఉన్నాయి. వీటిలో మఘేపరాబ్‌ జాతర ఒకటి. ఈ జాతర సందర్భంగా తమ తెగ దేవతకు నల్లని పక్షులు బలిస్తారు. మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

నాగోబా 
ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లో నాగోబా జాతర జరుగుతుంది. ఆదివాసీలకు ఇది ప్రధాన జాతర. మూడు రోజుల పాటు (ఇటీవలే జరిగింది) నిర్వ హిస్తారు. నాగోబా జాతరను మెస్రం వంశస్తులు, గోండు ఆదివాసీలు జరుపుతారు. పుష్యమాసంలో నెలవంక చంద్రుడు కనిపించగానే.. మెస్రం వంశస్తులు హస్తిన మడుగు నుంచి కలశంతో నీరు తీసుకొచ్చి నాగులమ్మ దేవతను పూజిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.

దంతేశ్వరీ ఉత్సవాలు 
ఆదివాసీ తెగ ప్రజలు అత్యధికంగా జీవించే ఛత్తీస్‌గఢ్‌లో దసరా పండుగ సమయంలో ఇక్కడ అన్నమదేవ్‌ రాజవంశీయులు దంతేశ్వరీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జగదల్‌పూర్‌ కేంద్రంగా జరిగే ఈ జాతరకు అత్యధికంగా గిరిజనులు హాజరవుతారు. రాజవంశీయులు కీలక భూమిక పోషించినా ప్రధాన పాత్ర గిరిజనులదే. అదేవిధంగా రాయ్‌పూర్‌ సమీపంలో ఉన్న భోరమ్‌దేవ్‌ జాతర ప్రత్యేకతను సంతరించుకుంది.

గరియ మాత 
త్రిపుర రాష్ట్రంలో రీంగ్‌ తెగకు చెందిన ఆదివాసీలు గరియ పూజ జాతరను జరుపుకుంటారు. చైత్ర సంక్రాంతి రోజున ఒక వెదురు దండాన్ని ప్రత్యేకంగా కాటన్‌దారం, కాటన్‌తో తయారు చేసిన పూలతో అలంకరిస్తారు. దైవత్వానికి అంకితమైన కొందరు వ్యక్తులు ఈ దండాన్ని పట్టుకుని గ్రామంలో ఇంటింటికీ తిరుగుతారు.ఆ సమయంలో దేవతను స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ నృత్యాలను చేస్తూ పంటలు బాగా పండాలని బాధలు నుంచి విముక్తి కలిగించాలని కోరుతారు.

నాగోబా జాతరలో  భక్తులు (ఫైల్‌)

మరిన్ని వార్తలు