మేడారం: గద్దెలపైకి చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు

5 Feb, 2020 22:28 IST|Sakshi

సాక్షి, ములుగు : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన వనదేవతలు సమ్మక్క – సారలమ్మ జాతర అసలు ఘట్టం మొదలైంది. సారలమ్మ, గోవిందరాజు,  పగిడిద్దరాజు బుధవారం రాత్రి గద్దెలపై ఆశీనులయ్యారు. గిరిజన పూజారులు, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు, గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును పెనుక వంశస్తులు తీసుకొచ్చారు. వీరి రాకతో జాతర లాంఛనంగా ప్రారంభమైంది.

గురువారం (ఫిబ్రవరి 6) సాయంత్రం వేళ సమ్మక్క గద్దెపైకి వస్తుంది. రేపు ఉదయం పూజారులు చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పూజలు చేస్తారు. బుధవారం నుంచి శనివారం వరకు (నాలుగు రోజులు) తేదీ వరకు  సమ్మక్క– సారలమ్మ మహా జాతర కొనసాగుతుంది. ఇక మేడారం మహా జాతర నేపథ్యంలో జనం పోటెత్తారు. ఎటు చూసినా ‘సమ్మక్క సారలమ్మ’సందడి నెలకొంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతర కోసం తెలంగాణ వ్యాప్తంగా ఈ సారి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కంటే ఈ సారి సమాచార, రోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగవడంతో ఎక్కువ మంది వన దేవతల దర్శనం కోసం మేడారానికి పోటెత్తుతున్నారు.

మేడారంలో ప్రముఖుల పూజలు
సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రముఖుల తాకిడి పెరిగింది. బుధవారం మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, వైరా ఎమ్మెల్యే రాములు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అలాగే, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దివంగత కాంగ్రెస్‌ నేత మహేంద్ర కర్మ కుమార్తెలు సుస్మిత, సుమిత్ర వరాల తల్లులను దర్శించుకున్నారు.

నిల్చునే తలనీలాల సమర్పణ
మేడారం జాతరలో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఇక తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట సైతం కిక్కిరిసిపోయింది. దీంతో జంపన్న వాగు వెంట ఎక్కడపడితే అక్కడే తలనీలాలు సమర్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కూర్చునే స్థలం కూడా లేకపోవడంతో భక్తులను నిల్చోబెట్టే నాయీ బ్రాహ్మణులు తలనీలాలు తీయడం కనిపించింది.

ట్రిప్‌కు రూ.3వేలు
ఏటూరునాగారం: మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈసారి విహంగ వీక్షణం చేసేందుకు వీలు కల్పించారు. హెలికాప్టర్‌లో మేడారం జాతర పరిసరాల్లో ఒక ట్రిప్‌ వేయాలనుకునే వారు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న పలువురు భక్తులు మంగళవారం హెలికాప్టర్‌లో జాతరను విహంగ వీక్షణం చేసి సంబురపడ్డారు. ఇక దూర భారం, ఇతర కారణాలతో మేడారం వెళ్లలేని భక్తులు స్థానికంగా మినీ మేడారం జాతర్లలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. విద్యా, ఉద్యోగం, వృత్తి రీత్యా వలస వెళ్లిన అనేక మంది తమ సొంత ఊళ్లకు జాతర కోసం రాకపోకలు అధికమయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్టీసీ డిపో నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. 

మరిన్ని వార్తలు