ఫిబ్రవరిలో మినీ ‘మేడారం’

31 Dec, 2018 02:06 IST|Sakshi

20 నుంచి 23 వరకు జాతర 

తేదీలను ప్రకటించిన సమ్మక్క– సారలమ్మపూజారులు

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2019 సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించే సమ్మక్క– సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. స్థానిక ఎండోమెంట్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు జాతర తేదీలను ప్రకటించారు. ఫిబ్రవరి 20న బుధవారం మండమెలిగే పండుగతో ప్రారంభమయ్యే మినీ జాతర 23వ తేదీ శనివారంతో ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు మినీజాతర తేదీల వివరాలను దేవాదాయశాఖ అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మహాజాతర తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ జాతర నిర్వహిస్తారు. ఈ సమావేశంలో సమ్మక్క– సారలమ్మ పూజారులు సిద్దబోయిన ముణేందర్, సిద్దబోయిన లక్ష్మణ్‌రావు, భోజరావు, మహేశ్, చంద గోపాల్, సిద్దబోయిన అరుణ్‌కుమార్, నర్సింగరావు, వసంతరావు, మల్లెల ముత్తయ్య, సిద్దబోయిన స్వామి, ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్య, సారలమ్మ ఆలయం ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి.. 
మేడారం మినీ జాతరకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు అధికారులను కోరారు. దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు సమారు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలతోపాటు మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసుల సేవలు చాలా అవసరమని, నాలుగు రోజుల పాటు జరిగే మినీ జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారయంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మినీ జాతరను సైతం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని  పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు కోరారు.  

మరిన్ని వార్తలు