గంగను తోడేస్తున్నారు..!

8 Mar, 2019 12:22 IST|Sakshi
మాంగ్‌రుడ్‌ శివారులోని పెన్‌గంగ నదిలో ప్రొక్లెయిన్‌తో ఇసుకను తోడుతున్న దృశ్యం 

పెన్‌గంగలో జోరుగా  ఇసుక తవ్వకాలు

అడుగంటిపోతున్న భూగర్భ జలాలు

పట్టించుకోని అధికారులు

బేల: ఈ సారి అసలే వర్షాభావం, ఆపై ఇటీవల నుంచి మండుతున్న ఎండలతో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను రూపొందిస్తూ భూగర్భ జలాలను పెంచడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంలు, చేన్లలో నీటి కుంటలు, తదితర వాటిని ఏర్పాటు చేస్తూ భూగర్భ జలాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్క మండలంలోని పెన్‌గంగా నదిలో ఇసుక త్రవ్వకాలు ‘మాముల్‌’గానే సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక మాఫియా విచ్చల విడిగా, ఈ ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో పెన్‌గంగాలో గుంతలు ఏర్పడుతున్నాయి.

ఈ ఇసుకను మండలకేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని సిమెంటు ఇటుకల కేంద్రాలతో పాటు ఇతరత్ర వ్యాపార కేంద్రాలకు ఈ ఇసుకను తరలిస్తూ, లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. కానీ సంబంధిత ‘రెవెన్యూ’ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలాగైతే..మండలంలోని మాంగ్‌రుడ్, కోగ్ధూర్, గూడ, బెదోడ, సాంగిడి గ్రామాల శివారులకు సమీపాన (మహారాష్ట్ర సరిహద్దుల్లో) పెన్‌గంగా నది ప్రాంతం ఉంటుంది. ఇందులో కోగ్ధూర్, బెదోడ గ్రామాల శివారులోని పెన్‌గంగా ప్రాంతం బాగా ఎత్తుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు అవకాశం ఉండదు. కాగా మిగితా మాంగ్‌రుడ్, గూడ, సాంగిడి గ్రామాల శివారుల్లో ఇసుక త్రవ్వకాలకు వీలు ఉంటుంది. దీంతో అత్యధికంగా ఈ మూడు ప్రాంతాల్లోని పెన్‌గంగాలో కూలీలే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రొక్లెయిన్, డోజర్‌లతో అక్రమ ఇసుక త్రవ్వకాలు యథేచ్ఛగా చేపడుతున్నారు.

రాత్రి వేళల్లోనూ జోరు..
రాత్రి వేళల్లోనూ ఈ ఇసుక త్రవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. పగలు వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పెన్‌గంగా ఒడ్డును దాటించి, గ్రామ శివారుల్లోని ప్రాంతాల్లోని చాలా చోట్ల ఇసుక నిల్వలను వేయిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ ఇసుకను ప్రత్యేకంగా రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రివేళ ఇలా ఇసుక తరలింపుతో ట్రాక్టర్ల  రాకపోకల శబ్ధాలతో తీవ్రంగా ఇబ్బందులు పడక తప్పడం లేదని కాఫ్రి, బెదోడ, మణియార్‌పూర్, గూడ, దహెగాం, కొబ్బాయి గ్రామాల ప్రజలు అంటున్నారు. ఈ తరలింపుపై పలువురు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా, ఏమాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ ఇసుక త్రవ్వకాలను కట్టడి చేయకుంటే రాబోయే రోజుల్లో భూగర్భజలాలు తగ్గి, త్రాగు నీళ్లకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదముందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ పనులకు ఈ ఇసుకను తీసుకెళ్తున్నారంటూ, ఈ త్రవ్వకాలపై రెవెన్యూ అధికారులు ‘మాముల్‌’గానే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఇసుక త్రవ్వకాలను ఎంతైనా కనీసం రాత్రివేళైనా అరికట్టాల్సి ఉందని మండల వాసులు అంటున్నారు. ఇసుక అక్రమ తరలింపు విషయమై మండల తహసీల్దార్‌ సుగుణాకర్‌ రెడ్డిని ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా..ఇప్పటిదాకా ఈ ఇసుక తరలింపు విషయం మా దృష్టికి రాలేదని పేర్కొన్నారు. మా దృష్టికి వచ్చినట్‌లైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు