ఇసుక మాఫియాకు చెక్

9 Jan, 2015 04:37 IST|Sakshi
ఇసుక మాఫియాకు చెక్

అక్రమ తవ్వకాలకు కాలం చెల్లినట్లే
పట్టాభూములలో తవ్వకాలు కఠినతరం
నిబంధనలు ఉల్లంఘిస్తే డిపాజిట్లు జప్తు
ఇసుకమేటలపై ఇక డీఎల్‌ఎస్‌సీ కీలకం
కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ నియామకం
అమలులోకి రానున్న కొత్త ఇసుక విధానం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలులోకి తేనుంది. పట్టాభూములలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. ఈ మేరకు కొత్త ఇసుక విధానం (న్యూ స్యాండ్ పాలసీ)ని విడుదల చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కె.ప్రదీప్‌చంద్ర గురువారం ఉత్తర్వు లు జారీ చేశారు. పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు, ఇసుక రీచ్‌ల గుర్తింపు, కేటాయింపు, టీఎస్‌ఎండీసీ పాత్ర, ఇసుక రవాణాకు సంబంధించిన మార్గదర్శకాలను ఇందులో పేర్కొన్నారు.

ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి, తెలంగాణ గనుల శాఖ టెండర్లు నిర్వహించి రీచ్‌లను కేటాయించనుంది. నదుల మధ్యలో పట్టా భూములుంటే అందు లో ఇసుక తీసే బాధ్యతలను తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎండీసీ) నిర్వహిస్తుంది. పట్టాభూములలో ఇసుక మేటల ను తొలగించేందుకు గతంలో వ్యవసాయశాఖకు దరఖాస్తు చేసుకునే రైతులు ఇకపై నేరుగా గనులు, భూగర్భ శాఖ కార్యాలయాన్ని సంప్రదిం చాల్సి ఉంటుంది.

ఇసుక మేటలను తొలగించేందుకు గతం  లో జాయింట్ కలెక్టర్ అనుమతి ఇచ్చేవారు. కొత్త విధానం  లో కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాస్థాయి స్యాండ్ కమిటీ (డీఎల్‌ఎస్‌సీ)లను ఏర్పాటు  చేస్తున్నారు. ఈ కమిటీకి జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, డీపీఓ, డీడీ (గ్రౌండ్‌వాటర్), ఈఈ (ఆర్‌డబ్ల్యూఎస్), ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు), టీఎస్‌ఎండీసీ నామినేటెడ్ సభ్యుడు, అసిస్టెంట్ డైరక్టర్ (గనులు, భూగర్భశాఖ) సభ్యులుగా ఉంటారు. గిరిజన ప్రాంతాలైతే ఐటీడీఏ పీఓ కూడా ఉంటారు. అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు కూడ పోలీసు, రెవెన్యూ, రవాణా, గనుల శాఖలకు సర్వాధికారాలు ఇచ్చారు.
 
కలకలం రేపుతున్న ఉత్తర్వులు
పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు పేరిట అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్న ‘మాఫియా’ దూకుడుకు ప్రభుత్వం కళ్లెం వేయనుంది. అక్కడ ఇసుక మేటల తొలగింపునకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ జారీ అయిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. వాల్టా నిబంధనలకు తోడు కొత్త మార్గదర్శకాలు అక్రమ ఇసుక వ్యాపారానికి చెక్ పెట్టనున్నాయి. ప్రధానంగా పట్టాభూములలో ఇసుకమేటల తొలగింపు పేరిట అనుమతులు పొందిన బడా వ్యాపారులకు ఈ కొత్త విధానం మింగుడు పడని అంశం.

గతంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా, తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ అధికారం ఇక కమిటీకి ఉంటుంది. రైతులు ఇక ముందు  గ నుల శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కమిటీ పరిశీలించిన మీదటే తవ్వకాలకు అనుమతి లభిస్తుంది. అను మతి లభిస్తే, ఆ మొత్తం ఇసుకకు సంబంధించిన రాయల్టీ, అంతే నగదును సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి.

ఆ తర్వాత నిబంధనలను ఉల్లంఘిస్తే డిపాజిట్ జప్తు చేయడంతోపాటు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం, ప్రజల అవసరాల కోసం మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లను గుర్తించి, అక్కడ నుంచి తీసిన ఇసుకతో డిపోలు ఏర్పాటు చేసి నిర్ణయించిన చౌకధరలకు ఇసుకను సరఫరా చేస్తారు. జిల్లాలో తీసిన ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించడాన్ని కూడా నిషేధించిన ప్రభుత్వం దానిని నేరంగా పరిగణించనుంది.
 
అక్రమ రవాణాకు దరఖాస్తుల పరంపర
మంజీరా నది పరీవాహక ప్రాంతం నుంచి ఇసుక తోడేందుకు ‘మాఫియా’ పట్టా భూములున్న రైతులను ఎంచుకుంది. అక్రమ ధనార్జనే లక్ష్యంగా తెరవెనుక భాగోతం నడుపుతున్న వ్యాపారులు రైతుల పేరిట దరఖాస్తులు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలను కఠినతరం చేయడం ‘మాఫియా’కు ఇబ్బందికరంగా మారినా, అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు పేరిట బిచ్కుంద, మద్నూరు, కో  టగిరి, బీర్కూరు మండలాలకు చెందిన ఆరుగురు రైతులు వ్యవసాయశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 15 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, వాటి సంఖ్య మొత్తం 21కి చేరింది. పట్టా భూముల పేరిట అనుమతులు పొంది, మంజీరా నది నుంచి ఇసుక తవ్వకాలు జరపడం ఇసుక ‘మాఫియా’కు పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి.

టీఎస్‌ఎండీసీ పర్యవేక్షణలో బిడ్డింగ్‌ల ద్వారా జరిపే ఇసుక తవ్వకాలు, రవాణాను జీపీఎస్ పద్ధతిలో పర్యవేక్షించాలని ప్రభుత్వం పేర్కొంది. పట్టాభూములు, టెండర్ల ద్వారా కేటాయించిన రీచ్‌ల నుంచి ఇసుక తరలింపులో నిబంధనలను ఉల్లంఘించకుండా డివిజన్ స్థాయిలో సబ్‌కలెక్టర్/ఆర్‌డీఓల ఆధ్వర్యంలో కమిటీలకు మరిన్ని అధికారాలను అప్పగించారు.

మరిన్ని వార్తలు