నదికి అడ్డంగా రోడ్డేశారు!

5 May, 2017 00:36 IST|Sakshi
నదికి అడ్డంగా రోడ్డేశారు!

ఇసుక తరలింపునకు దొడ్డిదారి
నిబంధనలకు     నీళ్లొదిలిన కాంట్రాక్టర్లు
రెండు నెలల్లో రెండు అడ్డదారుల నిర్మాణం
నిత్యం వందల లారీలు
నది ప్రవాహానికి అడ్డంకులు


సాక్షి , భూపాలపల్లి : ఇసుక కాంట్రాక్టర్లు నది మధ్యలో రోడ్లు వేశారు. నెల వ్యవధిలో రెండు రోడ్లు వేసి దర్జాగా ఇసుకను తరలిస్తున్నారు. దేశంలోనే రెండో పెద్ద నది అయిన గోదావరిపై అడ్డంగా మట్టితో రోడ్డు వేసి.. రోజు వందలాది లారీలు ఆ రోడ్డుపై వెళ్తున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం మేడిగడ్డ, అన్నారం వద్ద గోదావరిపై రెండు బ్యారేజీలు నిర్మిస్తున్నారు. బ్యారేజీ బ్యాక్‌వాటర్‌ పరిధిలో ఇసుకను తీయాలని నిర్ణయించారు.

 తొలిదశలో మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 36 కిలోమీటర్ల పరిధిలో 3.04 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడాలని టీఎస్‌ఎండీసీ నిర్ణయించింది. దీని కోసం 23 ఇసుక రీచ్‌లను గుర్తించగా.. ప్రస్తుతం 11 రీచ్‌ల ద్వారా ఇసుక తోడుతున్నారు. ఇక్కడి రీచ్‌ల దగ్గరి స్టాక్‌పాయింట్ల నుంచి కాళేశ్వరం –మహదేవపూర్‌–కాటారం–భూపాలపల్లి –వరంగల్‌ మీదుగా హైదరాబాద్‌కు ఇసుకను తరలించాలని నిర్ణయించారు. గోదావరి నదిలో మహదేవపూర్, ఏటూరునాగారం, వాజేడుల వద్ద ఉన్న ఇసుక రీచ్‌లు స్టాక్‌పాయింట్ల నుంచి ఓవర్‌లోడ్‌తో ఇసుక వెళ్తుండటంతో ఇటీవల వరంగల్‌ సమీపంలో ఆర్టీఏ అధికారులు వరుసగా దాడులు ప్రారంభించారు.

లారీలను సీజ్‌ చేసి జరిమానా విధించి, డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేశారు. దీంతో ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా నిబంధనలకు విరుద్ధంగా గోదావరి అవతలి ఒడ్డున ఉన్న మంచిర్యాల జిల్లా చెన్నూరు– మంచిర్యాల మీదుగా హైదరాబాద్, నాగ్‌పూర్‌లకు లారీలు వెళ్లే విధంగా ఇసుక కాంట్రాక్టర్లు ప్రణాళిక రచించారు.

ఇప్పటికే రెండు మట్టి రోడ్లు
పలుగులు –1, పలుగులు –2 రీచ్‌ల వద్ద ఇసుక తరలించేందుకు భూపాలపల్లి –మంచిర్యాల జిల్లాల మధ్య నదికి అడ్డంగా మట్టికట్టలు పోసి రోడ్లు నిర్మించారు. ఈ రోడ్ల మీదుగా నిత్యం వందల సంఖ్యలో లారీలు వెళ్తున్నాయి. మరోవైపు నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో దిగువకు ప్రవహించే నీరు తగ్గిపోతుంది. గోదావరి, కృష్ణా లాంటి పెద్ద నదులకు సంబంధించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా కేంద్ర జలవనరుల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా ఖర్చు తగ్గించుకుని లాభాలు పెంచుకునేందుకు ఇసుక కాంట్రాక్టర్లు నదికి అడ్డంగా మట్టికుప్పలు పోసి రోడ్డు నిర్మించారు.

మార్చిలో పలుగులు –2 వద్ద నదికి అడ్డంగా రోడ్డు నిర్మించారు. దీనిపై విచారించి రోడ్డు నిర్మించినట్లు తేలితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామంటూ మార్చిలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు మీడియా సాక్షిగా హెచ్చరించారు. అయితే, నెలరోజులు గడిచినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా పలుగులు –1 రీచ్‌ వద్ద మరో రోడ్డును ఏప్రిల్‌లో నిర్మించారు. దీంతో భూపాలపల్లి– వరంగల్‌ మీదుగా కాకుండా చెన్నూరు– మంచిర్యాల మీదుగా ఇసుక లారీలు
పంపిస్తున్నారు.

టీఎస్‌ఎండీసీ వత్తాసు
నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నదికి అడ్డంగా నిర్మించిన మట్టి రోడ్లపై నలువైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంచిర్యాల జిల్లాలో స్టాక్‌పాయింట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్‌ఎండీసీ ప్రకటించడం విస్మయం కలిగించింది. దీనికి బదులు మంచిర్యాల జిల్లా వైపు నుంచి ఇసుక రీచ్‌లకు అనుమతి ఇస్తే సరిపోయేది. కానీ, నది సహజ నీటి ప్రవాహాన్ని నామరూపాలు లేకుండా చేస్తూ నదిలో ఇసుక కాంట్రాక్టర్లు చేస్తున్న పనులకు టీఎస్‌ఎండీసీ వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది.

దాని అర్థం అదే..
నది ప్రవాçహానికి అడ్డుగా మట్టిరోడ్డు నిర్మించే హక్కు ఇసుక కాంట్రాక్టర్లకు ఉందా? అని టీఎస్‌ఎండీసీ ప్రాజెక్టు మేనేజర్‌ కేఎల్‌ఎన్‌రావును సంప్రదించగా సూటిగా సమాధానం చెప్పలేదు. నదికి అడ్డంగా మట్టిరోడ్డు నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా అని అడిగితే.. మంచిర్యాల జిల్లాలో స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేస్తున్నామని, అటువైపు ఇసుక లారీలు వెళ్లేలా నదికి అడ్డంగా మట్టి రోడ్డు నిర్మించుకోవచ్చని అర్థం అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు.

మరిన్ని వార్తలు