దందా దర్జాగా..

23 Sep, 2018 10:34 IST|Sakshi
తిరుమలాయపాలెం మండలం కాకరవాయి ఏటిలో అక్రమంగా ఇసుక తోడుతున్న దృశ్యం

ఖమ్మంరూరల్‌: అక్రమార్కులు వాగులు, వంకలు వదలకుండా యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ట్రక్కులకొద్దీ తరలిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసినా.. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ట్రాక్టర్లలో ఇసుకను రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఇంత దందా నడుస్తున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు ఇసుక అక్రమ రవాణాదారుల పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఖమ్మం నగరం, రూరల్, అర్బన్‌ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకోవడంతోపాటు భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో ప్రతి పనికి ఇసుక అవసరం ఉండడంతో అక్రమ వ్యాపారులు దీనిని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలి ఇష్టానుసారంగా ధరలు పెంచి ఇసుకను విక్రయిస్తున్నారు. జిల్లాలోని వాగులు, వంకల్లో నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలించి లక్షలు గడిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుకను రూ.6వేల నుంచి రూ.7వేల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని తిరుమలాయపాలెం, ముదిగొండ, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సోలీపురం, కాకరవాయి, పిండిప్రోలు, హైదర్‌సాయిపేట ప్రాంతాల్లోని ఆకేరు, పాలేరు కాల్వల నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా 
నిత్యం తరలిస్తూనే ఉన్నారు.

కూసుమంచి మండలంలోని పాలేరు ఏరు, జక్కేపల్లి ఏరు, రాజుపేట, ఈశ్వరమాదారం పరిధిలోని పాలేరు ఏటి నుంచి, సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ, తుమ్మగూడెం ఏటి నుంచి కూసుమంచి మండలం నాయకన్‌గూడెం ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం తనగంపాడు, కస్నాతండా, కాచిరాజుగూడెం, మహబూబాబాద్‌ జిల్లా ముల్కలపల్లి, చిలుక్కోయలపాడు నుంచి ఇసుకను ట్రక్కుల్లో రవాణా చేస్తున్నారు. రూరల్‌ మండలం వెంకటగిరి పరిసర ప్రాంతాల నుంచి అర్ధరాత్రి, పట్టపగలు నిత్యం ట్రాక్టర్లలో ఇసుకను ఖమ్మం నగరానికి తరలిస్తున్నారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి, రామచంద్రాపురం, సుర్ధేపల్లి గ్రామాల పరిధిలోని పాలేరు ఏటి నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ముదిగొండ మండలం గంధసిరి నుంచి ప్రతి రోజూ రాత్రి వేళల్లో వందల ట్రక్కుల ఇసుక ఎలాంటి అనుమతులు లేకుండా తరలుతూనే ఉంది.
 
‘వాల్టా’ ఉల్టా.. 
ఇదిలా ఉండగా.. ఎక్కడైనా ఇసుక తవ్వాలంటే ముందుగా అధికారుల నుంచి అనుమతి పొందాలనేది ప్రభుత్వ నిబంధన. ఇందుకోసం వాల్టా చట్టాన్ని ఏర్పాటు చేసింది. దీనికి జిల్లాస్థాయిలో కలెక్టర్‌ చైర్మన్, మండలస్థాయిలో తహసీల్దార్‌ చైర్మన్‌గా వ్యవహæరిస్తారు. అలాగే భూగర్భ జలవనరుల ఏడీ కూడా ఇందులో సభ్యుడిగా ఉంటారు. వీరి అనుమతితోనే ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఇసుక తవ్వే ప్రాంతంలో భూగర్భ జలవనరులకు ఎటువంటి ఇబ్బంది ఉండదనుకుంటేనే సంబంధిత అధికారులు తవ్వకాలకు అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం ఎక్కడైనా ఇసుకను లోతుగా తవ్వకూడదు. అలా చేస్తే భూగర్భ జలాలు ఇంకిపోవడమే కాకుండా భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడుతుంది. దీంతో నిబంధనల ప్రకారం అనుమతి తీసుకొని ఇసుకను తవ్వాల్సి ఉంటుంది.

నిబంధనలు గాలికి.. 
నిబంధనలను తుంగలో తొక్కిన అక్రమార్కులు కాల్వలు, ఏటిలో నుంచి ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ వ్యవహారమంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూతూ మంత్రంగా ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం.. తర్వాత పైరవీలు చేయగానే వాటిని వదిలేస్తుండటంతో అక్రమార్కులు తమకేమీ కాదులే అనే ధీమాతో తమ పని తాము చేసుకుపోతున్నారు.  ఎక్కడైనా పేదలు ఇళ్ల నిర్మాణానికి ట్రక్కు ఇసుక కావాలంటే రూ.8వేల పైచిలుకు పలుకుతోంది. వాస్తవంగా పేదలు తమ అవసరాలకు ఇసుక కొనాలంటే ట్రక్కు ఇసుక ధర వేలల్లో పలకడంతో పేదలు తీవ్రంగా నష్టపోతుండగా.. çఅక్రమార్కులు మాత్రం లక్షలు దండుకుంటున్నారు.

పట్టించుకోని అధికారులు 
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్‌ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చూసీచూడనట్లు ఉండటం వల్లే రెచ్చిపోయి మరీ పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. వారం రోజుల క్రితం తిరుమలాయపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏకంగా ఏడు ట్రాక్టర్ల ఇసుకను అక్రమ రవాణాదారులు తరలిస్తుండగా.. అక్కడి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్‌ యజమానులకు జరిమానా విధించగా.. ఎంతో కొంత జరిమానా కట్టి తమ పని కానీయొచ్చనే ధీమాతో అక్రమార్కులు ఉన్నారు. ఏదేమైనా అధికారుల మెతక వైఖరితోనే ఇసుక రవాణా నిరంతరం కొనసాగుతోంది.  
 
మా పరిధిలో లేదు.. 
జిల్లాలో తరలుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సింది స్థానిక తహసీల్దార్లే. మేము కేవలం ప్రభుత్వపరంగా పెద్ద పెద్ద నదుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే పట్టుకుని చర్యలు తీసుకుంటాం. అయినా మా దృష్టికి వస్తే ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నర్సింహారెడ్డి, మైనింగ్‌ ఏడీఏ  
 
ఎవరినీ వదిలిపెట్టం.. 

అక్రమంగా ఇసుక తరలించే వారిపై ఇప్పటికే అనేకమార్లు చర్యలు తీసుకున్నాం. ఈ విషయంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇసుక అక్రమ రవాణాపై తమ సిబ్బందిచే నిఘా మరింతగా పెంచుతాం. ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తున్నట్లు కనిపిస్తే పట్టుకుని సీజ్‌ చేస్తాం.  – నర్సింహారావు, ఖమ్మం రూరల్‌ తహసీల్దార్‌ 

ఖమ్మం రూరల్‌ మండలంలో అక్రమంగా తరలుతున్న ఇసుక  

మరిన్ని వార్తలు