కృత్రిమ ఇసుకతోనే ప్రభుత్వ నిర్మాణాలు కూడా!

30 May, 2019 09:04 IST|Sakshi

ఇసుకాసురుల రూ.లక్షల్లో అక్రమార్జన

ప్రభుత్వ నిర్మాణాలకు సైతం వినియోగం

నాయకుల కనుసన్నల్లో నిర్వహణ.. పట్టించుకోని అధికారులు

నాగర్‌కర్నూల్‌ క్రైం : నదులు, వాగులు, వంకల్లో ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకను అక్రమంగా రవాణ చేసి రూ.కోట్లలో అక్రమ సంపాదనను వెనకేసుకుంటున్న ఇసుకాసురులు.. జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్‌ ఇసుక దందాకు తెరలేపారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకతో నిర్మాణాలు చేపడితే చాలాకాలం పాటు మన్నిక ఉంటాయి. కానీ, జిల్లాలో కొందరు ఇసుక వ్యాపారులు చెరువులు, పంట పొలాల్లో లభించే మట్టి తీసుకువచ్చి ఆ మట్టితో ఫిల్టర్‌ ఇసుకను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఫిల్టర్‌ ఇసుకను ప్రభుత్వ నిర్మాణాలకు, సీసీరోడ్లతోపాటు భవన నిర్మాణాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఫిల్టర్‌ ఇసుకను వాడటం వల్ల చాలాకాలంపాటు పటిష్టంగా ఉండాల్సిన నిర్మాణాలు, సీసీరోడ్లు, భవనాలు కొద్దిరోజుల్లో దెబ్బతినే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాల వైపు
జిల్లా పరిధిలో దుందుబీ వాగుతోపాటు కృష్ణానది వందల కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుండటంతో నాణ్యమైన ఇసుకకు ఏమాత్రం కొదవలేదు. నదులు, వాగులు, వంకల్లో లభించే ఇసుకను ప్రభుత్వ అనుమతుల పేరిట అక్రమంగా తరలించి రూ.కోట్లు దండుకుంటున్న ఇసుకాసురులపై పోలీసు అధికారులు నిఘా పెట్టడం వల్ల ఇసుక అక్రమంగా తరలింపుపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో జిల్లా పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై కూడా నిఘా పెట్టడంతో ఇసుకాసురులు  ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుని నాణ్యతలేని ఫిల్టర్‌ ఇసుకను తయారుచేసి దర్జాగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

అధికారులకు ఫిర్యాదు చేసినా
జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్‌ ఇసుక తయారీ ఎంతోకాలంగా జోరుగా నడుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజలు ఫిల్టర్‌ ఇసుక తయారీదారులపై అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం ఫిల్టర్‌ ఇసుక తయారీ చేసే ప్రాంతాల దరిదాపుల వైపు వెళ్లి చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఫిల్టర్‌ ఇసుక తయారీ కొందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తుండటంతో అధికారులు అటువైపు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.  

చెరువు మట్టి ద్వారా..
జిల్లాలోని పలు చెరువుల్లో, సారవంతమైన నేలల నుంచి మట్టిని తీసుకువెళ్లి కృత్రిమ పద్ధతి ద్వారా ఇసుకను తయారు చేస్తున్నారు. ఈ కృత్రిమ ఇసుకతో నిర్మించిన కట్టడాలు చాలాకాలం మన్నికగా ఉండవని తెలిసినా ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు కృత్రిమ ఇసుక తయారీకి తెరలేపారు. చెరువుల నుంచి, సారవంతమైన నేలల నుంచి మట్టిని తీసుకెళ్లడం ద్వారా అటు చెరువుల్లో నీరు ఇంకిపోవడమే గాక సారవంతమైన నేలలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ ఇసుక తయారీతో సహజ వనరులు నాశనమవ్వడమే గాక పర్యావరణానికి పెనుప్రమాదమని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు.

అధిక శాతం వాటికే వినియోగం
వాగులు, నదుల్లో లభించే ఇసుక కన్నా కృత్రిమంగా తయారు చేసే ఫిల్టర్‌ ఇసుక ధర తక్కువగా ఉండటంతో కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఫిల్టర్‌ ఇసుకను సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలకే ఉపయోగిస్తున్నా ఇ సుక నాణ్యతపట్ల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో కృత్రి మ ఇసుకను తయారు చేసే వారి పట్ల చర్యలు తీసుకొని కృత్రిమ ఇసుకను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కఠిన చర్యలు తప్పవు
ప్రకృతి సిద్ధంగా వాగులు, నదుల్లో ఇసుకను కాకుండా కృత్రిమంగా ఇసుకను తయారు చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఫిల్టర్‌ ఇసుక తయారీని అరికట్టాల్సిన బాధ్యత ఎక్కువగా రెవెన్యూ అధికారులపైనే ఉంటుంది. జిల్లాలో తయారవుతున్న  కృత్రిమ ఇసుకను అరికట్టడం కోసం రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ఫిల్టర్‌ ఇసుకను అరికడతాం.
-శ్రీనివాస్, మైనింగ్‌ ఏడీ, నాగర్‌కర్నూలు

మరిన్ని వార్తలు