అక్కడంతా అడ్డగోలే..!

25 Sep, 2019 08:14 IST|Sakshi

ఒక వైపు ఆక్రమణలు.. ఇంకోవైపు ఇసుక దోపిడీ

మరోవైపు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం 

ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో అక్రమాల దందా

సాక్షి, శ్రీకాకుళం: ఇచ్ఛాపురం మండలం బిర్లంగి... ఇదొక చిన్న పంచాయతీ... ఇక్కడ భూముల ఆక్రమణలే కా దు పంచాయతీ నిధుల దుర్వినియోగం కూడా వెలుగు చూ సింది. 2,425 జనాభా గల పంచాయతీలో రూ. 14,62,840 అవినీతి చోటు చేసుకుంది. గత ఐదేళ్ల కాలంలో అధికారం వెలగబెట్టిన టీడీపీ నేత ఘనకార్యమిది. అధికారంలో ఉన్నంతవరకు అధికారులు పట్టించుకోలేదు. అధికారం నుంచి దిగిపోయాక షోకాజ్‌ నోటీసులతో హడావుడి చేస్తున్నారు. చేతు లు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ అని సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. తానేమీ తక్కువ కాదని అక్రమాలకు పాల్పడిన వ్యక్తి తనకు సంబంధం లేదం టూ కోర్టును ఆశ్రయించారు. దానిపై ఇప్పుడు కౌంటర్‌ వేసే పనిలో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు.  

ఈ మధ్య ఇచ్ఛాపురం నియోజకవర్గం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. ఆ నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి అండదండలో, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందనే ధీమాయో తెలీదు గానీ అక్రమాలకు కేరాఫ్‌గా మారిపోయింది. పది రోజుల క్రితం కవిటి మండలంలో మత్స్యకార గ్రామమైన ఇద్దివానిపాలెంలో 75 రేషన్‌ కార్డులకు కొన్నేళ్లుగా సరుకులు పంపిణీ కాలేదనే వ్యవహారం వెలుగు చూసింది. రేషన్‌ డిపో డీలర్‌ ఆ కార్డులను తమ వద్ద ఉంచుకుని రేషన్‌ సరుకులను పక్కదారి పట్టించి పెద్ద ఎత్తున లబ్ధి పొందారని గ్రామస్తులంతా నిలదీశారు. ఇక ఒంటరి మహిళల ముసుగులో పెద్ద ఎత్తున పింఛన్ల అక్రమాలకు పాల్పడిన వ్యవహారం బట్టబయలైంది.

ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అనర్హులగా తేలిన పింఛన్లను అధికారులు తాజాగా రద్దు చేశారు. భర్తలున్నప్పటికీ ఒంటరి మహిళ పేరుతో పింఛన్లు తీసుకుంటున్నట్టుగా తేలింది. ఇక ఇసుక అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉక్కుపాదం మోపుతున్నా ఇక్కడ మాత్రం ఇసుక దందా ఆగడం లేదు. నిత్యం ఇసుక అక్రమంగా తరలిస్తూ లారీలు, ట్రాక్టర్లు పట్టుబడుతున్నాయి. దీనికంతటికీ గత ఐదేళ్లు చక్రం తిప్పిన కీలక నేత అండదండలే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో సుమారు 4.80 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ కుమారుడు ఆక్రమించినట్టుగా వెలుగు చూసింది. ఇప్పటికే దానిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి. అధికారులు సైతం సూచన ప్రాయం గా అది పోరంబోకు భూమేనని, ఆక్రమణకు పాల్పడ్డారని నిర్ధారించారు. ఈ ఆక్రమణ భూమికి ఆనుకుని ఉన్న బాహుదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపటి దొడ్డిదారిన పెద్ద ఎత్తున ఆర్జిస్తున్న వ్యవహారం బయటపడింది.

పంచాయతీ నిధుల దుర్వినియోగం టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం బిర్లంగి గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలపై ఎవరూ దృష్టి సారించలేదు. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును సైతం సీరియస్‌గా తీసుకోలేదు. చివరికి ఆ ఫిర్యాది కోర్టుకెళ్లడంతో విచారణ చేపట్టారు. దీంట్లో కూడా చాలా వరకు జాప్యం జరిగింది. చివరికి తప్పని పరిస్థితుల్లో విచారణ జరిపి వాస్తవాల నిగ్గు తేల్చారు. గ్రామంలో ప్ర భుత్వ భూముల ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న దుపాన సూర్యనారాయణ తండ్రి నీలాద్రి గ్రామ సర్పంచ్‌గా ఉన్న కాలంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగినట్టు అధికారుల విచారణలో తేలింది. సాధారణ నిధుల నుంచి రూ. లక్షా 56వేలు, ఎస్‌ఎఫ్‌సీ నిధుల నుంచి రూ. 42వేలు, 13వ ఆర్థిక సం ఘం నిధుల నుంచి రూ. 8,34,021, 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 4,30,819 అక్రమంగా ఖర్చు పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు.

మొత్తం రూ. 14,62,840 నిధుల దుర్వినియోగానికి సంబంధించి అప్పటి సర్పంచ్‌గా ఉన్న నీలాద్రికి షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేశారు. దానిపై సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో రెవెన్యూ రికవరీ యాక్ట్‌( ఆర్‌ఆర్‌ యాక్ట్‌) కింద రికవరీ చేయాల్సిందిగా జూలై 7వ తేదీన పంచాయతీ అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రికవరీ అధికారిగా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిని నియమించారు. అయితే, దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సర్పంచ్‌ నీలాద్రి కోర్టును ఆశ్రయించారు. దానిపై కౌంటర్‌ వేసే పనిలో అధికారులు ఉన్నారు.  


ఆర్‌ఆర్‌యాక్ట కింద చర్యలకు ఆదేశం 
బిర్లంగి పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద రికవరీ చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. కానీ రికార్డులు మాత్రం ఇంకా నాకు ఇవ్వలేదు. ఏ రికార్డులూ లేకుండా రికవరీ చేయడం కుదరదు. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద వసూలు చేయాలంటే టీమ్‌ను ఏర్పాటు చేయాలి. ఒక్కడినే వెళ్లి వసూలు చేయడం సాధ్యం కాదు. అయినా అభియోగాలు ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆస్తులు తెలపాలని సబ్‌ రిజిస్టార్, తహసీల్దార్‌కు లేఖలు రాశాను. తహసీల్దార్‌ నుంచి వివరాలు రావాల్సి ఉంది. నిందితుడు కోర్టుకు వెళ్లినందున వ్యవహారం ముందుకు వెళ్లలేదు.
– బి.వెంకటరమణ, ఎంపీడీఓ, ఇచ్ఛాపురం


 


 

మరిన్ని వార్తలు