ఇసుకే బంగారమాయె..

7 Nov, 2019 01:55 IST|Sakshi

అమాంతంగా పెరిగిన ధరలు.. వరుస వర్షాలతో ఇసుక రవాణాకు బ్రేక్‌

మెట్రిక్‌ టన్ను ధరరూ.3 వేలకు పైమాటే..

సాధారణ రోజుల్లో రూ.1,250 మాత్రమే

పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న దళారులు 

సాక్షి, హైదరాబాద్‌: నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక ధరలు అమాంతంగా పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగి భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరుస వర్షాలతో ఇసుక రవాణాలో అంతరాయం ఏర్పడుతుండగా, ఇదే అదనుగా దళారులు ఇసుక కొరతను సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతీరోజు సగటున 60 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక వినియోగం జరుగుతుండగా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆన్‌లైన్‌ విధానంలో విక్రయిస్తోంది. ఆన్‌లైన్‌లో టన్ను ఇసుక ధర రూ.600 కాగా, రవాణా, ఇతర చార్జీలు కలుపుకుని లారీ యజమానులు, దళారులు సాధారణ రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,400 వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 50 ఇసుక రీచ్‌లను టీఎస్‌ఐఐసీ నిర్వహిస్తుండగా, వర్షాలతో వరద పోటెత్తుతుండటంతో నదీ గర్భం నుంచి ఇసుక వెలికితీతకు అంతరాయం కలుగుతోంది. దీంతో టీఎస్‌ఎండీసీ ఆన్‌లైన్‌లో పరిమితంగా అనుమతులు జారీ చేస్తుండటంతో.. బహిరంగ మార్కెట్లో దళారులు టన్ను ఇసుకను రూ.3 వేలకు పైగా విక్రయిస్తున్నారు. నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు.

15 రీచ్‌లలో మాత్రమే వెలికితీత
రిజర్వాయర్ల పూడికతీత, గోదావరిలోని ఇసుక తిన్నె లు, పట్టా భూముల నుంచి టీఎస్‌ఎండీసీ ఇసుకను వెలికితీసేందుకు 13 జిల్లాల పరిధిలోని 50కి పైగా ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. ఇసుక వెలికితీత ప్రధానంగా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా రిజర్వాయర్ల పరిధిలోని 27 ఇసుక రీచ్‌ల వద్ద జరుగుతుండగా, గోదావరి వరదల మూలంగా ఇసుక వెలికితీతకు అంతరాయం కలుగుతోంది. అందుబాటులోని ఇసుకను ప్రభుత్వ పథకాలకు టీఎస్‌ఎండీసీ కేటాయిస్తోంది. ప్రస్తుతం సుమారు 15 రీచ్‌లలో పాక్షికంగా ఇసుక వెలికితీత జరుగుతున్నట్లు టీఎస్‌ఎండీసీ వర్గాలు చెప్తున్నాయి.  

స్టాక్‌ పాయింట్లలో 41 లక్షల క్యూబిక్‌ మీటర్లు
వర్షాకాలంలో ఎదురయ్యే ఇసుక కొరతను దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఎండీసీ ముందు జాగ్రత్తగా 2 కోట్ల క్యూబిక్‌ మీటర్లు (సుమారు 3 కోట్ల మెట్రిక్‌ టన్నులు) నిలువ చేసేలా ప్రణాళిక సిద్దం చేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే నడుమ 65 లక్షల క్యూబిక్‌ మీటర్లను స్టాక్‌ పాయింట్లకు తరలించగా, ప్రస్తుతం 41 లక్షల క్యూబిక్‌ మీటర్లు (సుమారు 62 లక్షల మెట్రిక్‌ టన్నులు) అందుబాటులో ఉంది. వీటిని అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాలకు, ఇతరులకు ఆన్‌లైన్‌లో కేటాయిస్తున్నారు. అయితే రోజువారీ డిమాండుకు అనుగుణంగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌తో పాటు, మరో రెండు సబ్‌ స్టాక్‌పాయింట్లలో జంట నగరాల అవసరాల కోసం ఇసుక విక్రయిస్తున్నా, ఏ మూలకూ సరిపోవడం లేదు. 

ఇసుక లేక.. ఇంటి పనులు నిలిపేశా..!
ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు రూ.20 లక్షలు ఖర్చు చేశా. స్లాబ్‌ దశ వరకు పనులు జరిగాయి. ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు కనీసం 50 టన్నుల ఇసుక అవసరమవుతుందని అనుకుంటున్నా. అయితే మార్కెట్లో ప్రస్తుతం సన్న ఇసుక టన్ను ధర రూ.3,200, దొడ్డు ఇసుక రూ.2,500 వరకు ఉంది. నిర్మాణం ఆగిపోవద్దనే ఉద్దేశంతో ఎక్కువ ధర పెడతామనుకున్నా.. ఎక్కడా దొరకడం లేదు. దీంతో నిర్మాణ పనులను ప్రస్తుతానికి నిలిపేశా. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి. ––వరికుప్పల శంకర్, తమ్మలోనిగూడ, రంగారెడ్డి జిల్లా

ప్లాస్టరింగ్‌ ఇసుక ధరలు పెరిగాయి
గతంలో స్లాబ్‌ ఇసుక టన్ను రూ.1,100 వరకుండేది. ఇప్పుడు రెండింతలై రూ.2,200 వరకు పలుకుతోంది. ప్లాస్టరింగ్‌ ఇసుక ధర దాదాపు మూడింతలు పెరిగింది. ఇసుక ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందనే భయంతో పనులు నిలిపేస్తున్నాం. తప్పనిసరిగా కొనుగోలు చేయాలని అనుకున్నా దళారీలు ధరలు పెంచేశారు. ఇసుకపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే మాకు కూడా గిట్టుబాటయ్యే అవకాశం లేదు. ––మేతరి స్వామి, బిల్డర్, తుర్కయాంజాల్‌

వర్షాకాలం వల్లే..
వర్షాకాలంలో రీచ్‌ల నుంచి ఇసుక తీయడం సాధ్యం కాదు. రహదారులకు వెళ్లే దారులు బురదతో ఉండటంతో వాహనాలకు అనుమతినివ్వడం లేదు. వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో 65 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను స్టాక్‌ పాయింట్లలో నిల్వచేశాం. దీంతో ఇసుక కొరతను దాదాపు 70 శాతం మేర ఎదుర్కొంటున్నాం. ఆన్‌లైన్‌లో టీఎస్‌ఎండీసీ నిర్దేశించిన ధర రూ.600కు టన్ను చొప్పున అత్యంత పారదర్శకంగా విక్రయిస్తున్నాం. వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో త్వరలో ఇసుక లభ్యత సాధారణ స్థితికి చేరుకుంటుంది. ––మల్సూర్, ఎండీ, టీఎస్‌ఎండీసీ

మరిన్ని వార్తలు