అక్రమ రవాణా.. ఆపై అతివేగం

8 Apr, 2018 12:05 IST|Sakshi
మల్కాపూర్‌ బైపాస్‌ సమీపంలోని మూలమలుపు వల్ల బోల్తాపడ్డ ఇసుక ట్రాక్టర్‌

ఇసుక ట్రాక్టర్ల ఇష్టారాజ్యం

అదే తరహాలో లారీలు, టిప్పర్లు..

భయాందోళనలో గ్రామీణులు

మల్కాపూర్‌లో ఇసుక ట్రాక్టర్‌ బోల్తా

కొత్తపల్లి(కరీంనగర్‌) : అసలే అక్రమంగా తరలిస్తున్న ఇసుక.. ఆపై అతివేగం.. అనుభవంలేని, లైసెన్స్‌ లేకుండా.. ఇష్టారాజ్యమైన డ్రైవింగ్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మితిమీరిన వేగం ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోంది. వేగంగా దూసుకొస్తున్న వాహనాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో..? అన్న అభద్రతాభావంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్‌ మల్కాపూర్‌లో ఓ ఇంట్లోకి దూసుకురాగా.. అదే శివారులోని బైపాస్‌ సమీపంలో గల మూలమలుపు వద్ద శనివారం అతివేగంతో అదుపుతప్పిన ఓ ఇసుక ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఎలాంటి నష్టమూ వాటిల్లనప్పటికీ..  రోడ్డంతా ఇసుక నిండుకోవడంతో పాటు ఇతర వాహనాల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ఆదరాబాదరగా ఆ ఇసుక ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తరలించడంతో కేసునుంచి బయటపడినట్లయ్యింది. మల్కాపూర్‌ బైపాస్‌పై గతేడాది ఆటోను ట్యాంకర్‌ ఢీకొట్టిన సంఘటనలో ఎనిమిది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

దీనికి సమీపంలోనే ఇసుక ట్రాక్టర్‌ బోల్తా పడటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్, ఆసిఫ్‌నగర్, ఎలగందుల, కమాన్‌పూర్, బద్ధిపల్లి, నాగులమల్యాల, గంగాధర మండలం ఒడ్యారం గ్రామాల్లోని ఖనిజ సంపదను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నిత్యం వేలాది చిన్న, పెద్ద వాహనాలు వెళ్తుంటాయి. ఆ వాహనాలన్నీ కమాన్‌పూర్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, రేకుర్తి గ్రామాల మీదుగా అతివేగంతో ప్రయాణిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలంటేనే వణుకుతున్నారు. మానేరు వాగు నుంచి ఇసుక, ఆసిఫ్‌నగర్, నాగులమల్యాల, ఒడ్యారం, కమాన్‌పూర్, బద్ధిపల్లి గ్రామాల నుంచి గ్రానైట్, మొరం రవాణా చేసే వాహనాలు, ఆటోలు తదితర ఇతర వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుండటంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ వాహనాల వేగానికి ప్రజలు దూరంగా పరుగెత్తాల్సి వస్తుందే తప్ప డ్రైవర్లు మాత్రం వేగాన్ని నియంత్రించడం లేదు.

అడ్డు అదుపులేకుండా వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా ఝులిపించాల్సి అవసరం ఉన్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అడపాదడపా తనిఖీలు చేస్తూ వదిలేస్తుండటంతో భయం లేకుండా పోతోంది. లైసెన్స్‌లు లేకుండా వాహనాలను నడుపుతున్నా చర్యలు లేకపోవడంతో దర్జాగా డ్రైవింగ్‌ చేస్తున్నారు. గ్రానైట్‌ లారీల్లోంచి బండలు పడిపోయినా, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు బోల్తా పడ్డ ఎలాంటి చర్యలు లేకపోవడంతో అతి వేగానికి కళ్లెం పడటం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక ట్రాక్టర్ల వేగానికి కళ్లెమేది ?
మండలంలోని ఖాజీపూర్‌ మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారుల కళ్లెదుటే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నిలువరించలేకపోతున్నారు. అధికారులెక్కడ చూస్తారోనన్న భయంతో అక్రమ రవాణాదారులు ట్రాక్టర్ల స్పీడును పెంచుతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అతివేగం ప్రమాదమని తెలిసినా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. లైసెన్స్‌లు లేని డ్రైవర్లు, లేబర్లే డ్రైవర్లుగా అవతారమెత్తుతూ ట్రాక్టర్లను తోలుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల 22న మల్కాపూర్‌ మాజీ సర్పంచ్‌ ఇంట్లోకి ఇసుక ట్రాక్టర్‌ దూసుకెళ్లిన విషయం మరువకముందే.. అదేగ్రామంలో బైపాస్‌ సమీపంలోని మూలమలుపు వద్ద ఇసుక ట్రాక్టర్‌ బోల్తా పడింది. దీంతో రోడ్డంతా ఇసుక నిండుకోవడమే కాకుండా ఇతరుల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వేగాన్ని అదుపు చేయాలి
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, గ్రానైట్, మొరం లారీల వేగాన్ని అదుపు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇసుక ట్రాక్టర్లు, లారీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ వాహనాల వేగానికి రోడ్డు దాటాలంటేనే భయం వేస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులకు మరీ కష్టంగా ఉంది. మితిమీరిన వేగం వల్ల ఇసుక ట్రాక్టర్లు బోల్తా పడుతున్నాయి. అతి వేగానికి కళ్లెం వేయాలి.
కాసారపు శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌ మల్కాపూర్‌

మరిన్ని వార్తలు