మోకాలి నొప్పా.. బ్రెయిన్ వాషా?

9 Jul, 2015 11:45 IST|Sakshi
మోకాలి నొప్పా.. బ్రెయిన్ వాషా?

మొదట నోటీసు జారీచేసిన తర్వాత.. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎక్కడెక్కడకు వెళ్లారు? అసలు రాజమండ్రిలో సండ్ర ఏం చేశారు? ఈ పది రోజుల పాటు సండ్రకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు? విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఇలా ఉంది..

ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అత్యంత కీలక పాత్రధారులని ఏసీబీ నిగ్గుతేల్చింది. సండ్ర రిమాండ్‌ రిపోర్టులో కొన్ని ఆధారాలను కూడా ఏసీబీ పొందుపరించింది. జూన్‌ 16 నుంచి జులై 1 వరకూ సండ్ర ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో అజ్ఞాతంలో ఉన్నారు. కనీసం 8 రోజులపాటు ఆయన రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నట్టు స్వయంగా ఆయనే తెలిపారు.

నిఘా వర్గాలు , దర్యాప్తు బృందాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సండ్రకు బాగానే బ్రెయిష్‌వాష్‌ చేసినట్టు తెలుస్తోంది. దర్యాప్తు సందర్భంగా అడిగే ప్రశ్నల నుంచి తప్పించుకోడానికి, ఈ పథకం వెనుక ఎవరున్నారో వెల్లడించకుండా బ్రెయిన్‌ వాష్‌ చేశారని సమాచారం. ఈ కేసులో అరెస్టు తప్పదని టీడీపీ అత్యున్నత వ్యక్తులు సహా, సండ్ర కూడా ముందుగానే ఊహించారు. దీనికి అనుగుణంగా ప్లాన్‌ను రెడీ చేశారు.

ఆస్పత్రిలో ప్రత్యేక గది
రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రిలో పై అంతస్తులో ఒక గదిని సండ్ర కోసం కేటాయించారు. ఒక రకంగా ఇది గెస్ట్‌హౌస్‌. జైలు లాంటి వాతావరణాన్ని ముందుగానే అక్కడ సృష్టించారు. రెండు రోజులపాటు ఎవ్వరూ ఆగదిలోకి ప్రవేశించలేదు. ఆహారం, ఇతర సామగ్రి కూడా కిటికీ ద్వారానే అందించారు. మానసికంగా జైలు వాతావరణంలో ఉండేందుకు ఈ తరహా ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ఒకవేళ అరెస్టు చేస్తే, మానసికంగా ఆందోళనకు గురై.. ఎక్కడ పెద్దల పేర్లు వెల్లడిస్తానెనన్న భయంతో.. సండ్రను ఈ పరిస్థితుల మధ్య  ఉంచారు.

నిపుణులతోనే శిక్షణ

విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వాటి నుంచి ఎలా తప్పించుకోవచ్చనే మార్గాలనూ సండ్రకు  ఇక్కడే బోధించారు. ఇలాంటి కేసుల సందర్భంలో నేరుగా దర్యాప్తులో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు సండ్రకు ఈ ట్రైనింగ్‌ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మానసికంగా సున్నితత్వం ఉన్న వ్యక్తులకు ఇలా బ్రెయిన్‌ వాష్‌ చేస్తారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ల పరిభాషలో దీన్ని ఎమోషనల్‌ ఎస్కేపిజం, లేదా ఎమోషనల్‌ ట్రాన్స్‌మైండింగ్‌ అంటారు.
 

అంతా చెప్పినట్లే చేశారు

అరెస్టు చేసిన తర్వాత రోజు విచారణలో సండ్ర... ఇలానే వ్యవహరించారని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మీరు సెబాస్టియన్‌తో మాట్లాడారా అంటే.. గుర్తులేదు, నేను మాట్లాడి ఉంటానా? అంటూ ఎదురు ప్రశ్నలు వేశారని సమాచారం. ఫలానా సమయంలో మాట్లాడారంటూ సండ్ర ముందు ఆధారాలు ఉంచితే, మాట్లాడి ఉండొచ్చు,  గుర్తులేదని సమాధానం చెప్పారట. ఏ ప్రశ్నలు వేసినా తెలియదు, గుర్తులేదు అని మాత్రమే చెబుతున్నారన్నది విశ్వసనీయవర్గాల సమాచారం. సెబాస్టియన్‌ ఫోన్‌లో ఈ సంభాషణలు రికార్డు కావడం ఓ రకంగా కేసును మరింత బలపరిచిందని ఏసీబీ బృందాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరిన్ని వార్తలు