కాంగ్రెస్‌ కంచుకోట సంగారెడ్డి

18 Nov, 2018 12:19 IST|Sakshi
మంజీరా బ్యారేజీ

సంగారెడ్డి నియోజకవర్గ ముఖ చిత్రం 

13 ఎన్నికలు.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు

మూడు మార్లు స్వతంత్రులకు మద్దతు పలికిన సంగారెడ్డి ఓటర్లు

ఐదు సార్లు గెలిచి, స్పీకర్‌గా రికార్డు సాధించిన రామచంద్రారెడ్డి 

సంగారెడ్డి రాజకీయాల్లో విశేషాలెన్నో..

రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న సంగారెడ్డి నియోజవకర్గంలో విద్యా, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మంజీర పరివాహక ప్రాంతం సంగారెడ్డి పరిసరాల్లో ఉన్న ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌తో పాటు అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. మాజీ స్పీకర్‌ పి.రామచంద్రారెడ్డి మినహా సుదీర్ఘ కాలం పాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మరో నేత ఎవరూ లేకపోవడం ఆసక్తికరం. నాలుగు పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించడం విశేషం. 13 ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది మంది నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం విశేషం.

సంగారెడ్డిజోన్‌: 1957లో జరిగిన రెండో శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం ద్వి శాసనసభ నియోజకవర్గంగా అవతరించింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సంగారెడ్డి నియోజకవర్గం పరిధి కుంచించుకు పో యింది. ప్రస్తుతం నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట మండలాలు ఉన్నాయి. 1962 ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటగా ఉన్న సంగారెడ్డి నియోజకవర్గంలో 1994 ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారాయి.

1999 ఎన్నికలు మొదలుకుని కాంగ్రెసేతర పక్షాలు సంగారెడ్డి నియోజకవర్గంలో విజయకేతనం ఎగుర వేస్తూ వస్తున్నాయి. 2009 లో మాత్రం సంగారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ విప్‌ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి ఒక పర్యాయం గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన చింత ప్రభాకర్, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున బరిలో నిలిచి గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి చింత ప్రభాకర్, కాంగ్రెస్‌ నుంచి జగ్గారెడ్డి ఎన్నికల బరిలో నిలవడంతో రాబోయే రోజులో ఉత్కంఠ పోరు సాగనుంది.

ఐదు సార్లు గెలిచిన రామచంద్రారెడ్డి..
సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1962లో తొలిసారిగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పి.రామచంద్రారెడ్డి ఎనిమిది పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసి, ఐదు పర్యాయాలు విజయం సాధించారు.  2004 నాటికి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి మెదక్‌ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నరసింహారెడ్డిపై ఓటమి పాలైన పి.రామచంద్రారెడ్డి, తిరిగి 1972 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించి మళ్లీ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థి నరసింహారెడ్డి చేతిలో రెండో సారి ఓటమి పొందారు.

1983లో తిరిగి బరిలోకి దిగిన రామచంద్రారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభంజనాన్ని తట్టుకుని స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. తిరిగి 1985లోనూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పట్ల ఉన్న సానుభూతి పవనాలను తట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ పక్షాన గెలుపొందారు. 1989లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందడంతో మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్‌ నమోదు చేయడంతో పాటు, మొత్తం ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన ఘనత సాధించారు. అయితే 1994లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిదో పర్యాయం అసెంబ్లీ బరిలోకి దిగిన రామచంద్రారెడ్డి ఓటమి చెందడంతో నియోజకవర్గ రాజకీయాల నుంచి నిష్క్రమించారు. 

1994 తర్వాత కాంగ్రెసేతర పక్షాలదే ఆదిపత్యం
1994 అనంతరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రభావం తగ్గుతూ వచ్చింది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రారెడ్డి ఓటమి చెందగా, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సదాశివరెడ్డి విజయం సాధించారు. రాష్ట్ర స్థాయిలో కుదిరిన ఎన్నికల అవగాహనలో భాగంగా సంగారెడ్డి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి తెలుగుదేశం పార్టీ కేటాయించింది. బీజేపీ తరపున పోటీ చేసిన కె.సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, అలియాస్‌ జగ్గారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు.

అయితే పార్టీ అధినేత కేసీఆర్‌తో విభేదించిన జయప్రకాశ్‌రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జయప్రకాశ్‌ రెడ్డి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన చింత ప్రభాకర్‌ విజయం సా«ధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి చింత ప్రభాకర్, కాంగ్రెస్‌ నుంచి జగ్గారెడ్డి మరోమారు బరిలో ఉండటంతో ఉత్కంఠ పోరు నెలకొంది.

అసెంబ్లీ స్పీకర్‌గా, మంత్రిగా..!
12వ శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించిన రామచంద్రారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న మార్పులతో నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి మంత్రివర్గంలో చేరారు. నేదురమల్లి మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్, జనతా, కాంగ్రెస్‌ ఐ, బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి గెలుపోటములు చవి చూసిన చరిత్ర రామచంద్రారెడ్డికే దక్కింది.

తొలి నాళ్లలో ద్విసభ్య నియోజకవర్గం..
సంగారెడ్డి జిల్లా కేంద్రంగా 1957లో తొలిసారిగా అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భవించగా, ద్విసభ్య నియోజకవర్గం కావడంతో జనరల్, రిజర్వుడు స్థానాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జనరల్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి కష్ణమాచారి గెలుపొందగా, రిజర్వు స్థానం నుంచి షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ (ఎస్‌సీఎఫ్‌) తరపున అనంతయ్య విజయం సాధించారు. 1967లో జరిగిన మూడో శాసనసభ ఎన్నికల నాటికి సంగారెడ్డి తిరిగి ఏకసభ్య నియోజకవర్గంగా ఏర్పాటైంది.

నియోజకవర్గంలో ఓటర్లు..
మహిళలు    పురుషులు    ఇతరులు    మొత్తం
1,97,092    1,97,248    36    3,94,376 

మరిన్ని వార్తలు