మ్యాథ్సే జీవితాన్ని మార్చింది..! 

30 Apr, 2019 12:58 IST|Sakshi

ఇంటర్‌ ఫస్టియర్‌ గణితంలో ఫెయిల్‌ 

కసితో చదివి కాలేజ్‌ టాపరయ్యాడు

డిగ్రీ, పీజీల్లోనూ అదే ఊపుతో ముందుకు 

గ్రూప్‌–1లో 150కి 143 మార్కులు సాధించాడు 

ఫెయిలైతే కుంగిపోవద్దంటున్న జైళ్లశాఖ డీఎస్పీ శివకుమార్‌గౌడ్‌ 

అపజయమే విజయానికి సోపానమంటారు పెద్దలు. అది నిజమేనని నిరూపించారు శివకుమార్‌ గౌడ్‌. ఈయనెవరనేదేనా మీ సందేహం. మన జిల్లాకు చెందిన వ్యక్తే. మొదట్లో పరీక్షల్లో ఫెయిలైనా ఆ అపజయాన్నే విజయానికి పునాదిగా మార్చుకుని సక్సెస్‌ బాట పట్టారు. అంతటితోనే ఆగకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఉన్నతస్థాయిలో నిలబడ్డారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు పరీక్షల్లో తప్పామని కుంగిపోకుండా గుండె నిబ్బరంతో విజయం కోసం తపించాలని శివకుమార్‌ గౌడ్‌ పిలుపునిస్తున్నారు. 

సాక్షి, కామారెడ్డి : పరీక్ష తప్పితే కుంగిపోనవసరం లేదు.. పట్టుదలతో చదివితే సక్సెస్‌ కావచ్చు.. ఉన్నతస్థాయికి ఎదగొచ్చునని రుజువు చేశారు శివకుమార్‌గౌడ్‌. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన శివకుమార్‌గౌడ్‌ పదో తరగతి వరకు సొంత ఊల్లోనే చదివాడు. ఇంటర్మీడియట్‌ చదివేందుకు కామారెడ్డి పట్టణానికి చేరుకున్నాడు. 1987–89లో స్థానిక జీవీఎస్‌ కాలేజీలో ఇంటర్‌ ఎంపీసీ చదివిన శివకుమార్‌ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌లో ఫెయిలయ్యాడు. అప్పుడు 150 మార్కులకు 53 మార్కులు వస్తే పాస్‌ అవుతారు. అయితే ఆయనకు 43 మార్కులు మాత్రమే వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్‌ అయ్యానని కుంగిపోలేదు. కసితో చదివాడు. సప్లిమెంటరీలో రాసి పాసయ్యాడు. ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులు సాధించాడు. అప్పుడు 643 మార్కులతో ఎంపీసీలో క్లాస్‌ సెకండ్‌గా, కాలేజీలో థర్డ్‌ ర్యాంకర్‌గా నిలిచాడు. ఏ మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టు ఆయన్ను ఇబ్బంది పెట్టిందో దాని మీదే ఎక్కువ దృష్టి సారించాడు.

డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్‌ సబ్జెక్టును ఎంచుకున్నాడు. 1989–1992 సంవత్సరంలో ఆయన మ్యాథ్స్‌కు సంబంధించి నాలుగు పేపర్లు రాశాడు. రెండింటిలో 150 మార్కులకు 150 మార్కులు, ఒకదానిలో 139, మరొకదానిలో 142 మార్కులు సాధించి కాలేజీలో మంచి గుర్తింపు పొందాడు. 89 శాతం మార్కులతో కాలేజీ టాపర్‌గా నిలిచాడు. 1992–94లో ఉస్మానియా పరిధిలోని నిజాం కాలేజీలో ఆయన పీజీలో 90 శాతం మార్కులు సాధించి యూనివర్సిటీలో నాలుగో ర్యాంకు సాధించాడు. 1994–96లో నాగార్జన సాగర్‌లో బీఈడీ చదివారు. అక్కడా ఏడో ర్యాంకు సాధించారు. 1996లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికైన శివకుమార్‌గౌడ్‌ 2002 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత 2002లో జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికై 2012 వరకు రామారెడ్డి, కామారెడ్డి కాలేజీల్లో పని చేశాడు. లెక్చరర్‌గా పని చేస్తూనే గ్రూప్‌–1కు ప్రిపేర్‌ అయ్యాడు. 2008లో అప్లయి చేసిన ఆయ న 2011లో జరిగిన పరీక్షలో నెగ్గాడు. 2012లో ఆయనకు జైళ్ల శాఖ డీఎస్పీ పోస్టింగ్‌ ఇచ్చారు. వరంగల్‌లో తరువాత కరీంనగర్‌లో ఆ తరువాత మహబూబ్‌నగర్‌లో ప్రస్తుతం సంగారెడ్డి జైల్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  

ఆ మార్కులే గ్రూప్‌–1 సక్సెస్‌కు కారణం.. 
శివకుమార్‌గౌడ్‌ గ్రూప్‌–1లో సక్సెస్‌ కావడానికి మ్యాథ్స్‌లో వచ్చిన మార్కులే కారణం కావడం విశేషం. ఇంటర్‌లో ఏ సబ్జెక్టులో అయితే ఆయన ఫెయిల్‌ అయ్యాడో, తరువాత అదే సబ్జెక్టు ఆయన జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి. గ్రూప్‌–1 ఎగ్జామ్‌లో మ్యాథ్స్‌కు సంబంధించి 150 మార్కులు ఉంటాయి. అందులో శివకుమార్‌గౌడ్‌కు 143 మార్కు లు వచ్చాయి. అన్ని మార్కు లు రావడం కారణంగానే గ్రూప్‌–1 ఉద్యోగం వచ్చిం దని చెబుతారు శివకుమార్‌గౌడ్‌.

విద్యార్థులు కుంగిపోవద్దు.. 
గెలుపు ఓటములు అనేవి సహజం. టెన్త్, ఇంటర్‌లో ఫెయిల య్యాన ని కుంగిపోతే పెద్ద నష్టమే జరుగుతుంది. ఫెయిలైన సబ్జెక్టుకు సం బంధించి మరింత కసితో చదివితే సక్సెస్‌ కావొచ్చు. ఫెయిల్‌ అయినవారంతా ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరూ మిగలరు. ధైర్యంగా చదవాలి. ముందుకు సాగాలి. ఫెయిలై సక్సెస్‌ అయిన వ్యక్తుల్లో నేనొకరిని. ప్రతి ఒక్కరూ ధైర్యంగా అడుగులు వేస్తే తప్పకుండా సక్సెస్‌ అవుతారు.  – శివకుమార్‌గౌడ్, సంగారెడ్డి జైల్‌ సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు