పడకేసిన పారిశుధ్యం

21 Aug, 2018 12:31 IST|Sakshi
కుప్పలు తెప్పలుగా చెత్త

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఎడతెరిపిలేని వర్షాలతో గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి. మరోవైపు పారిశుధ్య కార్మికులు నెలరోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి గ్రామాలన్నీ కంపుకొడుతున్నాయి. ఎటు చూసినా పాత బొందలు, గుంతల్లో నీళ్లు నిలిచి దోమలకు నిలయాలుగా మారాయి. దోమకాటుతో గ్రామాలకు గ్రామాలే మంచం పడుతున్నాయి. విషజ్వరాల బారిన  పడినవారు ఇంటికో బాధితుడు అన్నట్లు తయారైంది. ఇదిలా ఉంటే గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. వర్షాలు ఒక వైపు దంచికొడుతుంటే.. దోమ కాటుతో విషజ్వరాలు, మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం గ్రామాల్లో వైద్యసేవలకు ఉపక్రమించకపోవడంతో బతుకుజీవుడా అన్నట్లు ప్రజలు అల్లాడుతున్నారు. పరిస్థితి చేయిదాటినా ప్రభుత్వం ఇంతవరకు కళ్లు తెరవకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి ఆర్థికంగా నష్టపోతున్నారు.
 
పాలనా కొత్తదే..
ఆగష్టు 2తో గ్రామపంచాయితీల పాలకవర్గాల పాలన ముగియడంతో స్పెషల్‌ ఆఫీసర్లను నియమించారు. వీరు పాలనకు కొత్త కావడం గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అంతగా అనుభవం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పరిస్థితులు పూర్తిగా తారుమారు కావడంతో స్పెషలాఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. మురుగు, చెత్త నిల్వలు లేకుండా చూసేందుకు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇక చేసేదేమి లేక చేతులెత్తే పరిస్థితి వచ్చింది. తాగునీటికి క్లోరినేషన్‌ చేసి అందించడంతో పాటు ఎక్కడా మురుగునీరు కలువకుండా, లీకేజీల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపై అవగాహన ఉన్న అధికారులు సైతం తక్కువగా ఉండడంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి.
 
హెల్త్‌ ఎమర్జెన్సీపై దృష్టేది..?
ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో జ్వరపీడితులు పెరుగుతున్నారు. విషజ్వరాల బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించి వైద్య సేవలు అందించాల్సిన జిల్లా వైద్య యంత్రాంగం ఏమీ జరగనట్లుగానే ఎప్పటిలాగే వ్యవహరిస్తోంది. ఈ నెల రోజుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వైద్య సేవలు పెంచలేకపోతోంది. గ్రామాల్లో ప్రత్యేక బృందాలతో వైద్య సేవలు అందించాల్సింది పోయి నెలకోసారి వైద్య సేవలు అందిస్తుండడంతో పల్లెలు రోగాల బారి నుంచి బయటపడలేకపోతున్నాయి. పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మారుమూల గ్రామాల ప్రజలు ఆర్‌ఎంపీలను నమ్ముకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు వారి ఆర్థిక పరిస్థితులు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది.

ఆరోగ్యం, పారిశుధ్యంపై నేడు మంత్రి రాజేందర్‌ సమీక్ష..
గ్రామాల్లో నెలకొన్ని పరిస్థితులను చక్కదిద్దేందుకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మంగళవారం ఆరోగ్యం, పారిశుధ్యంపై నగరంలోని పద్మనాయక కళ్యాణమండపంలో ఉదయం 10 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల డీపీవోలు, స్పెషల్‌ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపరిచి, జ్వరపీడితులకు వైద్య సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు