నిధులిస్తేనే స్వచ్ఛత!

12 Oct, 2014 00:47 IST|Sakshi

పడకేసిన ‘జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్’
గ్రామాల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యపు నీడలు
పంచాయతీలకు నిధులు విదల్చని కేంద్రం

 
స్వచ్ఛ భారత్.. దేశవ్యాప్తంగా ఓ ఉద్యమంలా సాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమం.. ఇంటి నుంచి మొదలై.. దేశాన్నంతా పరిశుభ్రంగా ఉంచాలనే తలంపుతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి వెల్లువలా మద్దతు వస్తోంది. అయితే ఇది పట్టణాల్లో కాస్త ఫలితమిస్తున్నా పల్లె జనంలో చైతన్యం తేలేకపోతోంది. మురికి కూపాలుగా మారిన పల్లెల్లో శాశ్వత పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) పడకేసింది.

ఈ మిషన్ ద్వారా పంచాయతీలకు అందాల్సిన రూ.10వేలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరి స్థితి. ఆ నిధులొస్తేనే పారిశుద్ధ్య పనులు చేపట్టేది. జిల్లాలో 684 పంచాయతీలున్నాయి. పారిశుద్ధ్య నిధుల కింద జిల్లాకు రూ.68.4లక్షలు రావాల్సి ఉంది. ఈ నిధుల విడుదలలో అంతులేని జాప్యం కారణంగా పల్లెలన్నీ మురికికూపాలుగా మారాయి.
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో పారిశుద్ధ్యం పనులు అటకెక్కాయి. పంచాయతీ ఖాతాల్లో పారిశుద్ధ్య పనులకు వెచ్చించేందుకు చిల్లిగవ్వ లేదు. దీంతో సర్పంచ్‌లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైపు చూస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10వేలు విడుదల చేస్తుంది. గ్రామ సర్పంచ్, ఆరోగ్య కార్యకర్తల ఉమ్మడి ఖాతాలో ఈ నిధులు జమ చేస్తారు. వీటితో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపడతారు.

జిల్లాలో 684 గ్రామ పంచాయతీలున్నాయి. పారిశుద్ధ్య నిధుల కింద జిల్లాకు రూ. 68.4లక్షలు రావాల్సి ఉంది. ఈమేరకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నెలరోజుల్లో ఈ నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ 2014-15 వార్షిక సంవత్సరం ప్రారంభమై ఆర్నెళ్లు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధుల ఊసెత్తకపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పడకేశాయి. వాస్తవానికి వర్షాకాలం మునుపే ఈ నిధుల విడుదలైతే.. వాటితో సీజన్ ప్రారంభానికి ముందే పారిశుద్ధ్య పనులు చేపట్టేవారు. కానీ నిధుల జాడ లేకపోవడంతో పనులు ముం దుకు సాగలేదు. ఫలితంగా పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.

కదలని యంత్రాంగం..
పరిశుభ్రమైన సమాజం కోసం తలపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై యువత, స్వచ్ఛంధ సంస్థలు హడావుడి చేస్తున్నా.. అధికారగణం నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో జిల్లాలో పారిశుద్ధ్య చైతన్య కార్యక్రమం ముందుకు సాగడంలేదు. కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటిసరఫరా విభాగం, పంచాయతీ శాఖలు పారిశుద్ధ్య పనుల్లో భాగస్వామ్యమైన దాఖలాలు లేవు. శానిటేషన్ నిధులు అందకపోవడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టలేదని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడగా.. తాగునీటి సమస్యల పరిష్కారంలో బిజీ అయ్యామంటూ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరు పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు