ఆన్‌లైన్‌ 'కరోనా'

21 Mar, 2020 09:27 IST|Sakshi
ఆన్‌లైన్‌ సైట్లలో హ్యాండ్‌ శానిటైజర్‌ నోస్టాక్‌ అని చూపిస్తున్న దృశ్యం

ఊపందుకున్నఅమ్మకాలు  

20 నుంచి 30 శాతం పెరిగిన విక్రయాలు  

శానిటైజర్లు, ఔషధాలదే అగ్రస్థానం

కుత్బుల్లాపూర్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ వణికిస్తున్న కరోనా (కోవిడ్‌ –19) ప్రభావం ప్రత్యక్ష కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అన్ని దేశాలు దాదాపుగా ‘షట్‌ డౌన్‌’ దిశగా అడుగులు వేస్తున్నాయి. పెద్ద పెద్ద మాల్స్, వస్త్ర దుకాణాలు, ఫుడ్‌ రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా అన్నింటిలో కస్టమర్లు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా అప్రమత్తతతో వినియోగదారులు కూడా షాపింగ్‌ చేయడం, రెస్టారెంట్లకు వెళ్లి గడపడం దాదాపుగా మానేశారు. ఇలాంటి తరుణంలో ఆన్‌లైన్‌ సేల్స్‌ ఊపందుకున్నాయి. పండగలకు, పెళ్లిళ్లకు బట్టలు, నిత్యవసర సరుకులు, మందులు ఇలా అన్నింటినీ బయట తిరగకుండా ఆన్‌లైన్‌లో తెప్పించుకుంటున్నారు నగరవాసులు.

వేరే ఆలోచనే లేదు..  
సాధారణ రోజుల్లో ఉండే అమ్మకాల కన్నా కోవిడ్‌ నేపథ్యంలో ఆన్‌ లైన్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ సేల్స్‌ దిగ్గజాలు గంతంలో కన్నా అమ్మకాలను గత 20 రోజులలో 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుకున్నాయి. ఎక్కువగా ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) ప్రొడక్ట్‌ డెలివరీలు ఎక్కువగా చేస్తున్నాయి. ఉప్పులు, పప్పులు, సబ్బులు, పేస్టులు ఇలా అన్నింటినీ హోమ్‌ డెలివరీ డిస్కౌంట్‌ రేట్లలో ఇస్తుండటంతో ఏమాత్రం అలోచించకుండా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేస్తున్నారు నగరవాసులు. కోవిడ్‌–19 స్వీయ నియంత్రణ తరుణంలో కొత్త ఆన్‌లైన్‌ కస్టమర్లు కూడా ఇదే స్థాయిలో పెరగడం విశేషం. నిత్యవసర సరుకుల అమ్మకాలలో బిగ్‌బాస్కెట్, గోపర్స్‌ వంటి సైట్లు మెట్రో నగరాలలో తమ కస్టమర్లను 100 శాతం వరకు పెంచుకున్నాయి అంటే ఎంత మేర ఆన్‌లైన్‌ అమ్మకాలు జరుగుతున్నాయో అర్థమవుతున్నది.

డిస్కౌంట్‌ లేకున్నా..   
మార్కెట్లలోనే కాదు ఆన్‌లైన్‌ సైట్లలో కూడా శానిటైజర్, మాస్కులకు మంచి డిమాండ్‌ ఉంది. ఎంతలా అంటే నిన్నటి వరకు ఆఫర్‌ పెట్టి మాస్కులను, శానిటైజర్లను అమ్మకాలు సాగించిన ఆన్‌లైన్‌ సైట్లు ఇప్పుడు నో స్టాక్‌ అని చెబుతున్నాయి. శానిటైజర్లు అందుబాటులో లేకపోయినప్పటికీ మాస్క్‌లు మాత్రం ఆన్‌లైన్‌లో కూడా ఎక్కువ ధరలలో లభిస్తున్నాయి. ఈ వస్తువులు ఒక వేళ అందుబాటులోకి వచ్చిన కొన్ని గంటలలోనే అమ్ముడుపోతున్నాయి. 

జోరందుకున్న ఔషధాల అమ్మకాలు   
నిత్యావసర వస్తువులలో అంతర్భాగమైన మెడిసిన్‌ అమ్మకాలు కూడా ఆన్‌లైన్‌లో జోరందుకున్నాయి. పోటీ వ్యాపారంలో నిన్నటి వరకు డిస్కౌంట్లు ఇచ్చి అమ్మకాలు చేసిన వారు ఇప్పుడు ఎంఆర్‌పీ రేట్లకే అమ్మకాలు చేçస్తున్నాయి. దీంతో చాలా మంది ఆన్‌లైన్‌లో ఔషధాలు విక్రయించే సైట్లలో ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. డాక్స్‌ యాప్, 1ఎంజీ, డాక్టర్‌ సీ వంటి సంస్థలు యాప్‌ల ద్వారా ఔషధ విక్రయాలను అందుబాటులో ఉంచాయి. అయితే వీటిలో ఔషధాలు కొనుగోలు చేయాలంటే ప్రిస్క్రిప్షన్‌ ఖచ్చితంగా ఉండాలి.

మరిన్ని వార్తలు