ఎస్సీ, ఎస్టీ కోర్టులో సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌

14 Aug, 2018 15:23 IST|Sakshi

నేడు విచారణ చేపట్టనున్న న్యాయస్థానం

కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరే అవకాశం

నిజామాబాద్‌ లీగల్‌(నిజామాబాద్‌ అర్బన్‌) : లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన మాజీ మేయర్‌ డి.సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జిల్లా జైలులో ఉన్న సంజయ్‌.. బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి.. ఇరు పక్షాల వాదనలు వినేందుకు వీలుగా విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, జిల్లా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు కృపాకర్‌రెడ్డి, ఆకుల రమేశ్‌.. సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నిరాధారమైన ఆరోపణలతో సంజయ్‌ను కేసులో ఇరికించారని, లైంగిక వేధింపులకు సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇరుపక్షాల వాదనాలు వినేందుకు వీలుగా విచారణను వాయిదా వేస్తూ ఎస్పీ, ఎస్టీ కోర్టు స్పెషల్‌ జడ్జీ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. 

కస్టడీకి కోరనున్న పోలీసులు? 

జిల్లా జైల్‌లో రిమాండ్‌లో ఉన్న సంజయ్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. సంజయ్‌ ను పూర్తిగా విచారించేందుకు తమకు తగిన సమయం లేకుండా పోయిందని, రిమాండ్‌ లో ఉన్న అతడిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంగళవారం కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖాలు చేయనున్నట్లు సమాచారం. పోలీసులు వేసే కస్టడీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు తెలిపారు.

మరోవైపు, కేసు డైరీకి సంబంధించిన వివరాలను పోలీసు లు సకాలంలో పీపీకి అందించక పోతే, బెయిల్‌ పిటిషన్‌పై పీపీ కోర్టును తగినంత సమయం అడిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషన్‌పై గురువారం వరకు వాదనలు జరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే, బుధవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోర్టుకు సెలవు ఉంటుంది. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సంజయ్‌ జిల్లా జైలులోనే ఉండాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు