వార్డు మెంబర్‌గా ఓడి.. ఎమ్మెల్యేగా గెలిచి..

10 Nov, 2018 08:28 IST|Sakshi
మాజీ మంత్రి శనిగరం సంతోష్‌ రెడ్డి

విద్యార్థి నాయకుడిగా  తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర

 నాలుగుసార్లు ఎమ్మెల్యేగా  గెలుపొంది మంత్రి పదవులు 

శనిగరం సంతోష్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం

 సాక్షి, ఆర్మూర్‌ (నిజామాబాద్‌) : తన సొంత గ్రామమైన సిరికొండ మండలం ముచ్కూర్‌లో వార్డు మెంబర్‌గా ఓటమి పాలైన శనిగరం సంతోష్‌ రెడ్డి తరువాతి కాలంలో రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర కేబినెట్‌లో అత్యున్నతమైన మంత్రి పదవులను నిర్వహించారు. కళాశాల విద్యనభ్యసిస్తున్న రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న శనిగరం సంతోష్‌రెడ్డి తరువాత కాలంలో నాలుగు పర్యాయాలు ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రాష్ట్ర కేబినెట్‌లో ఉన్నత పదవులను అలకరించి రాజకీయ చతురుడిగా, మృదు స్వభావిగా గుర్తింపు సాధించుకున్నారు. 1964–65లో కళాశాల విద్యనభ్యసిస్తున్న రోజుల్లో నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాల జనరల్‌ సెక్రెటరీగా సంతోష్‌రెడ్డి ఎన్నికయ్యారు. 1966–67లో కళాశాల అధ్యక్షుడిగా కొనసాగారు. బడుగు, బలహీనవర్గాల నేత, మాజీ మంత్రి అర్గుల్‌ రాజారాం, సంతోష్‌రెడ్డి బావ అయిన స్వాతంత్ర సమరయోధుడు బీఆర్‌ గంగారెడ్డి స్ఫూర్తి, ప్రోద్భలంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

1969లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో అర్గుల్‌ రాజారాంతో కలిసి పాల్గొన్ని జైలుకు సైతం వెళ్లారు. 1970లో తన స్వస్థలమైన భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్‌ గ్రామ పంచాయతీ మెంబర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1971లో జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, నిజామాబాద్‌ బీడీ మజ్దూర్‌ సంఘ్‌ జనరల్‌ సెక్రెటరీగా ఎన్నుకోబడ్డారు. 1975లో యువజన కాంగ్రెస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా నియమింపబడ్డారు. తన రాజకీయ గురువుల సహకారంతో 1978లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నాటి నుంచి ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే ఏడాది మొట్టమొదటి సారిగా శాసనసభకు ఎన్నిక కావడం విశేషం. 1983లో సినీ నటుడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా తెలుగుదేశం అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందారు. ఆ సమయంలో సంతోష్‌రెడ్డి ఆర్మూర్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. 1985లో టీడీపీ అభ్యర్థి ఏలేటి మహిపాల్‌రెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు.

1989లో టీడీపీ అభ్యర్థి వేముల సురేందర్‌రెడ్డిపై విజయం సాధించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1990 – 91 వరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, 1991– 92 వరకు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా, 1992–93 వరకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్‌లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1994లో టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణపై ఓటమి పాలయ్యారు. 1999లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 3,500 స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. తన రాజకీయ జీవితం ముగిసిందన్న సమయంలో మంత్రి చెన్నారెడ్డితో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం గడిపిన అనుభవంతో అదే నినాదంతో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌లో చేరి 2001లో భీమ్‌గల్‌ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. మెజార్టీ సభ్యుల బలంతో నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2004 ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌ పదవికి రాజీనామా సమర్పించి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఆర్మూర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

టీఆర్‌ఎస్‌లో అసమ్మతి బాట పట్టి కాంగ్రెస్‌ వాదిగా కొనసాగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన తన పదవీ కాలం ముగియకముందే రాజీనామా సమర్పించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇకముందు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని సంతోష్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. తాను కాంగ్రెస్‌లో చేరకున్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఉన్న సత్సంబంధాలతో తన తనయుడు శనిగరం శ్రీనివాస్‌రెడ్డి(వాసు)ని 2009 ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీకి నిలిపారు. శ్రీనివాస్‌ రెడ్డి ఓటమి పాలవడంతో అమెరికాకు వెళ్లిపోయాడు.

అయినా సంతోష్‌ రెడ్డి తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో విభేదించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తిరిగి దిగ్విజయ్‌ సింగ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకపోవడంతో నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు