ఆర్థిక బాధలతోనే ఈ పనిచేశా

1 Jul, 2018 02:56 IST|Sakshi

పలు వ్యాపారాలు చేసి రూ.కోటిన్నర నష్టపోయాను

పోలీసుల విచారణలో నకిలీ వేలిముద్రల నిందితుడు సంతోష్‌  

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ వేలిముద్రలు తయారుచేసిన సంతోష్‌కుమార్‌ను శనివారం కౌంటర్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారించారు. సంతోష్‌ డౌన్‌లోడ్‌ చేసిన ఆధార్‌ కార్డులు ఫింగర్‌ ప్రింట్ల కోసమే వాడినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇతడికి ఏ తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని, డబ్బుకోసం మాత్రమే సంతోష్‌ ఈ నేరానికి పాల్పడ్డాడని నిర్ధారించారు.

2013 డిసెంబర్‌ నుంచి వొడాఫోన్‌ డీలర్‌గా పనిచేస్తున్న సంతోష్‌ ఐదేళ్లపాటు శ్రమిస్తే తనకు ఏడాదికి రూ.20 వేలే ఆదాయం వచ్చిందన్నాడు. జియో సిమ్‌ రావడంతో వొడాఫోన్‌ సిమ్‌ల కొనుగోలు తగ్గిందని పోలీసులకు వెల్లడించాడు. వొడాఫోన్‌ను మోసం చేయడంలో భాగంగానే నకిలీ సిమ్‌ కార్డుల యాక్టివేషన్‌ కోసం ప్లాన్‌ చేశానని, ఈ ఏడాది జనవరి నుంచి ఆధార్, ఫింగర్‌ ప్రింట్ల డౌన్‌లోడ్‌ చేస్తున్నట్టు అంగీకరించాడు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన భూ సర్వే నెంబర్లు సేకరించి ఆధార్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేయాలనుకున్నానన్నారు.

యంత్రం, రబ్బర్‌ స్టాంపులు, పాలిమార్‌ లిక్విడ్, గేట్‌వే పేపర్‌కు రూ.12వేలు మాత్రమే ఖర్చయ్యాయని వెల్లడించాడు. వీటిని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్, ఈసీ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేయడం మొదలు పెట్టానని, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన రైతుల ఆధార్, ఫింగర్‌ ప్రింట్లను డౌన్లోడ్‌ చేశానన్నాడు. ఇలా రోజుకు 200 నుంచి 300 డౌన్లోడ్‌ చేసేవాడినని సంతోష్‌ అంగీకరించాడు.

గత ఎనిమిదేళ్లలో తాను వివిధ వ్యాపారాలు చేసి కోటిన్నర రూపాయలు నష్టపోయానని పోలీసులకు తెలిపాడు. ఆర్థికంగా నిలబడడం కోసం మాత్రమే ఈ పని చేశానని అంగీకరించాడు. సిమ్‌ కార్డు యాక్టివేషన్‌ చేసి, తర్వాత ఆ ఆధార్‌ కార్డును ఫింగర్‌ ప్రింట్‌ పేపర్లను కాల్చేసినట్టు చెప్పారు. అయితే సంతోష్‌ను మరోసారి విచారించేందుకు కస్టడీ కోరామని పోలీసులు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు